ఉద్యమిస్తున్న ఏపీ

ఉద్యమిస్తున్న ఏపీ - Sakshi


జగన్ దీక్షకు వెల్లువెత్తుతున్న ప్రజా మద్దతు

 

 గుంటూరు నుంచి సాక్షి ప్రత్యేకప్రతినిధి:  ‘ప్రత్యేక హోదా-ఏపీ హక్కు’ అనే నినాదంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. శుక్రవారం మూడో రోజుకు చేరుకున్న ఆయన దీక్షా శిబిరానికి జనం వెల్లువెత్తారు. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో దీక్ష చేస్తున్న జగన్‌ను పలకరించి, తమ మద్దతు ప్రకటించడానికి ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. గుంటూరు నగరంలో ఏకంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనా లెక్కచేయకుండా మహిళలు, యువకులు, వృద్ధులు తండోపతండాలుగా దీక్షా శిబిరానికి తరలివచ్చారు. ప్రత్యేక హోదా కోసం మేమూ మీతో ఉన్నామంటూ... జగన్‌తో చేతులు కలిపి తమ పోరాట స్ఫూర్తిని చాటారు.



విద్యార్థినీ, విద్యార్థులు, నిరుద్యోగ యువకుల కోలాహలం దీక్షా వేదిక వద్ద ఎక్కువగా కనిపించింది. శిబిరానికి మహిళలు పెద్ద సంఖ్యలో రావడం ఆకట్టుకుంది. జగన్‌ను చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉత్సాహం ప్రదర్శించారు. జగనన్నతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు తాపత్రయపడ్డారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు కూడా తరలి వచ్చారు. నిరాహారదీక్షకు ఉపక్రమించి మూడు రోజులైనా జగన్ ఓర్పుతో నిర్విరామంగా తనకు మద్దతు తెలపడానికి వచ్చిన వారందరినీ పలుకరించారు.



నల్లపాడు రోడ్డుకు ఓ వైపు నుంచి సత్తెనపల్లి, పల్నాడు ప్రాంతమైన నర్సారావుపేట, మాచెర్ల, గురజాల నియోజకవర్గాలు, మరోవైపు నుంచి గుంటూరు నగరంతో సహా పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజలతో రోడ్లన్నీ కిటకిటలాడాయి. దీక్షా శిబిరం వైపునకు వచ్చే వాహనాలు, ముఖ్యంగా ఆటోలు ప్రయాణికులతో క్రిక్కిరిసి పోయాయి. జనం ఊరేగింపులుగా రావడం, ఆటోలు, వాహనాల రాకపోకల రద్దీతో దీక్షా శిబిరానికి అన్ని వైపులా ట్రాఫిక్ నిదానంగా ముందుకు సాగింది.



నిరాహారదీక్ష ప్రారంభమైన తొలి రోజున (బుధవారం) పెద్ద సంఖ్యలో గుంటూరుకు తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ మరుసటి రోజు నుంచీ తమ నియోజకవర్గాలకు వెళ్లి ప్రత్యేక హోదా సాధన ఉద్యమానికి మద్దతుగా స్థానికంగా రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులతో రాష్ట్రవ్యాప్తంగా హోదా ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. విద్యార్థి, యువజన సంఘాలు కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. విద్యావేత్తలు స్వచ్ఛందంగా జగన్ దీక్షకు తమ మద్దతు ప్రకటించి, ప్రత్యేకహోదా ద్వారానే అభివృద్ధి సాధ్యమని జగన్ చేస్తున్న వాదనతో గొంతు కలుపుతున్నారు.   



 చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో..

 మూడు రోజులుగా ఆహారం లేకపోయినా ఆయన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉదయం నుంచీ సాయంత్రం వరకూ శిబిరంలోనే కూర్చుని జనంతో గడిపారు. విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య జగన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి చాలా అవసరమని, దీక్ష చేయడం పూర్తిగా సమర్థనీయమని ఆయన జగన్‌తో చెప్పారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా వసంతరావు జగన్‌ను కలిసి దీక్షకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో 1.42 లక్షల ఉద్యోగాలున్నా భర్తీ చేయడంలేదని, త్వరగా నోటిఫికేషన్లు విడుదయ్యేలా ఒత్తిడి తేవాలని ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లడుగు గోవిందరాజు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూట ర్ విద్యను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం ద్వారా 12,600 మంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కంప్యూటర్ టీచర్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు జగన్‌తో తమ ఆవేదన వెళ్లబుచ్చుకున్నారు.



