మంత్రి ఆదినారాయణరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి

మంత్రి ఆదినారాయణరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి

ఎమ్మెల్యే జగ్గిరెడ్డి డిమాండ్‌

ఆలమూరు (కొత్తపేట) : ఇటీవల దళితులను ఉద్దేశించి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి సీహెచ్‌ ఆదినారాయణరెడ్డి అంబేద్కర్‌ విగ్రహం కాళ్లు పట్టుకుని బహిరంగ క్షమాపణ తెలపాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి  డిమాండ్‌ చేశారు. మండలంలోని పెదపళ్లలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ తమ్మన శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారితో కలిసి ఆయన విలేకరులతో  మాట్లాడారు. గౌరవప్రదమైన పదవిలో ఉంటూ రిజర్వేషన్లు ఉద్దేశించి దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేశామని చెబుతున్న సీఎం చంద్రబాబు మళ్లీ స్టీరింగ్‌ కమిటీల నియామకం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నంద్యాల ఉప ఎన్నికలోను, కాకినాడ నగరపాలక సంస్థలోను వైఎస్సార్‌సీపీ విజయం సాధింస్తుందని దీమా వ్యక్తంచేశారు. 

ఫ్రోటోకాల్‌ ఉల్లంఘనలతో అప్రతిష్ట

జిల్లాలో ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు ఉన్నచోట తరచూ  ప్రోటోకాల్‌ ఉల్లంఘనలతో పాల్పడుతూ టీడీపీ తన నైజాన్ని బయటపెట్టుకుంటుందని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆరోపించారు. కొత్తపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని శిలాఫలకం మీద ఎమ్మెల్యే పేరును ఒక్కోసారి రెండు, మరోసారి ఏడో నంబరులో పొందు పర్చుతున్నారన్నారు. ప్రోటోకాల్‌ నిబంధనలపై తరచూ మాట్లాడుతున్న రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం పేరును పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం శిలాఫలకంలో మూడో చోట స్థానే ఆరో చోట ఉంచిన విషయంపై ఆ పార్టీ నేతలు ఏమి సమాధానం చెబుతారన్నారు. ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్‌కు మరోసారి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, సేవాదళ్‌ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు నెక్కంటి వెంకట్రాయుడు, ఎంపీటీసీ సభ్యుడు ఏడిద మెహెర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top