కుంభకోణాలు లేని పాలన మాది

కుంభకోణాలు లేని పాలన మాది - Sakshi


యూపీఏ హయాంలోనే కుంభకోణాలు

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం

నదుల అనుసంధానంతో సాగునీరు

కేంద్ర మంత్రులు సంతోష్ గంగావర్, సాద్వి నిరంజన్ జ్యోతి

ఆర్మూర్, ఎల్లారెడ్డిలలో పర్యటన


ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో కుంభకోణాలు లేని ప్రజారంజక పాలనను అందిస్తున్నామని కేంద్ర మంత్రులు సంతోష్ గంగావర్, సాధ్వి నిరంజన్ జ్యోతి పేర్కొన్నారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలతో అట్టడుగు స్థాయి ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికాస్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రులు గురువారం ఆర్మూర్, ఎల్లారెడ్డి పట్టణాల్లో పర్యటించారు.  - ఆర్మూర్/ఎల్లారెడ్డి 


ఆర్మూర్/ఎల్లారెడ్డి: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందని కేంద్ర మంత్రులు సంతోష్ గంగావర్, సాద్వి నిరంజన్ జ్యోతి పేర్కొన్నారు. రెండేళ్లలో ఒక్క కుంభకోణం కూడా లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రకటించారు. వికాస్‌పర్వ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రులు గురువారం ఆర్మూర్, ఎల్లారెడ్డిలలో పర్యటించారు. ఆర్మూర్‌లో పలువురు ప్రముఖులు, సంఘాల నేతలతో చర్చాగోష్టి నిర్వహించారు. అంతకు ముందు జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యాంప్రసా ద్ ముఖర్జి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు సంతోష్ గంగావర్, జ్యోతి నిరంజన్ సాద్వి ప్రసంగించారు.


కుంభకోణాలకు తావు లేకుండా..

యూపీఏ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని, అందుకు భిన్నంగా బీజేపీ పాలన కొనసాగుతోందన్నారు. రెండేళ్లలో ఒక్క కుంభకోణం కూడా లేకపోవడంతో ప్రతిపక్షాలకు పని లేకుండా పోయింద ని తెలిపారు. అయినా, విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందాలనే జన్‌ధన్ యోజన, రైతుల శ్రేయస్సు కోసం ఫసల్ బీమా యోజన తీసుకొచ్చామని చెప్పారు. సాగునీటి సమస్య పరిష్కారానికి నదుల అనుసంధాన ప్రక్రియ కొనసాగిస్తామని తెలిపారు. పత్తి రైతులు నష్టపోకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణ సంపూర్ణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి మరింత సులభతరంగా, వేగంగా సాగుతుందన్నారు.


వారిది అవినీతి.. మాది అభివృద్ధి: అర్జున్ ముండ

కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డు పడుతోందని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటేనే పూర్తి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వాలు అవినీతితో ప్రఖ్యాతి గాంచితే, మోడీ ప్రభుత్వం అభివృద్ధితో ఖ్యాతి గడిస్తోందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర లక్ష్మణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నీతిమాలిన వలసవాద రాజకీయాలు చేస్తూ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని విమర్శించారు. అవినీతి పాలనతో దేశంలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందని, తెలంగాణలో టీడీపీ బలహీన పడిందన్నారు. బీజేపీని గ్రామ గ్రామాన బలోపేతం చేసి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేయాలన్నారు.


కేంద్ర మంత్రుల దృష్టికి పలు సమస్యలు..

చర్చా గోష్టిలో పలువురు తమ సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. బీడీ పరిశ్రమ మనుగడను ప్రశ్నార్థకంగా చేయనున్న బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించాలనే నిబంధనను తొలగించాలని బీడీ టేకేదార్ రేగుళ్ల గంగాప్రసాద్ కోరారు. బంగారు వ్యాపారులపై విధించిన అదనపు సెస్‌ను రద్దు చేయాలని వెండి, బంగారు వర్తక సంఘం అధ్యక్షుడు మంచిర్యాల కిషన్ విన్నవించారు. ముద్ర యోజనలో భాగంగా బ్యాంకర్లు చిరు వ్యాపారులను ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ నేత సుధాకర్ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, నేతలు బాణాల లకా్ష్మరెడ్డి, ఆలూరు గంగారెడ్డి, కోటపాటి నర్సింహనాయుడు, లోక భూపతిరెడ్డి, పుప్పాల శివరాజ్, గీత మూర్తి, రమణి, మురళీధర్‌గౌడ్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top