జేఎన్టీయూ భూములు కబ్జా


 6 ఎకరాల జేఎన్‌టీయూ భూములు కాజేసేందుకు ఎత్తుగడ

 కబ్జాదారులతో కుమ్మక్కైన ముగ్గురు వర్సిటీ ఉద్యోగులు  


 

జేఎన్‌టీయూ: అనంతపురం జేఎన్‌టీయూకు చెందిన రూ. 36 కోట్ల విలువ చేసే 6 ఎకరాలపై భూ రాబందుల కన్ను పడింది. వీరితో వర్సిటీకి చెందిన ముగ్గురు ఉద్యోగులు కుమ్మక్కుకావడంతో ఆ స్థలంలో గుడిసెలు వేసి కబ్జా చేసేందుకు యత్నించారు.  వివరాల్లోకి వెళితే.. జేఎన్‌టీయూ క్యాంపస్ కళాశాలతో పాటు వర్సిటీకి 350 ఎకరాలు భూమి ఉంది. ఇందులో 100  ఎకరాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు ధారాదత్తం చేశారు. తక్కిన 250 ఎకరాల్లో  36 ఎకరాలను రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిన వివిధ సంస్థలకు అప్పగించారు.  ఇందులో  6 ఎకరాల స్థలం మిగిలింది. ఈ భూమిని ఆక్రమించుకోవడానికి రాజకీయ నాయకులు ఎత్తుగడ వేశారు.  ఇందులో భాగంగా వర్సిటీ ఉద్యోగులు ఆ స్థలం జేఎన్‌టీయూకు సంబంధించినది కాదని ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఆరు ఎకరాల స్థలంలో జేఎన్‌టీయూ అధికారులు గతంలో ఎలాంటి ఫెన్సింగ్ వేయకపోవడం వీరి ప్రచారానికి బలం చేకూరుతోంది.

 

జేఎన్‌టీయూ అధికారులు 36 ఎకరాలను రాష్ర్టప్రభుత్వానికి బదలాయించగా,   మిగిలిన ఆరు ఎకరాలు జేఎన్‌టీయూకు సంబంధం లేదన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.  చిన్న , చిన్న గుడిసెలు వేసి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారు. జేఎన్‌టీయూ ఉన్నతాధికారుల మెతకవైఖరి కారణంగానే ఆక్రమాలకు బరితెగిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.




వర్సిటీకి సంబంధించిన 6 ఎకరాల భూమిని ఆక్రమించుకోవడానికి కొందరు అక్రమార్కులు  ప్రయత్నాలు చేసింది నిజమే. ఇందులో పాత్రధారులైన ఉద్యోగుల  గుర్తించాం. వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడం.  స్థల ఆక్రమణను నిరోధించేందుకు కంచె ఏర్పాటు చేస్తున్నాం.  

 - ఆచార్య ఎస్. కృష్ణయ్య, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top