మీ బిడ్డనే..

మీ బిడ్డనే.. - Sakshi


గోదావరి నీళ్లతో మీ కాళ్లు కడుగుతా

అద్భుత ఫలితాన్నివ్వండి..

అభివృద్ధి బాధ్యత నాది..

ఖేడ్ బహిరంగసభలో సీఎం కేసీఆర్




నారాయణఖేడ్/ మనూరు/ రేగోడ్: ‘నేను మీ బిడ్డనే.. నేను మెదక్ జిల్లా వాసినే..’ అంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చేసిన ప్రసంగం తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఆయన ప్రసంగం ఆద్యంతం ప్రశ్నలు వేస్తూ.. ప్రజల చేత నినాదాలు చేయిస్తూ కొనసాగింది. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో భాగంగా బుధవారం పట్టణంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీఎం.. ‘ఖేడ్ అసలు మెదక్ జిల్లాలోనే ఉందా? ఉంటే ఇంత దారిద్య్రంతో ఎందుకు బాధపడుతోంది? అని అంతా అడుగుతున్నారు. ఈ దుస్థితి ఈ ఎన్నికతో పోవాలి’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.


‘గోదావరి నీళ్లతో గట్టులింగంపల్లి ప్రాజెక్టు కట్టి మీ కాళ్లు కడుగుతా’ అన్నప్పుడు సభకు హాజరైన జనం హర్షధ్వానాల తో స్పందించారు. హరీశ్‌రావులాంటి అద్భుతమై న మంత్రి జిల్లాకు ఉన్నప్పుడు ఇక బాధలుండవని అన్నారు. అతను ఈ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చే బాధ్యత నాదేనని కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల అనంతరం ఖేడ్‌లో రెండ్రోజులు మకాం వేస్తానని, అభివృద్ధి పనుల్ని దగ్గరుండి చేయిస్తానని అన్నారు. ‘మీరు గ్రేటర్ తరహా తీర్పునిస్తే.. నేను ఖేడ్‌ను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా’ అని ప్రకటించారు.


 టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం

బుధవారం ఇక్కడ నిర్వహించిన బహిరంగసభ దరిమిలా టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. సాయంత్రం సభాస్థలికి సీఎం కేసీఆర్ వచ్చే సరికే సభ ప్రాంగణం నిండిపోయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచే నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి జనం రాక మొదలైంది. 5 మండలాల నుండి ప్రజలు, పార్టీ కార్యకర్తలు సభకు తరలివచ్చారు. మంత్రి హరీష్‌రావు, సీఎం చంద్రశేఖరరావు ప్రసంగించినంత సేపూ హర్షధ్వానాలు మిన్నంటాయి. అదీగాక, కేసీఆర్ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఖేడ్‌కు రావడంతో జనం భారీగా హాజరయ్యారు. ఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి, వెనుకబాటుతనం, ముఠా సంస్కృతి, ఫ్యాక్షన్ రాజకీయాల గురించి సీఎం ప్రస్తావించడాన్ని పలువురు చర్చించుకున్నారు.


 ఇప్పుడొచ్చి చేసేది ఏమిటట?

గల్లీ నుంచి ఢిల్లీ దాకా అధికారంలో ఉన్నప్పుడు చేయని వారు ఇప్పడు కొత్తగా అభివృద్ధి చేస్తామంటే నమ్మేదెలా అని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రశ్నించారు. బహిరంగసభలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తరువాత ఆమె ప్రసంగించారు. ఇన్నాళ్లూ ఇక్కడి పాలకులు నీటి వనరుల గురించి పట్టించుకోకపోవడం వల్లనే భూములు తడారాయన్నారు. ఆంధ్రా పాలనలో కనీసం చెరువుల్లో మట్టి తీయలేదని, చెక్‌డ్యాంలు నిర్మించలేదన్నారు.


టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి వనరుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇన్నాళ్లూ మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదని ప్రజలకు సూచించారు. ఖేడ్ నియోజకవర్గ ప్రజలు భయాందోళనల మధ్య ఉన్నారని, అయితే ధైర్యంగా ఉండి స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. బీహార్ సీఎం కూడా తెలంగాణ సర్కారు చేపట్టిన మిషన్ భగీరథను మోడల్‌గా తీసుకున్నారని ఆమె గుర్తుచేశారు. మంత్రి హరీష్‌రావు ఖేడ్‌ను దత్తత తీసుకున్నందున టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఖేడ్ రూపురేఖలే మారిపోతాయన్నారు. ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి ప్రజల్ని కోరారు.


 ఖేడ్ నియోజకవర్గం గత పాలకుల కారణంగానే వెనుకబాటుకు గురయ్యిందన్నారు. సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి భూపాల్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, ఎమ్మెల్సీలు రాములునాయక్, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, బాబూమోహన్, మహిపాల్‌రెడ్డి, చింతాప్రభాకర్, మదన్‌రెడ్డి, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, ఫరీదొద్దీన్, దేవేందర్‌రెడ్డి, అశోక్ షెట్కార్, అప్పారావుషెట్కార్, మోహిద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


సీఎం సభ హైలైట్స్...

నారాయణఖేడ్ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఖేడ్‌లో పర్యటించారు. సీఎం సభ హైలైట్స్ ఇలా...

సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 3.55కు హెలికాప్టర్‌లో నారాయణఖేడ్ చేరుకున్నారు.

అనురాధ కళాశాల సమీపంలో ఏర్పాటుచేసిన హెలిపాడ్‌లో దిగారు.

కేసీఆర్ హెలికాప్టర్ దిగగానే మంత్రి హరీశ్‌రావు స్వాగతం పలికారు.

హెలికాప్టర్‌లో కేసీఆర్ వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వచ్చారు.

కాన్వాయ్ ద్వారా సా.4 గంటలకు సభావేదిక వద్దకు వచ్చారు.

♦  సీఎం వేదికపైకి వస్తూ అభివాదం చేయడంతో ప్రజలు ఈలలు, కేరింతలు కొట్టారు.

♦  మైనార్టీ నాయకులు మోహిద్‌ఖాన్ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు దట్టికట్టారు.

మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతున్న సందర్భంలోనూ ప్రజలు హర్షాధ్వానాలు చేశారు.

కేసీఆర్ సా.4.15గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించి సా.4.36కు ముగించారు.

ఖేడ్ దుస్థితిపై మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ మాట్లాడిన ప్రతిసారి ప్రజలు చప్పట్లు చరిచారు.

సీఎం మాట్లాడుతూ హరీశ్‌రావు బుల్లెట్‌లాంటి మంత్రి అని సంభోదించారు. శక్తి ఉన్న మంత్రి, సిద్దిపేటలా అభివృద్ధి చేస్తానని చెప్పాడు. హరీశ్ మాట నిలబెడతా.

పశ్చిమ మెదక్ జిల్లా మార్పుకు పెద్ద ప్రయత్నమే జరగాలని సీఎం అన్నారు ఖేడ్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మంత్రి హరీశ్‌రావుకు వెయ్యి ఏనుగుల బలమొస్తుంది. అభివృద్ధికి మార్గం సుగమమవుతుందన్నారు.  - నారాయణఖేడ్/మనూరు/రేగోడ్

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top