మంత్రులు, ఎమ్మెల్యేదీ చేరో దారి

మంత్రులు, ఎమ్మెల్యేదీ చేరో దారి - Sakshi

పార్టీ సమావేశానికి వనమాడి డుమ్మా

1200 కోట్లు నగరానికి ఖర్చుచేసామని మంత్రులు ప్రకటన

ఆ కోట్లు ఎవరి  జేబుల్లోకి వెళ్లాయంటున్న ప్రజలు



భానుగుడి(కాకినాడ) : అధికార టీడీపీలో వర్గపోరు చాపకింద నీరులా సాగుతోంది. మంత్రులు, ఎంపీలు ఒకవర్గం, ఎమ్మెల్యే ఒక వర్గంగా విడివిడిగా అధిష్టానం మెప్పు కోసం అన్నట్లు వ్యవహరించడం ఎన్నికల వేళ ఆపార్టీ కార్యకర్తల్లో నైరాశ్యాన్ని నింపుతోంది. ఎన్నికల్లో గెలుపుమాట అటుంచితే పార్టీ పరువు బజారున పడిపోతుందోనన్న భయం ద్వితీయ శ్రేణి నాయకుల్లో మొదలైంది. ఎలాగైనా కాకినాడ కార్పొరేషన్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న అధికారి పార్టీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్రం నలుమూలల నుంచి కాకినాడ చేరుకుని నేతలు పనిచేస్తుంటే  ఓపక్క స్థానిక ఎమ్మెల్యే వనమాడి, మరో పక్కమంత్రులు అలకలు.. కినుకులు వహించడం ఏంటని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా సీట్ల కేటాయింపులో మంత్రులు యనమల, చినరాజప్పలు చక్రం తిప్పడం, ఎమ్మెల్యే వనమాడికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే వర్గం ‘స్వతంత్ర’ంగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే.



వనమాడి ఒంటెత్తు పోకడపై ఫిర్యాదు

కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేపై ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. బీ ఫారాలను పార్టీ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉన్నా, ఎమ్మెల్యే అభ్యర్థులను ఇంటికి పిలిపించడం, చేరికలకు సంబంధించి సమాచారాలు ఇవ్వకుండా పత్రికా ప్రకటనలు ఇవ్వడం, కొందరు అభ్యర్థులపై చిందులు తొక్కడం, ఇన్‌చార్జి మంత్రి కిమిడి జిల్లాలో మకాం వేసినా ఏ సమాచారం ఆయనకు తెలియపరచకపోవడం ఇలా పలు అంశాలను ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లింది. 



కీలక సమావేశానికి ‘వనమాడి’ డుమ్మా..

కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి నగర ప్రజలకు ఓట్ల కోసం పిలుపునిచ్చే క్రమంలో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశానికి నగర ఎమ్మెల్యే డుమ్మా కొట్టడం టీడీపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్నికల మ్యానిఫెస్టో పేరుతో అధిష్టానం ముద్రించి పంపిన కరపత్రాన్ని విడుదల చేసే కీలక సమావేశానికి ఎమ్మెల్యే హాజరుకాకుండా కినుక వహించడంపై సర్వత్రా చర్చజరుగుతోంది. బీజేపీ కేటాయించిన సీట్లలో వనమాడి వర్గం స్వతంత్రంగా బరిలోకి దిగడం, టీడీపీ అభ్యర్థులున్న చోటా టీడీపీ రెబల్‌గా పోటీలో ఉండడం ఇవన్నీ వనమాడి వెనుకుండి నడిపిస్తున్నారన్న ఆరోపణలు సైతం గురువారం జరిగిన పార్టీ సమావేశంలో కొందరు నేతలు మంత్రుల వద్ద ప్రస్తావించడం గమనార్హం. గురువారం జరిగిన సమావేశంలో  ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, వరుపుల రాజా తదితరులు పాల్గొన్నారు.

 

1212 కోట్లతో అభివృధ్ది చేసాం..ఓట్లేయండి..!

నగరంలో ఇళ్లు, రేషన్‌ కార్డులు, రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీరు.. ఇలా పలు సమస్యలతో నగరవాసులు సతమతమవుతుంటే మంత్రులు నగరానికి 2014–17 వరకు గడిచిన మూడేళ్లలో రూ.1212కోట్లతో అభివృద్ధి  పనులు చేశామని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం కరపత్రాన్ని విడుదల చేశారు. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాల్లో తొలుత జరగని పనులకు సైతం కాకిలెక్కలు చూపిస్తూ కరపత్రాన్ని విడుదల చేయడం సర్వత్రా హాస్యాస్పదమైంది. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే ఈ కరపత్రాన్ని విడుదల చేసినట్టు తెలుస్తోంది. కాకినాడ స్మార్ట్‌ సిటీలో భాగంగా ఈ ఏడాది జరుగుతున్న డ్రైన్లు, రహదారులు, ఇళ్లతో పాటు ప్రతిపాదనల్లో కాగితాల రూపంలో ఉన్న పనులను సైతం కోట్ల నిధుల రూపంలో ఖర్చు చేసినట్టు చూపడంపై పలువురు నగర వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  ఈకోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో తెలపాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top