రక్షణ రంగంలో రష్యా పెట్టుబడులు

రక్షణ రంగంలో రష్యా పెట్టుబడులు


⇒ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు

⇒ సారథ్యం వహించిన రాష్ట్ర ప్రభుత్వం

⇒ ఫార్మా సిటీ, స్టీల్‌ ప్లాంట్‌ను సందర్శించిన రష్యా బృందం


విశాఖపట్నం : రక్షణ, నౌకా రంగంలో రష్యా పెట్టుబడులకు మరింత అవకాశం కల్పించే దిశగా మరో అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో రష్యా దేశం చెలియా బిన్‌స్క్‌ రీజియన్‌ గవర్నర్‌ బోరిస్‌ డుబ్రోవ్‌స్కీ పలు శాఖల మంత్రులు, అధికారుల బృందం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులు, పలు కంపెనీల ప్రతినిధుల మధ్య ఇరు ప్రాంతాల్లో పెట్టుబడులకున్న అవకాశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.


దేశంలోను, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆహ్వానించేందుకు రష్యా ప్రతినిధుల బృందంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి గంటా శ్రీనివాసరావు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టిన పెట్టుబడులకు ఎటువంటి ఢోకా ఉండదని, స్నేహ పూర్వక వాతావరణంలో వ్యాపారం చేసుకొనేందుకు అవసరమైన పరిస్థితులను ప్రభుత్వం కల్పిస్తోందని ఆయన అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో 7 బిలియన్‌ డాలర్లతో పలు రోడ్లను, 200 బిలియన్‌ డాలర్లతో లాజిస్టిక్‌ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నామని వారికి వివరించారు.


ప్రస్తుతం ఉన్న ఆరు ఎయిర్‌పోర్టులు, ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు ఎయిర్‌ పోర్టులను, 7 పోర్టుల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు, ఒక కోస్టల్‌ ఎకనమిక్‌ జోన్‌ను అభివృద్ధి చేయనున్నామని, ఇందులో కూడా పెట్టుబడులకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. చెలియా బిన్‌స్క్‌  రీజి యన్‌ గవర్నర్‌ బోరిస్‌ డుబ్రోవిస్కీ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా దక్షిణ రష్యా రీజియన్, భారత్‌ మధ్య పెట్టుబడులు, ద్వైపాక్షిక సంబంధాలు చక్కగా కొనసాగుతున్నాయన్నారు.


ప్రత్యేకించి, మెటలర్జీ, మెషిన్‌ బిల్డింగ్‌లో మంచి సంబం ధాలు ఉన్నాయన్నారు. తమ రీజియన్‌ కూడా అన్ని రంగాల్లో అగ్రపథంలో ఉందని, తమ ప్రాంతంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని భారత్‌ పెట్టుబడిదారులను ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జె.కృష్ణకిశోర్‌ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా రష్యా ప్రతినిధులకు వివరించారు. ఏపీ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు జి.సాంబశివరావు, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జి.సాంబశివరావు ఈ చర్చల్లో పాల్గొన్నారు.


ఎయిర్‌పోర్టులో సాదర స్వాగతం

ఎయిర్‌పోర్టులో రష్యా ప్రతినిధులకు మంత్రి గంటా స్వాగతం పలికారు. ఉదయం 11 గంటల నుంచి చర్చలు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు ముగిశాయి. భోజన విరామం అనంతరం రష్యా ప్రతినిధుల బృందం జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీని సందర్శించింది. శనివారం ఈ బృందం అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబును కలవనుందని మంత్రి గంటా విలేకరులకు వెల్లడించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top