నిబంధనలకు నీళ్లు..యథేచ్ఛగా అక్రమాలు

నిబంధనలకు నీళ్లు..యథేచ్ఛగా అక్రమాలు - Sakshi


మెదక్‌ మున్సిపాలిటీ: పట్టణంలో అక్రమ వెంచర్లు రోజు రోజుకూ జోరుగా వెలుస్తున్నాయి. వాటిపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్‌ అధికారులు చేతివాటం ప్రదర్శించి అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై అడ్డదారులు తొక్కుతూ మున్సిపల్‌ కౌన్సిల్‌ను పక్కదారి పట్టిస్తున్నారు. ఇటీవల ఓ కౌన్సిలర్‌  కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని 7వ వార్డు పరిధిలోని సర్వేనంబర్‌ 508లోని  5.275  గుంటల భూమిని తమ పేరున లే ఔట్‌ చేయాలని కోరుతూ నాగేల్లి అంజన్‌ బాబు, జంగిటి మురళీధర్‌లు 2012 నవంబర్‌ 15న హైదరాబాద్‌ డీటీసీపీకి దరఖాస్తు చేసుకొని, భూ మార్పిడి ఉత్తర్వులను తీసుకున్నారు.



అయితే నిబంధనల ప్రకారం   హైదరాబాద్‌ డీటీసీపీ ఆమోదం తెలుపుతూ తదుపరి చర్యల కోసం మెదక్‌ మున్సిపాలిటీకి పంపించారు. లేఔట్‌ నిబంధనల ప్రకారం ఆ ప్రాంతంలో రోడ్లు,  పార్క్‌ స్థలాన్ని పురపాలక సంఘానికి రిజిస్ట్రేషన్‌ చేసి ఫైనల్‌ లే ఔట్‌ రిలీజ్‌కు కోరినట్లు మున్సిపల్‌ అధికారులు మున్సిపల్‌ ఎజెండాలో పేర్కొన్నారు. అయితే హైదరాబాద్‌ డీటీసీపీ నిబంధనల ప్రకారం లే ఔట్‌లో అభివృద్ధి పనులు పూర్తి అయ్యాక ఫైనల్‌ లే ఔట్‌ రిలీజ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ లే ఔట్‌లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకముందే వారు అనుమతినివ్వడానికి మున్సిపల్‌ ఎజెండా అంశాల్లో పేర్కొని అధికారులు కౌన్సిలర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని 7వ వార్డు కౌన్సిలర్‌ అమీన అహ్మద్‌ ఆరోపించారు.



మున్సిపల్‌ అధికారులు సదరు లే ఔట్‌ ప్లాట్‌లో స్థల పరిశీలన చేసి అన్ని సక్రమంగా ఉన్నాయని, ఫైనల్‌ లే ఔట్‌ రిలీజ్‌ చేసేందుకు ఎజెండాలో పొందు పర్చారని తెలిపారు. ఈ విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని, అక్రమ లేఔట్‌పై జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే మున్సిపల్‌ కమిషనర్‌ స్వయంగా లేఔట్‌ను పరిశీలించాకే పర్మిషన్‌ ఇవ్వాలని, కానీ అలా జరగలేదని కౌన్సిలర్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. ఇప్పటికే పట్టణంలోని పాత వివేకానంద స్కూల్‌ ప్రాంతం సర్వే నం. 368లో ఒక ఎకరం‡ 32 గుంటల భూమిలో రోడ్లు లేవు, పార్కు లేదు, కరెంట్‌ స్తంభాలు లేవు. మున్సిపాలిటీకి ఆదాయం లేదు. సుమారు రూ.8కోట్ల విలువైన స్థలంలో ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారన్న విషయంపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్‌ కోరారు.



కమిషనర్‌ వివరణ

ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావును వివరణ కోరగా నిబంధనలు పూర్తి చేశాకే ఫైనల్‌ లే ఔట్‌ రిలీజ్‌ చేస్తామని తెలిపారు. కౌన్సిల్‌ ఆమోదం కోసమే ఎజెండా అంశాల్లో లేఔట్‌ను ఉంచామని చెప్పారు. కానీ ఫైనల్‌ లేఔట్‌ రిలీజ్‌ అంటూ ఎజెండాలో పేర్కొనడం గమనార్హం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top