జూరాల-పాకాల ప్రాజెక్టు రద్దు?

జూరాల-పాకాల ప్రాజెక్టు రద్దు? - Sakshi


జూరాల:  జూరాల-పాకాల ప్రాజెక్టును రద్దు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాలోని డిండి వరకు భూగర్భం ద్వారా నీటిని తరలించి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో సాగునీటిని అందించే లక్ష్యంతో జూరాల-పాకాల పథకాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు సర్వేను నిర్వహించేందుకుగాను వ్యాప్‌కోస్ సంస్థకు ప్రభుత్వం ఆరు నెలల కాల పరిమితితో పనులను అప్పగించింది. అదేవిధంగా పాలమూరు పథకాన్ని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంస్థకు సర్వే బాధ్యతలను అప్పగించారు. పాలమూరు పథకం పనులకు సర్వేలో ప్రాథమిక దశ, సమగ్ర సర్వేలు పూర్తయ్యాయి.



జూరాల-పాకాల పథకాన్ని చేపట్ట వద్దంటూ జిల్లాలో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలోనే డిండి పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. నల్లగొండ జిల్లాలో డిండి ద్వారా సాగునీటిని అందించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో జూరాల-పాకాల అంశాన్ని పక్కన పెట్టేశారు. పాకాల సర్వేను చేపట్టిన వ్యాప్‌కోస్ సంస్థ రూ.3.63 కోట్లతో సర్వేను పూర్తి చేయాల్సి ఉంది. సర్వేను ప్రారంభించి దాదాపు రూ.1.25 కోట్ల విలువైన పనుల సర్వేను పూర్తి చేసింది. ఈ దశలో ప్రభుత్వం మిగతా సర్వేపై స్పందించకపోవడంతో సర్వే సంస్థ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేను నిలిపివేసింది. ఎట్టకేలకు డిండి ప్రాజెక్టు రావడంతో జూరాల-పాకాల సర్వే జరిగిన పనులకు సంబంధించి సంబంధిత కంపెనీకి చెల్లింపులు జరిపి మిగతా సర్వేను పూర్తిగా రద్దు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటిక సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారుల ద్వారా తెలిసింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top