మొక్కల సరఫరాకు ఏర్పాట్లు

మొక్కల సరఫరాకు ఏర్పాట్లు


►  రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ  మంత్రి జోగు రామన్న

► హరితహారం అమలుపై సమీక్ష




ఆదిలాబాద్‌అర్బన్‌: ఈ యేడాది వర్షాకాలం ప్రారంభంలో గ్రామ పంచాయతీలు, నియోజకవర్గాల వారీగా మొక్కల సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో హరితహారం అమలు తీరుపై కలెక్టర్‌ ఎం.జ్యోతిబుద్ధప్రకాష్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఈ యేడాది వర్షకాలంలో మొక్కల పెంపకం, వచ్చే యేడాది మొక్కల పెంపకానికి సంబంధించిన విత్తన సేకరణపై చర్చించారు.


హరితహారం పథకం ద్వారా అడవులు పూర్వ వైభవం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, అటవీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు కోరిన మొక్కలు అందించే దిశగా చర్యలు చేపట్టాలని, అప్పుడే హరితహారం జిల్లాలో విజయవంతం అవుతుందని చెప్పారు. జిల్లాలోని నర్సరీల ద్వారా పెంచిన మొక్కలు, గతేడాదిలో నాటిన మొక్కల సంరక్షణపై అధికారులతో చర్చించారు.


జిల్లాలో గత రెండేళ్లలో నాటిన మొక్కల సంరక్షణ ఏవిధంగా ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల కోరిక మేరకు ఎక్కువ మొత్తంలో మొక్కలు సరఫరా చేసే విధంగా చూడాలని అన్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు, ఏయే రకాల మొక్కలు పెంచుతున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు నర్సరీలను తనిఖీలు చేసి మొక్కల గురించి తెలుసుకోవాలని పేర్కొన్నారు. రానున్న యేడాదిలో నర్సరీల ద్వారా మొక్కల పెంపునకు ఇప్పటి నుంచే విత్తనాల సేరకణ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో శంకర్, ఆర్డీవో సూర్యనారాయణ, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top