కల్తీ క‘మాల్‌’

కల్తీ క‘మాల్‌’


ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ తుంగలో..

నిబంధనలకు విరుద్ధంగా నూనె ప్యాకెట్లు, డబ్బాల తయారీ

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లు

ఆస్పత్రుల పాలవుతున్న అమాయక జనం




పక్క చిత్రంలోని వైద్యం పొందుతున్న కూలీలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు. వీరు కామారెడ్డిలో తాగునీటి పైప్‌లైన్‌ పనులు చేస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ కూలీలు శనివారం స్థానికంగా ఉండే ఓ షాపులో వంట నూనె ప్యాకెట్‌ను కొనుగోలు చేసి వంట చేసుకున్నారు. తీరా ఆ నూనె కల్తీది కావడంతో ఈ ఆహారం తిన్న కూలీలు, ఆ కుటుంబంలోని చిన్న, పెద్ద అంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు చేసుకున్నారు. కనీసం ఆస్పత్రికి వెళ్లి వైద్యం కూడా చేయించుకోలేక ఇంట్లోనే పడి ఉన్న ఆ నిరుపేద కూలీలను రెవెన్యూ ఉన్నతాధికారులే ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడారు. సంబంధిత వ్యాపారులపై కేసులు పెట్టారు. కల్తీ నూనె మాఫియా ఆగడాలకు ఇదొక మచ్చుతునక.



నిజామాబాద్‌ :

కల్తీ నూనె మాఫియా రెచ్చిపోతోంది. వంట నూనెలను కల్తీ చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కామారెడ్డి కేంద్రంగా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆరోగ్యానికి హానికరమైన నూనెలను కల్తీ చేసి రూ.కోట్లు గడిస్తోంది. వంట నూనెల తయారీ, విక్రయాల్లో అడుగడుగునా నిబంధనలను తుంగలో తొక్కుతోంది. నిత్యం రూ.కోట్లలో అక్రమదందా సాగుతున్నా సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వెనుక పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నూనెలను వినియోగిస్తున్న అమాయక ప్రజలు వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు.


ఆయిల్‌ తయారీకి అనుమతుల్లేవు..

వంట నూనెలను తయారు చేయాలంటే గెజిటెడ్‌ ఫుడ్‌   ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం నుంచి లైసెన్సులు తీసుకోవాలి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఏ ఒక్క ప్లాంటుకు కూడా ఫుడ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం నుంచి లైసెన్సులు మంజూరు చేయలేదు. కేవలం వంట నూనెలను ప్యాకింగ్‌ చేసుకునేందుకు మాత్రమే 23 ప్లాంట్లకు లైసెన్సులిచ్చారు. కానీ కామారెడ్డి, నిజామాబాద్‌లో నూనెలను మిక్సింగ్‌ చేస్తున్నారు. అత్యధికంగా నూనె దందా కామారెడ్డి కేంద్రంగా సాగుతోంది.


ప్యాకెట్లలో ప్రమాణాలు గాలికి..

రూ.కోట్లలో నూనె దందా చేస్తున్న అక్రమార్కులు అడుగడుగునా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ (ఫుడ్‌ సేఫ్టీ స్టాండరŠడ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) మార్గదర్శకాలను గాలికొదిలేస్తుండటంతో అమాయక ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా తయారైంది.

l    వంట నూనెను ప్యాకెట్లుగా తయారు చేస్తున్న అక్రమార్కులు ఆ ప్యాకెట్లపై ఎలాంటి వివరాలు ఉంచడం లేదు. ఆ ప్యాకెట్‌లో ఏయే రకాల నూనెలు కలిపారు. నూనె తయారు చేసిన సంస్థ వివరాలు, ప్యాకింగ్‌ చేసిన తేదీ.. ప్లాంటు వివరాలు.. కలిపిన ఇతర రసాయనాలు వంటి పూర్తి వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను ప్యాకెట్లపై ముద్రించాలి.


కానీ.. ఇవేవీ పాటించకుండా మామూలు పాలిథిన్‌ కవర్లలో నూనెను ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నారు. ఇటీవల కామారెడ్డిలో కూలీలు అస్వస్థతకు గురైన ఘటన ఈ కల్తీ దందాకు అద్దం పడుతోంది. ఈ వివరాలేవి లేని నూనె ప్యాకెట్‌ను కొనుగోలు చేసి వినియోగించడంతో అమాయక ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది.


♦ నిబంధనల ప్రకారం వ్యాపారులు లూజ్‌ ఆయిల్‌ అమ్మరాదు. య«థేచ్ఛగా లూజ్‌ ఆయిల్‌ విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పలుచోట్ల లూజ్‌ ఆయిల్‌ను విక్రయిస్తున్నారు. చౌకబారు నూనెలను కలిపి రూ.కోట్లు దండుకుంటున్నారు.


♦ పామోలివ్, పత్తిగింజల నూనె అత్యంత చౌకగా లభిస్తుంది. పత్తి నుంచి వేరు చేసిన గింజలతో తయారైన ఈ నూనెలను ఆదిలాబాద్, భైంసా వంటి జిన్నింగ్‌ ఆయిల్‌ మిల్లుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేసుకుంటున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్యాంకర్లలో తెప్పించుకుంటున్నారు. ఈ చౌక నూనెల్లో అధిక ధర ఉండే పల్లీ నూనె, పొద్దుతిరుగుడు నూనెలను నామమాత్రంగా కలిపి ప్యాకెట్లు చేస్తున్నారు. ఈ ప్యాకెట్లపై మాత్రం అందంగా, కంటికి ఇంపుగా కనపడే పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలను ముద్రించి ఇది స్వచ్ఛమైన పల్లీ నూనె, పొద్దు తిరుగుడు నూనె అంటూ అమాయక ప్రజల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. అమాయక ప్రజలు ప్యాకెట్‌ మీద ఇంగ్లిష్‌లో ఉన్న డిక్లరేషన్‌ను చదివే అవగాహనæ లేకపోవడంతో బొమ్మను చూసి ఇదే పల్లీ, పొద్దుతిరుగుడు నూనె అని మోసపోతున్నారు.


♦ కేవలం ప్యాకెట్లలోనే కాదు, డబ్బాల్లోనూ ఈ నూనెను ప్యాకింగ్‌ చేస్తున్నారు. అలాగే 15 కేజీలు ఉండే ఈ ఆయిల్‌ డబ్బాలను కూడా ఇక్కడి నుంచే ఇతర జిల్లాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఈ దందా రూ.కోట్లలో సాగుతోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top