తిరుపతికి అంతర్జాతీయ విమాన సర్వీసులు

తిరుపతికి అంతర్జాతీయ విమాన సర్వీసులు


- అక్టోబర్‌లో గన్నవరం నుంచి...

- విలేకరుల సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్




విజయవాడ సిటీ: వచ్చే నెల తిరుపతి విమానాశ్రయం నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఇంధన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. న్యూఢిల్లీ మీదుగా దుబాయ్, అమెరికా, మధ్య తూర్పు దేశాలకు సర్వీసులకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ) ఆమోదం తెలిపిందన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌లో విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడపనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని అన్ని విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలో విమాన ప్రయాణికుల వృద్ధిరేటు 17శాతం ఉండగా రాష్ట్రంలో 61 శాతం ఉందన్నారు. తిరుపతిలో 48 శాతం, రాజమండ్రిలో 44 శాతం, విశాఖలో 64 శాతం, విజయవాడలో 69 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. తిరుపతిలో కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చిందని, రాజమండ్రిలో టెర్మినల్ విస్తరణ పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. కడప నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడుపుతున్నట్టు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని, అది అందుబాటులోకి వస్తే విశాఖ విమానాశ్రయం మూసివేస్తామని తెలిపారు.



మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి భూసేకరణతో పాటు నిధుల సమస్య ఉందని అంగీకరించారు. మెరుగైన విద్యుత్ సరఫరా, తక్కువ ధరకే గ్యాస్, సోలార్, విండ్ విద్యుత్ ఉత్పాధనపై పరిశోధనలు నిర్వహించేందుకు అనంతపురంలో ఇంధన యూనివర్సిటీని, కాకినాడలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో లాజిస్టిక్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖ జిల్లా పూడిమడకలో ఎన్‌టీపీసీ 4వేల మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పాదనకు రాష్ట్రంలో 10 ప్లాంటులు ఏర్పాటు చేస్తామని, ఉభయగోదావరి జిల్లాల్లో ఇంటింటికి సబ్సిడీ గ్యాస్ సరఫరా కోసం కొవ్వూరులో ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు.



ఫైబర్‌నెట్ సేవలు అందుబాటులోకి వస్తే కొత్తగా తిరిగి సెట్‌అప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ స్తంభాలకు ఫైబర్‌నెట్‌ను అనుసంధానం చేసి ప్రతి ఇంటికి రూ.100కే 15ఎంబి ఇంటర్‌నెట్‌తో పాటు టీవీ చానల్స్, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. జూలై నుంచి ఈ సేవలు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నట్టు అజయ్ జైన్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ పోర్ట్సు రవికుమార్, భావనంపాడు పోర్టు ఎండీ వెంకటేశ్వరరావు, స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ సీఈఓ చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top