ప్రాణాలు తీస్తున్న వడదెబ్బ


సూర్యభగవానుడు అగ్నిగోళమై మండుతున్నాడు. వడగాల్పులతో జనం బిక్కచచ్చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మంగళవారం మరో ముగ్గురు బలికావడంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. పెద్దదిక్కును కోల్పోయి ఆయా కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. 

 

గుంతకల్లు రూరల్‌: గుంతకల్లు మండలంలోని వై.టి.చెరువు గ్రామంలో చిన్నాయప్ప అలియాస్‌ ఆంజనేయులు(52) అనే వ్యవసాయ కూలీ వడదెబ్బతో మృతి చెందారు. సోమవారం కూలీ పనులకు వెళ్లొచ్చిన ఆయన రాత్రి ఇంటికి చేరుకున్నారని బంధువులు తెలిపారు. నీరసం, తలనొప్పిగా ఉందంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు చెప్పారు. ఆ వెంటనే ప్రాణం వదిలినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య సోమక్క, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రావిురెడ్డి(వైవీఆర్‌) మంగళవారం ఉదయాన్నే గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు దశరథరెడ్డి, శంకర్, జయరావిురెడ్డి, మద్దన్న, జయన్న, సిపాయి బాషా, గోపాల్, నరసింహులు, పక్కీరప్ప ఉన్నారు.

 

డి.చెర్లోపల్లిలో మరొకరు...

బత్తలపల్లి (ధర్మవరం): బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లిలో గుజ్జల కృష్ణమూర్తి(55) వడదెబ్బతో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం కూలీ పనులకు వెళ్లిన అతను సాయంత్రం ఇంటికి రాగానే తీవ్ర తల, ఒళ్లు నొప్పులతో అస్వస్థతకు గురైనట్లు వివరించారు. తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.  



నాయనపల్లిలో ఇంకొకరు...

నార్పల(శింగనమల): నార్పల మండలం నాయనపల్లిలో వల్లెపు ఆదినారాయణ(69) అనే గొర్రెల కాపరి వడదెబ్బకు గురై మంగళవారం సాయంత్రం మరణించినట్లు బంధువులు తెలిపారు. ఉదయం పొట్టేళ్లను మేత కోసం తోలుకెళి్లన ఆయన, మధ్యాహ్నం 3 గంటలకు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయినట్లు వివరించారు. తోటి కాపర్లు చికిత్స కోసం నాయనపల్లి క్రాస్‌లోని ఆస్పత్రి వద్దకు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు అక్కడి వైద్యుడు నిర్ధారించారన్నారు. మృతుని భార్య, కుమారుడు అనాథలయ్యారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top