19 ప్రాంతాల్లో కంది కొనుగోలు కేంద్రాలు


అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లా వ్యాప్తంగా 19 ప్రాంతాల్లో కంది కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ ఏ.బాలభాస్కర్‌ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే గుత్తి, ఉరవకొండ, కూడేరు, కళ్యాణదుర్గం, రొద్దం, కొత్తచెరువు, కదిరి కేంద్రాలు పనిచేస్తుండగా సోమవారం నుంచి మరో 12 కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాప్తాడు, బత్తలపల్లి, ఆత్మకూరు, తాడిపత్రి, గార్లదిన్నె, కుందుర్పి, గుంతకల్లు, వజ్రకరూరు, ముదిగుబ్బ, ఉరవకొండ మండలం కౌకుంట్ల, రామగిరి, మడకశిర కేంద్రాలు సోమవారం నుంచి పని చేస్తాయన్నారు. క్వింటా కందులు కనీస మద్ధతు ధర (మినిమం సపోర్ట్‌ ప్రైసెస్‌–ఎంఎస్‌పీ) రూ.5,050 ప్రకారం అమ్ముకోవచ్చన్నారు. 12 శాతం తేమ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాధారణంగా మిషన్ల ద్వారా నూర్పిడి చేసిన కందుల్లో తేమశాతం ఎక్కువగా ఉంటున్నందున ఎండబెట్టుకుని తీసుకురావాలని సూచించారు. పట్టాదారు, ఆధార్, బ్యాంకు అకౌంట్‌తోపాటు అవసరమైతే ముందస్తుగా శ్యాంపిల్స్‌ తెచ్చి అమ్ముకోవచ్చన్నారు.



‘అనంత’ కావాలంటున్న రైతులు

జిల్లా కేంద్రం అనంతపురంలో కంది కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. రోజువారీ వివిధ పనుల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రానికి వస్తుంటారని, ఇక్కడ కూడా ఓ కేంద్రం ఉంటే చాలామంది రైతులు వినియోగించుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కందుల కొనుగోలు కేంద్రాల వివరాలు తెలియక రోజూ చాలామంది రైతులు స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డుకు వచ్చి ఆరా తీస్తున్నట్లు మార్కెట్‌శాఖ వర్గాలు తెలిపాయి. మార్క్‌ఫెడ్‌ అధికారులు మాత్రం జిల్లా కేంద్రంలో తెరవడానికి వెనకాడుతున్నట్లు సమాచారం. ఎక్కడో కౌకుంట్ల లాంటి గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు ఇక్కడ ఎందుకు చేయడం లేదో సరైన సమాధానం చెప్పడం లేదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top