వచ్చే నెల 2నుంచి ‘కేసీఆర్‌ కిట్‌’

వచ్చే నెల 2నుంచి ‘కేసీఆర్‌ కిట్‌’ - Sakshi


గర్భిణుల వివరాలు వంద శాతం నమోదు చేయాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ ఎస్పీ.సింగ్‌

హాజరైన మూడు జిల్లాల కలెక్టర్లు




హన్మకొండ అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ పేరుతో గర్భిణుల కోసం ప్రత్యేక పథకాన్ని వచ్చే నెల 2నుంచి ప్రవేశపెట్టనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పీ.సింగ్‌ వెల్లడించారు. ఈ మేరకు జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఈ పథకం అమయ్యేలా గర్భిణుల వివరాలు సేకరించాలని ఆయన సూచించారు. చీఫ్‌ సెక్రటరీతో పాటు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, కమిషనర్‌ వాకాటి కరుణ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా హన్మకొండలోని అర్బన్‌ కలెక్టరేట్‌లో వీసికి వరంగల్‌ అర్బన్, రూరల్, జనగామ జిల్లాల కలెక్టర్లు అమ్రపాలి, ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, శ్రీదేవసేన హాజరయ్యారు. తొలుత కలెక్టర్లు మాట్లాడుతూ తమ జిల్లాల పరిధిలో గర్భిణుల వివరాలు పూర్తిస్థాయిలో సేకరించామని వివరించారు.



అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలి కాట మట్లాడుతూ జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ పథకం అమలుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే డాటా ఎంట్రీ పూర్తయిందని తెలిపారు. ఆస్పత్రుల్లో అవరమైన మౌళిక సదుపాయాలు కల్పించా మని వివరించారు. రూరల్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 4వేల గర్భిణుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నమోదు చేశామని తెలిపారు. ఏఎన్‌సీ చెకప్‌లు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 130 ప్రసవాలు జరిగాయని పేర్కొన్నారు. సీహెచ్‌సీల్లో డ్యూటీ డాక్టర్ల నియామకాలు చేపట్టాలని, తద్వారా రోగులకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. జనగామ కలెక్టర్‌ శ్రీదేవసేన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన సీహెచ్‌సీలకు పోస్టులు మంజూరు చేయాలని, మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు. తమ జిల్లాలో కేసీఆర్‌ కిట్‌ పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.



ప్రసవాల సంఖ్య పెరగాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పీ.సింగ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా కలెక్టర్లు, వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ మాట్లాడుతూ వైద్యుల పోస్టుల భర్తీకి కొంత సమయం పడుతుందని, ఈలోగా అవసరాలకు అనుగుణంగా పీహెచ్‌సీ వైద్యులను సీహెచ్‌సీలకు డిప్యూట్‌ చేయాలని సూచించారు. అలాగే, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధుల నుంచి స్టాఫ్‌ నర్సులను తీసుకోవాలన్నారు.సమావేశంలో డీఎంహెచ్‌ఓలు డాక్టర్‌ హరీష్‌రాజ్, డాక్టర్‌ అశోక్‌ ఆనంద్, డాక్టర్‌ అన్నప్రసన్న పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top