మత్తుకు అలవాటైతే ...చిత్తే!

మత్తుకు అలవాటైతే ...చిత్తే! - Sakshi


⇒ నగరంలో జోరుగా గంజాయి వ్యాపారం

⇒ బానిసలుగా మారుతున్న యువత

⇒ ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న వైద్యులు




మర్రిపాలెం/సీతమ్మధార (విశాఖ ఉత్తర): నగరంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఆయా ప్రాంతాల్లో అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అధిక శాతం యువత గంజాయి మత్తుకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటుంది. ఇటీవల గోపాలపట్నంలోని ఓ పాఠశాలలో విద్యార్థుల వద్ద గంజాయి పట్టుబడటం ఆందోళన కలిగించే  అంశం. గంజాయి తరలిస్తున్న వ్యక్తులపై దాడులు చేసి అరెస్టులు చేస్తున్నా.. ఈ వ్యాపారానికి అడ్డుకట్ట పడటం లేదు. ఈ తరహా కేసులు తరచూ నమోదవుతూనే ఉన్నాయి.


గుట్టుచప్పుడు కాకుండా రవాణా

విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి రవాణా జరుగుతోంది. కార్లు, జీపులు, ఆటోల్లో గంజాయిని నగరానికి తీసుకువస్తున్నారు. ఆదాయం మెండుగా వస్తుండటంతో ఈ రవాణా అధికమవుతోంది. ప్యాసింజర్, రవాణా తరహా వాహనాల్లో గంజాయి కళ్లుగప్పి తరలిస్తుండటంతో చాలా వరకు తనిఖీల్లో పట్టుబడటం లేదు. ఒడిశా, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల నుంచి రైళ్లలో గంజాయి సరఫరా అవుతున్నట్టు సమాచారం.


పైగా ముఠాలుగా ఏర్పడటంతో ఇది మాఫియాను తలపిస్తోంది. విశాఖ రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాలు, మర్రిపాలెం, గోపాలపట్నం, పెందుర్తి రైల్వేస్టేషన్లు, జ్ఞానాపురం, కంచరపాలెం, రామ్మూర్తి పంతులు పేట బ్రిడ్జి, చంద్రంపాలెం, మారికవలస, ఆర్టీసీ కాంప్లెక్స్‌ దరి తదితర ప్రాంతాలు గంజాయి సరఫరా కేంద్రాలుగా ఉంటున్నాయి.


బలైపోతున్న యువత

గంజాయి మత్తుకి అలవాటుపడ్డ యువత తమ జీవితాలను బలిచేసుకుంటోంది. గంజాయి వినియోగం ప్రస్తుతం యువతకు ఫ్యాషన్‌గా మారుతోంది. సిగరెట్లలో గంజాయిని చేర్చి సేవించడంతో అనుమానాలకు తావు లేకుండా పోతోంది. బహిరంగ ప్రదేశాల్లో గంజాయి సేవిస్తున్నా ఏం చేయలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి.


ఆరోగ్య సమస్యలు

గంజాయి అధికంగా నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. సరదాగా అలవాటైన గంజాయి మనిషిని బానిసగా చేస్తుంది. భోజనం లేకపోయినా ఫర్వాలేదు కానీ గంజాయి పీల్చకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. గంజాయి అధికంగా సేవించే వారికి బలహీనతతో కాళ్లు, చేతులు వణుకుతుంటాయని, కొంత కాలానికి శరీరంలోని ముఖ్య అవయవాలకు ముప్పు తప్పదని వైద్యులు చెబుతున్నారు. మత్తులో ఉండటంతో జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపుతుందని అంటున్నారు.



మత్తుతో ముప్పు తప్పదు

గంజాయి వినియోగంతో ఆరోగ్యం సమస్యలు తప్పవు. ముఖ్యంగా నాడీ వ్యవస్థ మీద ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు ఎదురుకావచ్చు. సిగరెట్, బీడీ కంటే గంజాయి అత్యంత ప్రమాదకరం. ముఖ్యంగా యుక్త వయసులో యువత గంజాయికి అలవాటు పడితే జీవితం అంధకారంలో పడినట్టే. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గుర్తించాలి. చెడు వ్యసనాలకు బానిసైతే రక్షించుకోవాలి. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలతో గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేయాలి.



వాడకం ఇలా...

గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా చేసి అమ్ముతున్నారు. ఒక్కో పొట్లం రూ.50 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. పొగాకు తరహాలో గంజాయిని పిండిగా చేసి సిగరెట్‌ను పొడికి తగిలిస్తూ వాడుతున్నారు. కొంత మంది సిగరెట్లలో గంజాయిని పొందుపరచి అమ్ముతున్నారు. చాక్లెట్‌ల రూపంలో గంజాయి నగరంలో అధిక శాతం సరఫరా అవుతోంది. ఒకప్పుడు బిచ్చగాళ్లు, ఆటో కార్మికులు, రైల్వే కూలీలు వినియోగించేవారు. వినియోగంలో కిక్కు ఉండటంతో యువత గంజాయి మత్తుకు అలవాటు పడుతోంది. కొంత మంది మత్తు ఎలా ఉందో తెలుసుకుందామని ప్రయత్నించి బానిసలుగా మారుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top