సొంతగూటికి జగ్గారెడ్డి

సొంతగూటికి జగ్గారెడ్డి - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థంపుచ్చుకొని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) తిరిగి సొంతగూటి కి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరేందుకు వీలుగా పార్టీ అధిష్టానం అనుమతి కోరేందుకు ఆయన గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌లో చాలా సీనియారిటీ ఉండి కూడా కొన్ని అనుకోని పరిస్థితుల్లో పొరపాటున బీజేపీలో చేరాను. అది నా రాజకీయ జీవితంలో చేసిన పెద్ద తప్పిదం. అలాంటి పొరపాటు పునరావృతం కానివ్వను. తిరిగి కాంగ్రెస్‌లో చేరి పనిచేయాలని పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశాను. ఆగస్టులో పార్టీలో చేరుతాను. పార్టీని వీడినందుకు అధిష్టానానికి క్షమాపణ చెబుతున్నా’ అని తెలిపారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానంతోపాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్...లోక్‌సభ సీటుకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరగడం తెలిసిందే.

 

 పీసీసీ, డీసీసీ సిఫారసు మేరకే..

 జగ్గారెడ్డితో భేటీ అనంతరం దిగ్విజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌ను వీడినందుకు ఆయన క్షమాపణ కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి.. జగ్గారెడ్డిని మళ్లీ కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని సిఫారసు చేశారు. వారి సిఫారసు మేరకు తగిన ప్రక్రియను అనుసరించి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి కోరతాం’ అని పేర్కొన్నారు.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top