ఎమ్మెల్యే కొండబాబుకు షాక్‌

ఎమ్మెల్యే కొండబాబుకు షాక్‌ - Sakshi


♦  ఎమ్మెల్యే కొండబాబుకు షాక్‌

వ్యూహాత్మకంగా దెబ్బకొట్టిన మంత్రులు

అలకవహించిన కొండబాబు

తన వద్దకు వచ్చిన మేయర్‌ అభ్యర్థిపై అగ్రహం

టీడీపీ, బీజేపీకి రెబెల్స్‌ పోటు




 సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీలో రగడ మొదలలైంది. మంత్రులు, ఎమ్మెల్యే కొండబాబు మధ్య చిచ్చు రేగింది. వ్యూహాత్మకంగా మంత్రులు  దెబ్బకొట్టారు. ఇప్పుడా బాధను తట్టుకోలేక ఎమ్మెల్యే రగిలిపోతున్నారు. తనను కాదని కార్పొరేషన్‌ అభ్యర్థును ఎలా గెలిపిస్తారో చూస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడిది చినికి చినికి గాలివానలా మారింది. ఇదెక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రెబెల్స్‌ సెగ తాకింది. ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపుతారోనన్న భయం పట్టుకుంది.



మిత్రపక్షాలకు రెబెల్స్‌ షాక్‌...

  టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. మిత్రపక్షమైన బీజేపీకి షాక్‌ తగిలింది. ఇప్పుడా రెండు పార్టీలూ కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. బీజేపీకి కేటాయించిన 9, 27, 47 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు తిరుగుబాటు అభ్యర్థులుగా కొనసాగుతున్నారు. టీడీపీ కేటాయించిన 28, 35 డివిజన్లలో వేసిన టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు రెబల్‌ రేసులో నిలబడ్డారు. ఆయా వార్డుల్లో రెబెల్‌ పోటు ఉండటంతో గెలుపుపై ఆశలు వదులుకోవల్సిన పరిస్థితులు నెలకున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యే కొండబాబు తలనొప్పి వచ్చి పడింది.



కొండబాబుకు చెక్‌ పెట్టిన మంత్రులు...

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో  సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)కు పార్టీ అధిష్టానం చెక్‌ పెట్టింది. అభ్యర్ధుల ఎంపికలో కొండబాబుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు బీపారంలు ఇచ్చే చివరి వరకు నటించిన మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన రాజప్ప వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎమ్మెల్యేకు కోలుకోలేని దెబ్బకొట్టారు.  మొదటి నుంచీ మేయర్‌ అభ్యర్థిగా జ్యోతుల ఇందిరను ఎంపిక చేయాలని కొండబాబు సూచించగా దానికి అంగీకరించినట్లు చెప్పుకొచ్చిన మంత్రులు ఆఖరి నిమిషంలో మరొకర్ని తెరపైకి తెచ్చి ఇందిరకు షాక్‌ ఇచ్చారు. 47వ డివిజన్‌కు చెందిన జ్యోతుల ఇందిరను తీసుకొచ్చి 40వ డివిజన్‌లో ఎమ్మెల్యే కొండబాబు నామినేషన్‌ వేయించారు.



మేయర్‌ అభ్యర్ధిగా దాదాపు ఆమెకు సానుకూలత వ్యక్తం చేసినట్టు మంత్రులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజుకొచ్చేసరికి జ్యోతుల ఇందిరను కాదని 40 డివిజన్‌ అభ్యర్థిగా సుంకర సాగర్‌ భార్య సుంకర శివ ప్రసన్నను ఖరారు చేశారు. ఆమెనే టీడీపీ మేయర్‌ అభ్యర్థిగా ప్రతిపాదించి బీపారం అందజేశారు. కొండబాబు సూచించిన జ్యోతుల ఇందిర కాపు సామాజిక వర్గానికి చెందినది కాదనే వాదనను తెరపైకి తీసుకువచ్చిన దేశం నేతలు చివరి నిమిషంలో నాటకీయంగా మేయర్‌ అభ్యర్థిని మార్చడంతో చేసేదేమీ లేక జ్యోతుల ఇందిర తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కొండబాబు కోరిన అన్ని డివిజన్లలో ఆయన సూచించిన అభ్యర్థులకు బదులు బీజేపీకి కేటాయించారు. అలాగే 29వ డివిజన్‌లో కొండబాబు అనుచరునికి బదులుగా వేరే వ్యక్తికి బీఫారం అందజేయడంతో అభ్యర్థుల ఎంపికలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కొండబాబు అలిగి ఇంటికి వెళ్లిపోయారు.



మేయర్‌ అభ్యర్థిపై ఆగ్రహం

 మేయర్‌ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించిన సుంకర సాగర్‌ తన భార్యతో కలిసి బీఫారం తీసుకుని కొండబాబు దగ్గరకు వెళ్లగా  తనను కాదని అభ్యర్థులను ఎంపిక చేశారని...ఎలా గెలుస్తారో నేనూ చూస్తానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తన దగ్గరకు రావాల్సిన అవసరం లేదని, టిక్కెట్టు ఎవరు ఇచ్చారో వారి దగ్గరకే వెళ్లండంటూ ఇంట్లోకి రానివ్వకుండా పంపేసినట్టు సమాచారం. బుధవారం సాయంత్రం నుంచి కొండబాబు కినుక వహించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కొండబాబును బుజ్జగించే ప్రయత్నాలు బెడిసికొట్టడంతోతోపాటు తనకు జరిగిన అవమానాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతానని కొండబాబు చెబుతున్నట్టు తెలిసింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top