ప్రభుత్వ లాంఛనాలతో ‘కేశ్‌పల్లి’ అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో ‘కేశ్‌పల్లి’ అంత్యక్రియలు


అశ్రునయనాల మధ్య గంగారెడ్డి అంతిమయాత్ర

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

పాల్గొన్న మంత్రులు పోచారం, ఐకే రెడ్డి

మెంట్రాజ్‌పల్లి ఫాంహౌస్‌లో దహన సంస్కారాలు




సోమవారం గుండెపోటుతో మృతిచెందిన కేశ్‌పల్లి గంగారెడ్డి(84) అంత్యక్రియలు మంగళవారం డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి శివారుల్లోని కేశ్‌పల్లి ఫాంహౌస్‌లో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అంతకు ముందు జిల్లాకేంద్రంలోని   సుభాష్‌నగర్‌లో గల ఆయన స్వగృహం నుంచి ఉదయం 10.30 గంటలకు గంగారెడ్డి అంతిమయాత్ర బయలుదేరింది. అంతిమయాత్రలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఐకేరెడ్డి, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

– డిచ్‌పల్లి/నిజామాబాద్‌ అర్బన్‌



డిచ్‌పల్లి (నిజామాబాద్‌రూరల్‌), నిజామాబాద్‌ అర్బన్‌ : నిజామాబాద్‌ మాజీ ఎంపీ, డిచ్‌పల్లి మాజీ ఎమ్మెల్యే, అపజయం ఎరుగని నేతగా పేరొందిన కేశ్‌పల్లి (గడ్డం) గంగారెడ్డి (84) అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం అధికార లాంఛనాలతో నిర్వహించారు. డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి శివారులోని కేశ్‌పల్లి ఫాంహౌస్‌లో పార్థీవదేహానికి  దహన సంస్కారాలు జరిగాయి.  అంతకు ముందు జిల్లాకేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల ఆయన స్వగృహం నుంచి ఉదయం 10.30 గంటలకు గంగారెడ్డి అంతిమయాత్ర బయలుదేరింది. అంతిమయాత్రలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్త, ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సుమనారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గంగాధర్‌రావు పట్వారీతో పాటు పలువురు ప్రజా ప్రతినిదులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.



సుభాష్‌నగర్‌ నుంచి పూలాంగ్,  మాధవనగర్, ధర్మారం(బి), నడిపల్లి, డిచ్‌పల్లి స్టేషన్‌ మీదుగా 44వ నెంబరు జాతీయ రహదారిపై మెంట్రాజ్‌పల్లి ఫాంహౌస్‌కు భారీ ర్యాలీగా అంతిమయాత్ర చేరుకుంది. దారి పొడవునా ప్రజలు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఫాంహౌస్‌లో గంగారెడ్డి భౌతిక కాయాన్ని చితిపై ఉంచగా, మంత్రులు ఐకే రెడ్డి, పోచారం శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. పోలీసులు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌గా గాలిలోకి మూడుసార్లు కాల్పులు జరిపారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య గంగారెడ్డి కుమారులు కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించారు. గంగారెడ్డి  పెద్దకుమారుడు ఆనంద్‌రెడ్డి చితికి నిప్పంటించారు. అభిమానులు పెద్ద ఎత్తున కేశ్‌పల్లి గంగారెడ్డి అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు.



అనంతరం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ 1991లో తామిద్దరం ఒకేసారి పార్లమెంట్‌ సభ్యులుగా గెలిచామన్నారు. గంగారెడ్డి మూడు సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా పని చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయనతో నాకు రెండున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ అనుబంధం ఉందని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి పోచారం మాట్లాడుతూ కేశ్‌పల్లి గంగారెడ్డి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని సీఎం  ఆదేశించారన్నారు. ఆయన మృతి జిల్లా ప్రజలకు తీరని లోటని అన్నారు. అంతియయాత్రలో ఎమ్యెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి,  రాంచందర్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీ నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లెగంగారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి, డీసీసీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, రాష్ట్ర నాయకులు పొతంగల్‌ రాంకిషన్‌రావు, అల్జాపూర్‌ శ్రీనివాస్, ఆలూర్‌ గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, లోక భూపతిరెడ్డి, నరాల రత్నాకర్, గడుగు గంగాధర్, అమృతాపూర్‌ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.



కలెక్టర్‌ యోగితారాణా, కమీషనర్‌ కార్తికేయ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్, జేసీ రవీందర్‌రెడ్డి, తెయూ వీసీ ప్రొఫెసర్‌ సాంబయ్య, సీవోఈ కనకయ్య, ఆర్డీవో వినోద్‌కుమార్, ఏసీపీ ఆనంద్‌కుమార్, తహసీల్దార్‌ శేఖర్, ఎంపీడీవో మర్రి సురేందర్, సీఐలు తిరుపతి, రాజేశ్,  ఎస్సైలు కట్టా నరేందర్‌రెడ్డి, మురళి, శ్రీధర్‌గౌడ్, వివిధ పార్టీల నాయకులు, జిల్లా నలుమూలల నుంచి గంగారెడ్డి అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top