కంద ధర పతనం


పెరవలి : కంద దిగుబడి ఆశాజనకంగా ఉన్నా మార్కెట్‌లో గిట్టుబాటు ధరలేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో కంద పంట 2 వేల హెక్టార్లలో సాగులో ఉంది. జూన్‌ నుంచి కంద దిగుబడి సీజన్‌ ప్రారంభమవుతుంది. జూన్‌లో పుట్టు (236 కిలోలు) ధర రూ. 8 వేలు ఉండగా జూలైలో రూ.6 వేలు పలికింది. ఈ నెలకు వచ్చేసరికి అకస్మాత్తుగా ధర తగ్గి రూ.3,500 పలుకుతోంది. ధర పతనంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరం కంద పంట సాగు చేయాలంటే రూ.1.80 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. ఈ ఏడాది విత్తనానికే దాదాపు రూ.1.30 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. విత్తన దుంపలు పుట్టు రూ.4,500 చేసి కొనుగోలు చేశారు. పెరవలి మండలంలో తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, నల్లాకులవారిపాలెం, ఖండవల్లి, లంకమాలపల్లి, అన్నవరప్పాడు, మల్లేశ్వరం, కడింపాడు గ్రామాల్లో ఈ కందను ఎక్కువగా సాగు చేస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి ముంబై, కోల్‌కతా, నాగపూర్, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. అయితే ఈ ఏడాది ఇతర ప్రాంతాల్లో కూడా పంట బాగుండడం, దిగుబడులు పెరగడంతో ధర పతనమైనట్టు వ్యాపారులు తెలిపారు. మెట్ట ప్రాంతంలో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. గత రెండేళ్లలో కందను సాగుచేసిన రైతులు ఎకరానికి రూ. 20 నుంచి రూ. 40 వేల వరకు నష్టాలు చవిచూశారు. జూన్‌లో దుంపలు తీసిన రైతులు గట్టెక్కగా గత రెండు నెలల్లో తీసిన రైతులు బాగా నష్టపోయారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top