రెబెల్‌.. గుబుల్‌..

రెబెల్‌.. గుబుల్‌.. - Sakshi

–కార్యకర్తలను కాదన్నందుకు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం

–సీట్ల కేటాయింపులో మాట నెగ్గించుకున్న యనమల

–ఎమ్మెల్యే బాధితుల వరుసలో జ్యోతుల ఇందిర

–బీజేపీ డివిజన్లలో బరిలోకి టీడీపీ రెబల్‌ అభ్యర్థులు

భానుగుడి(కాకినాడ) : పార్టీల అభ్యర్థుల ఎంపిక ముగిసింది. పలు డివిజన్లలో టీడీపీ రెబల్‌ అభ్యర్థులు బరిలో ఉండడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. టీడీపీలో బడాబాబులు, నేతల అనుయాయులతో జాబితా సిద్ధం చేయడంపై అభ్యర్థులు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా డివిజన్ల వారీగా ఎమ్మెల్యేను నమ్ముకుని మోసపోయిన వారు సైతం ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామంటున్నారు. 

29వ డివిజన్‌లో సీటును ఆశించిన యాళ్ల పట్టాభి, వాసిరెడ్డి రామచంద్రరావు టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచారు. ఆ డివిజన్‌లో విస్తృత ప్రచారం చేస్తూ పార్టీలో తమకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగానే వెల్లబుచ్చుతున్నారు. దీంతో ఈ డివిజన్‌లో తేదేపా అభ్యర్థినిగా పోటీచేస్తున్న ఆ పార్టీ  సీటీ ప్రెసిడెంట్‌ సుంకర తిరుమల కుమార్‌ భార్య సుంకర పావని గెలుపు కష్టం కానుంది. 28వ డివిజన్‌లో ఎమ్మెల్యేను నమ్ముకుని నట్టేట మునిగిన పినిశెట్టి సతీష్‌ టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 35వ డివిజన్‌ సీటును బీజేపీకి కేటాయించడంతో కొండాబత్తుల ప్రసాదరావు ఆ పార్టీ తరఫున బరిలో నిలిచారు. దీంతో ఎప్పటి నుంచే టీడీపీ పార్టీ కార్యక్రమాలు సొంత ఖర్చులతో నిర్వహించిన రమా ఆప్టికల్స్‌ రాంబాబు ఈ డివిజన్లో టీడీపీ రెబల్‌గా నిలిచారు. 9వ డివిజన్‌లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కంపర రమేష్‌, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య బీజేపీ తరపున బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా శీకోటి అప్పలకొండ బరిలో నిలిచారు. ఈ విషయమై బీజేపీ నాయకులు కాస్త సీరియస్‌ ఉన్నారు. సీట్లు కేటాయించినట్టే కేటాయించి తేదేపా అభ్యర్థులను బరిలో ఉంచిందని అ«ధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది.

ఎమ్మెల్యే ఇంటివద్దా? బి ఫారాలిచ్చేది?

ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇంటి వద్ద అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ కార్యాలయంలో ఇవ్వకుండా ప్రాబల్యాన్ని నిలుపుకొనేందుకు ఎమ్మెల్యే ఈ తరహా కార్యక్రమాలు చేస్తున్నారంటున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు నామన రాంబాబును నామమాత్రానికైనా లెక్కలోకి తీసుకోకుండా ఒంటెత్తుపోకడలతో వనమాడి వ్యవహరించడంపై కార్యకర్తల్లో ఆగ్రహం నెలకొంది. 

సుంకరకు సీటు.. ఇందిరకు వెన్నుపోటు

ఆర్థిక మంత్రి అనుచరుడు సుంకర విద్యాసాగర్‌ భార్య సుంకర శివప్రసన్నకే 40 డివిజన్‌ టీడీపీ సీటు కేటాయించడం ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది. తన సొంత డివిజన్‌ అయిన 47వ డివిజన్‌ను వదులుకుని ఎమ్మెల్యే వనమాడిని నమ్మి 40వ డివిజన్‌లో అభ్యర్థిత్వాన్ని దాఖలు చేసిన జ్యోతుల ఇందిర తీవ్ర భంగపాటుకు గురైంది. డివిజన్‌లో మేయర్‌ అభ్యర్థిని ఇందిరనే టాక్‌ రావడంతో ప్రచారం సైతం ఇందిర అనుచరులు వేగవంతం చేశారు. సీటు కేటాయింపు విషయానికొచ్చేసరికి ఆర్థిక మంత్రి చక్రం తిప్పడంతో కొండబాబు ఇందిర పేరును సమావేశంలో ప్రస్తావించేందుకు సంకోచించినట్టు సమాచారం. 

టిడీపీ అభ్యర్థుల రెండో జాబితా:

టీడీపీ 48 డివిజన్లకు సంబంధించి బీజేపీకి తొమ్మిది డివిజన్లు  కేటాయించగా 34 డివిజన్లకు తొలిజాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. 13వ డివిజన్‌కు సంబంధించి ఒమ్మి బాలకామేశ్వరరావు, 21వ డివిజన్‌కు సుల్తాన్‌బేగం, 49వ డివిజన్‌కు పి.ఉషారాణి, 40వ డివిజన్‌ సుంకర శివప్రసన్న, 50వ డివిజన్‌ పాలిక త్రిమూర్తులకు కేటాయించి బుధవారం బీ ఫారాలు అందించారు.

కరపత్రాలు, జెండాల పంపిణీ

జిల్లా టీడీపీ కార్యాలయంలో 50 డివిజన్లలో ఎన్నికలు జరుగుతున్న 48 డివిజన్లకు సంబంధించి జెండాలు, ప్లెక్సీలు, కరపత్రాలు ఇతరత్రా సామగ్రిని పార్టీ కార్యాలయం నుంచి బుధవారం రాత్రి ఆఘమేఘాల మీద సరఫరా చేశారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top