జనగామ, మహబూబాబాద్‌లకు ఔటర్‌ రింగ్‌ రోడ్లు

జనగామ, మహబూబాబాద్‌లకు ఔటర్‌ రింగ్‌ రోడ్లు


డీపీఆర్‌లు రూపొందించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి కడియం ఆదేశం



హైదరాబాద్‌: వరంగల్, మహబూబాబాద్, జనగామలకు ఔటర్‌ రింగ్‌ రోడ్లు నిర్మించేందుకు డీపీఆర్‌లు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మూడు జిల్లా కేంద్రాల మీదుగా రెండు వంతున కొనసాగుతున్న జాతీయ రహదారులను బైపాస్‌లుగా చేసి ఔటర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్లో చేరిస్తే రాష్ట్ర ఖజానాపై భారం తగ్గుతుందన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశ మందిరంలో ఆయన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, ఆరూరి రమేశ్, శంకర్‌నాయక్‌ వరంగల్‌ మేయర్‌ నరేందర్, కుడా చైర్మన్‌ యాదవరెడ్డి తదితరులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వరంగల్‌ ఔటర్‌రింగురోడ్డు పనులు మొదలైనా, నత్తనడకన సాగుతుం డటం సబబు కాదన్నారు.



ప్రస్తుతం జరుగుతున్న ఔటర్‌ రింగ్‌రోడ్డు బైపాస్‌ పనులను వెంటనే వేగిరపరచాలని ఆదేశించారు. వరంగల్‌ మీదుగా ఎన్‌హెచ్‌ 163, జగిత్యాల–ఖమ్మం ఎన్‌హెచ్, మహబూబాబాద్, మరిపెడ మీదుగా వెళ్లే భూపాలపల్లి–నర్సంపేట ఎన్‌హెచ్, మహబూబాబాద్‌ మీదుగా భద్రాచలం–వలిగొండ వెళ్లే జాతీయ రహదారి, జనగామ మీదుగా ఎన్‌హెచ్‌ 163, సూర్యాపేట ఎన్‌హెచ్‌లను మూడు ఔటర్‌ రింగ్‌రోడ్డులతో అనుసంధానించేలా అలైన్‌ మెంట్లలో చేర్చాలని సూచించారు. కాగా ఫాతిమానగర్, ఖాజీపేటల మధ్య సమాంతర ఆర్‌ఓబీ నిర్మాణం కోసం అధికారులు డీపీఆర్‌ పూర్తి చేశారు. దీనికి రూ.70 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. వచ్చే ఏడాది సమ్మక్కసారలమ్మ జాతర ఉన్నందున భూపాలపల్లి వెళ్లే రోడ్డును 4 వరుసలుగా అభివృద్ధి చేయాలన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top