రావ‌మ్మా.. చినుక‌మ్మా...

రావ‌మ్మా.. చినుక‌మ్మా... - Sakshi


ఆదిలోనే ఖ‌రీఫ్ క‌ష్టాలు

* ముందు మురిపించి.. ముఖం చాటేసిన వరుణుడు

* దుక్కులు దున్ని.. విత్తనాలు సిద్ధం చేసిన రైతులు

* అదను దాటితే అంతే..   అన్నదాతల ఆందోళన


మిరుదొడ్డి : ‘వరుణదేవా కరుణించు.. వర్షాలు సమృద్ధిగా కురిపించి ఆదుకో..’ అంటూ ప్రజలు కప్పలకు జలాభిషేకాలు.. దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. అయినా వరుణుడు కరుణ చూపడంలేదు.  ఈసారి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సైతం చెప్పడంతో అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవడమే కాక పొలాలను దుక్కులు దున్ని సిద్ధం చేశారు.



రెండేళ్లుగా కరువుతో అతలాకుతలమైన రైతులు ఈ యేడాది కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యారు. సరైన వర్షాలు కురవాల్సిన సమయంలో వరుణుడు మాత్రం దోబూచులాడుతున్నాడు. తొలకరితో పలకరించిన వరుణుడు ముఖం చాటే యడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. తొలకరితో మురిపించిన వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఆశ నిరాశల మధ్య రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా  వ్యవసాయ అధికారులు సూచన మేరకు మండల పరిధిలోని అందె, అల్వాల, చెప్యాల, త డ్కపల్లి, లింగుపల్లి, మల్లుపల్లి, రుద్రారం, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, మాదన్నపేట, అల్మాజీపూర్, ఖాజీపూర్, బేగంపేట, భూంపల్లి, అక్బర్‌పేట, కూడవెళ్ళి, మోతె, కాసులాబాద్, మిరుదొడ్డి, అక్ష్మినగర్, ఆరెపల్లి, ధర్మారం, కొండాపూర్ తదితర గ్రామాల్లో పత్తి సాగు కంటే మొక్క జొన్న సాగుకు ఉత్సాహం చూపారు. రైతులు వేలకు వేలు పెట్టుబడి పెట్టి ఎరువులు, విత్తనాలు కొనుక్కున్నారు. దుక్కులు దున్నుకుని విత్తనాలు చల్లుకున్నారు. విత్తనాలు చల్లుకున్న రైతులకు వరుణ దేవుడు ఆశని పాతంగా మారాడు.

 

గ్రామ దేవతలకు పూజలు

వర్షాలు లేక వేసిన విత్తనాలు మొలకెత్తక పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వరుణ దేవుడు కరిణించాలని రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు. చిన్నారులు కప్పకావడి ఆడుతూ వరుణదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలకు బదులుగా ఎండలు దంచి కొడుతుండటంతో మరి కొందరు రైతులు దుక్కులు దున్ని విత్తనాలు చల్లుకోవాలా వద్దా అన్న అయోమయానికి గురవుతున్నారు.



ముందస్తు విత్తిన విత్తనాలు మొలకెత్తక పోవడంతో మరోసారి విత్తనాలు కొనుగోలు చేసి దుక్కులు దున్నుకుని విత్తుకున్నారు. దీంతో పెట్టుబడులు మరింత తలకు మించిన భారంగా మారడంతో ఆవేదన  చెందుతున్నారు. కాగా రైతు చైతన్య సదస్సులు నిర్వహించిన వ్యవసాయ అధికారులు ముందస్తు చర్యగా పత్తి సాగు చేయవద్దని హెచ్చరించడంతో 75 శాతం మంది రైతులు పత్తి సాగుకు దూరంగా ఉన్నారు. మొక్కజొన్న సాగుతో సరిపెట్టుకున్నా సరైన వర్షాలు లేక ఆందోళన చెందుతున్నారు.

 

వర్షాలు కురిస్తేనే వరి సాగుకు అనుకూలం

సీజన్‌లో సంవృద్ధిగా వర్షాలు పడితే వాగులు వంకలు, చెరువులు కుంటలు నిండే అవకాశం  ఉంది. కరువు పరిస్థితుల రిత్యా రెండేళ్ళ నుంచి చెరువులు, కుంటలు వాగుల్లో నీరు లేక వెలవెలబోతున్నాయి. వర్షాలతో చెరువులు నిండితే వరి సాగు అయ్యే అవకాశాలు ఉన్నాయి. చెరువుల ఆయకట్టు కింద సాగయ్యే పొలాలు సస్యశ్యామలంగా మారుతాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 25 రోజులు గడుస్తున్నా అనుకున్న స్థాయిలో వర్షాలు లేక పోకవడంతో ఆయకట్టు రైతులు వరి సాగుపై ఆందోళన చెందుతున్నారు. చెరువుల్లో నీరు లేక ప్రస్తుతం ఆయకట్టు పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.

 

సాగు చేయాలా?.. వద్దా?

భూమి తడిసేలా వానలు పడుతలేవు. చాలా మంది దుక్కి దున్ని విత్తనాలు వేసినా మొలవలేదు. రెండోసారి పెట్టుబడులు పెట్టి మళ్ళీ విత్తనాలు కొనుక్కుని చల్లుకుంటున్నారు. ఈ దశలో మాకు ఉన్న రెండెకరాల్లో విత్తనాలు చల్లుకోవాలా? వద్దా? అన్న అయోమయానికి గురవుతున్నాం.

- కనకవ్వ, మహిళారైతు

 

వర్షం కోసం ఎదురు చూపు

వర్షాలు కురుస్తాయన్న ఆశతో రెండెకరాల్లో మొక్కజొన్న విత్తనాలు చల్లుకున్నా. వర్షాలు కురవాలని గ్రామదేవతలకు పూజలు, కప్ప కావడి ఆడుతూ వరుణ దేవుణ్ని వేడుకుంటున్నాం. భూమిలో పడ్డ విత్తనాలు మొలవలేదు. వ ర్షం కోసం ఆకాశంపైపు ఎదురు చూస్తున్న.

- భూమరాజయ్య, రైతు

 

విత్తనాలు మొలవలేదు

 తొలకరి వర్షాలతో ముందస్తు దుక్కులు దున్నుకుని విత్తనాలు ఎరువులు చల్లుకున్నాను. సరిగ్గా 15 రోజులు గడుస్తున్నా సరైన వర్షాలు లేక విత్తనాలు మొలవనే లేదు. ఎండకు పూర్తిగా మాడిపోయాయి. ఇక చేసేది లేక మరోసారి విత్తనాలు కొనుగోలు చేశా. వర్షం పడితే విత్తనాలు చల్లుకుందామనుకుంటున్న

-   సంతోష్, రైతు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top