భద్రాద్రి సీతారాముల నగల లెక్క తేలేనా?

ఆభరణాలను లెక్కిస్తున్న జేవీఓ భాస్కర్‌

  • భద్రాద్రిలో ఆభరణాల పరిశీలన

  • ఐదుగురు అర్చకులపై కేసు

  • విచారణ చేపట్టిన పోలీసులు

  • భద్రాచలం : బంగారు ఆభరణాల లెక్క తేలనుంది. దేవాదాయ శాఖ జ్యూయలరీ అధికారి(జేవీఓ) భాస్కర్‌ శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఆభరణాలను మంగళవారం తనిఖీ చేశారు. రెండు బంగారు నగలు మాయమైన నేపథ్యంలో మిగతావన్నీ భద్రంగానే ఉన్నాయా.. అనే విషయమై నిగ్గు తేల్చేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు భద్రాచలం వచ్చిన జేవీఓ తొలుత అర్చకుల ఆధ్వర్యంలో ఉన్న ఆభరణాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు.

     

    గర్భగుడిలోని ప్రత్యేక బీరువాలో ఉన్న ఆభరణాలను బయటకు తీయించి.. అర్చకుల సమక్షంలోనే ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయంలో అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న ఆభరణాలు అదే పరిమాణంలో ఉన్నాయా.. లేదా.. అని పరిశీలించారు. ఆభరణాల తనిఖీకి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని జీవీఓ తెలిపారు. కాగా.. బంగారు ఆభరణాల మాయంపై దేవస్థానం ఈఓ రమేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఐదుగురు అర్చకులపై కేసు నమోదైంది.

     

    ఇద్దరు ప్రధానార్చకులు, ఇద్దరు ఉప ప్రధానార్చకులతోపాటు ఇప్పటికే ఉద్యోగ విరమణ చేసిన మరో అర్చకుడిపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు.. దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. భద్రాచలం సీఐ శ్రీనివాసులు రామాలయ పరిసరాలను మంగళవారం పరిశీలించారు. ఈఓ రమేష్‌బాబుతో చర్చించిన తర్వాత అర్చకులు, సిబ్బందితో మాట్లాడారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. భక్తుల మనోభావాలతో కూడిన అంశం కావడంతో కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. ఎస్పీ, ఏఎస్పీ సూచనల మేరకు అనుమానిత వ్యక్తులపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టారు.   

     

    ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి..

    భద్రాచలం ఆలయ చరిత్రలో బంగారు నగలు మాయం కావడం ఇదే తొలిసారి అని రామదాసు వంశస్తులు అంటున్నారు. సీతమ్మవారి మంగళ సూత్రాలే కనిపించకుండా పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భద్రాద్రి ఆలయంలో మొత్తం 50 కేజీల బంగారం, 750 కేజీల వెండి నిల్వలు ఉన్నాయి. స్వామివారికి  నిత్యకల్యాణం, ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాల్లో అలంకరించేందుకు కొన్ని ఆభరణాలు అర్చకుల ఆధీనంలోనే ఉంటాయి. సుమారు 11 కేజీల 898 గ్రాముల 28 మిల్లీ గ్రాముల బంగారంతో కూడిన వివిధ రకాల ఆభరణాలు 105 వరకు అర్చకుల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి రక్షకులుగా ఉండాల్సిన అర్చకులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా జరిగిన ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. 

     

    చర్యలకు రంగం సిద్ధం

    ఆభరణాలు మాయమైన నేపథ్యంలో అర్చకులపై కఠిన చర్యలకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దీనికి బాధ్యులైన మిగతా వారిని కూడా విచారించేందుకు నిర్ణయించారు. మొత్తం 11 మంది అర్చకుల మధ్య బంగారు ఆభరణాల నిర్వహణ ఉంటుందని, దీనికి వారంతా బాధ్యులేనని ఈఓ రమేష్‌బాబు తెలిపారు. వారం రోజులుగా సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. ముగ్గురు అర్చకుల కదలికలపై నిఘా పెట్టారు. మాయమైన నగలు హుండీల్లో వేసి ఉంటారేమోననే అనుమానంతో వాటì ని కూడా తెరిచే క్రమంలో బుధవారం లెక్కింపునకు నిర్ణయించారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top