 వేలల్లో సెల్ఫీలు...

 వేలాదిగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన జనం జగన్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. యువతీయువకులు, విద్యార్థినీ, విద్యార్థులు, గృహిణులు, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో జగన్ పక్కన కూర్చుని సెల్ఫీలు తీసుకుని సంతోషించారు. ఇలా సెల్ఫీలు తీసుకున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ప్రతి ముగ్గురేసి సందర్శకుల్లో ఒక్కరైనా సెల్ఫీ తీసుకున్నారు. కొందరు మహిళలైతే తమ పిల్లా పా పలతో జగన్‌తో ఫొటోలు తీయించుకున్నారు.



 పార్టీ నేతల సంఘీభావం..

 పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యన్నారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, గొట్టిపాటి రవికుమార్ (బుజ్జి), ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కోనా రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సర్వేశ్వరరావు, రక్షణనిధి, పాయం వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి తదితరులు శిబిరానికి వచ్చి జగన్‌కు సంఘీభావం ప్రకటించారు.

 

 యువత కోసమే జగన్ దీక్ష

  దీక్షా వేదికపైనుంచి శుక్రవారం పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రసంగించి  రాష్ట్రానికి ప్రత్యేకహోదాకోరుతూ విపక్షనేత జగన్ చేపడుతున్న నిరవధిక దీక్ష లక్ష్యాన్ని, హోదా అవశ్యకతను సభికులకు వివరించారు. ఇలా దివంగత ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ జగన్ చేపట్టిన దీక్ష యువత భవితకోసమేనన్నారు. వారి కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయడం లేదన్నారు.విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలుచేయాల్సిందిగా రాజంపే ఎంపీ మిథున్ రెడ్డి తన ప్రసంగంలో కోరారు.రాష్ర్ట భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే ప్రత్యేక హోదా సాధించాల్సిన అవసరమని ఘట్టమనేని శేషగిరిరావు అన్నారు. జగన్ దీక్షకు మద్దతు ప్రకటించి ఆయన బాటలో అందరూ ఉద్యమంలో పాల్గొనాలనీ అన్నారు.

 

హోదా కోసం నినదిస్తున్న రాష్ట్రం

  సాక్షి, విజయవాడ బ్యూరో:  ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రతరం అయ్యింది. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహారదీక్షతో ఉద్యమం విస్తరిస్తోంది. గుంటూరులో ఆయన చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతుగా నిలిచేం దుకు రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచి వైఎస్సార్ పార్టీ శ్రేణులు, ప్రజలు, విద్యార్ధులు కదిలివస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన దీక్ష శుక్రవారం మూడవ రోజుకు చేరడంతో రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లోను ధర్నాలు, రాస్తారొకోలు, బైక్‌ర్యాలీలు, కేంద్ర కార్యాలయాల ముట్టడి వంటి నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.

 

 జగన్‌కు వైద్య పరీక్షలు

  బీపీ, షుగర్, పల్స్ సాధారణ స్థితిలోనేనన్న వైద్యులు

 గుంటూరు మెడికల్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారానికి మూడో రోజుకు చేరుకుంది. తొలిరోజు బుధవారం ఎలాంటి పరీక్షలు చేయలేదు. రెండోరోజు గురువారం జీజీహెచ్ వైద్యులు పరీక్షలు చేశారు. శుక్రవారం ఉదయం జీజీహెచ్ జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శనక్కాయల ఉదయ్‌శంకర్ వైద్య పరీక్షలు చేయగా, రాత్రి మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రీస్తుదాసు వైద్య పరీక్షలు చేశారు. ఉదయం 9.55 గంటల సమయంలో బీపీ 110/70, షుగర్ 94, పల్స్ 80 ఉండగా, రాత్రి 7.40 గంటల సమయంలో బీపీ 130/80, షుగర్ 88, పల్స్ 66 ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బీపీ, షుగర్, పల్స్ అన్నీ కూడా సాధారణ స్థితిలోనే ఉన్నట్లు జీజీహెచ్ ఆర్‌ఎంవో డాక్టర్ అనంత శ్రీనివాసులు వెల్లడించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top