రెండేళ్లలో ‘డిండి’ నుంచి సాగునీరు

రెండేళ్లలో ‘డిండి’ నుంచి సాగునీరు - Sakshi


ఇబ్రహీంపట్నం ప్రాంతాన్నిసస్యశ్యామలం చేస్తాం

అధికారుల అలసత్వంతోనే సంక్షేమ పథకాల్లో జాప్యం

ప్రతి గ్రామంలో శ్మశానవాటిక,డంపింగ్‌ వార్డులకు వారం రోజుల్లో స్థలాలు కేటాయించాలి

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు


యాచారం(ఇబ్రహీంపట్నం): డిండి ప్రాజెక్టు నుంచి రానున్న రెండేళ్లలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని, ఈ ప్రాతానికి సాగునీరు ఇచ్చే విషయంలో సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో ఉన్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం అమలుపై కూలీలతో, గ్రామజ్యోతి పథకం అమలుపై గునుగల్‌ గ్రామంలో గ్రామస్తులతో సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ... అత్యంత కరువు ప్రాంతమైన ఇబ్రహీంపట్నంకు రెండేళ్ల కాలంలో డిండి ప్రాజెక్టు నుంచి శివన్నగూడ ద్వారా సాగునీరు అందిస్తామని అన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో వంద రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలకు మరిన్ని పనిదినాలు పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని అన్నారు. ఉపాధి పథకం కింద మంజూరయ్యే నిధుల ద్వారా గ్రామాలను  సమగ్రాభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్లే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు.


సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయి పర్యటనలు చేసి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్మాణం కోసం రూ.లక్షల నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా సక్రమంగా అమలు కావడం లేదని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని 415 గ్రామాల్లో వారం రోజుల్లోపే డంపింగ్‌యార్డులు, శశ్మానవాటికల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. వారం రోజుల్లో స్థలాలను గుర్తించి తనకు నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని రూ.లక్షల నిధులు అడిగే బదులు ఈజీఎస్‌ పథకం కింద మంజూరైన పనులను పూర్తి చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.


జెడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి మాట్లాడుతూ... సంపూర్ణ అక్షరాస్యత కోసం కృషి చేయాలని సూచించారు. తాగునీటిని వృథా చేయకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ నీతుప్రసాద్‌ మాట్లాడుతూ... ప్రతి ఇంటికీ మరుగుడొడ్డి నిర్మించే విషయంలో నిధుల కొరత లేదని అన్నారు. గ్రామాల్లో అవసరం ఉన్న కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రూ.300 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని.. అధికారులను సూచించారు.

 

కృష్ణాజలాలు లేకుంటే గ్రామాలే ఖాళీ అయ్యేవి: ఎమ్మెల్యే మంచిరెడ్డి

మూడేళ్లుగా ఈ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాల్లేవు. భూగర్భజలాలు అడుగంటాయి. కృష్ణాజలాలు లేకపోతే ఈ ప్రాంతంలో నీటి ఇబ్బందుల వల్ల ప్రజలు గ్రామాలనే ఖాళీ చేయాల్సి వచ్చేదని  ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గునుగల్, కొత్తపల్లి గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ... సాగునీరే అందజేయడమే ఈ ప్రాంత ప్రజలకు శరణ్యమని అన్నారు. నియోజకవర్గంలో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయని అన్నారు. మరో రూ100 కోట్లు మంజూరు చేసే విధంగా పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్‌ నీతుప్రసాద్‌ కృషి చేయాలని కోరారు.


డిసెంబర్‌లోపు ఈ ప్రాంత గ్రామాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. సాగునీరు, తాగునీరు అందించడంతోనే  ఈ  ప్రాంత సమస్యలు తీరుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతినాయక్, జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, వైస్‌ ఎంపీపీ రామకృష్ణ, గునుగల్, కొత్తపల్లి సర్పంచ్‌లు అచ్చెన మల్లికార్జున్, లతానారాయణరెడ్డి,  డీపీఓ పద్మజారాణి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, తహసీల్దార్‌ పద్మనాభరావు, ఎంపీడీఓ ఉష, ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్, ఈజీఎస్‌ ఏపీడీ తిరుపతయ్య, ఏపీఓ నాగభూషణం, ఆయా గ్రామాల ఎంపీటీసీలు గడల మాధవి, సంధాని, సర్పంచ్‌లు సత్యపాల్, పాశ్ఛ భాషా, నర్రె మల్లేష్, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top