పట్టా.. తాకట్టు!

పట్టా.. తాకట్టు!


వడ్డీ వ్యాపారుల వద్ద రైతుల పట్టదారు పాసుపుస్తకాలు

అప్పు ఇచ్చేముందే జమానతుగాపెట్టుకుంటున్న వైనం

రైతు సమగ్ర సర్వే ద్వారావెలుగులోకి

కృష్ణా మండలంలోనే40శాతం ప్రైవేటు తాకట్టులో

జిల్లాలో కేవలం 72శాతమే సమగ్ర సర్వే

బ్యాంకుల్లో అప్పుపుట్టక విలవిల  




సాక్షి, మహబూబ్‌నగర్‌/మాగనూర్‌ : జిల్లా ప్రాంత రైతన్నకు కొత్త కష్టం వచ్చింది. సరైన వర్షాలు లేక వరుస కరువుతో కొట్టుమిట్టాడే ఈ ప్రాంతంలో అప్పు పుట్టక అన్నదాత విలవిలలాడుతున్నాడు. ఈసారి తొలకరి జల్లులు ముందే పడుతుండటంతో కాసింత పంట వేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. బ్యాంకుల్లో అప్పు పుట్టక, చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. తమతో ఉన్న ఏకైన ఆధారం భూమి పట్టా పుస్తకాలను కుదవపెడుతున్నారు.



ఈ విషయం ఇటీవల ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వే ద్వారా వెలుగు చూసింది. జిల్లా సరిహద్దు మండలం కృష్ణాలో దాదాపు 40 శాతం మంది రైతులు తమ భూమి పట్టా పాసు పుస్తకాలను అప్పుకోసం వడ్డీ వ్యాపారుల వద్ద కుదవపెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. అప్పు తెచ్చిన వ్యాపారికే పంటను అమ్మేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పండిన పంటను సదరు వ్యాపారి వద్దకు తీసుకెళ్లకపోతే వడ్డీ రేట్లలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి.



బ్యాంకుల్లో అప్పు పుట్టడంలేదు..

నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు రైతులకు డబ్బులు ఇవ్వడానికి సతాయిస్తున్నాయి. 2017–18 ఏడాది పంట రుణ ప్రణాళికను ఇప్పటివరకు అమలుచేయడంలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు రూ.6,981.5 కోట్ల రుణాలు అందజేయాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై దాదాపు 15 రోజులు కావొస్తున్నా ఇప్పటివరకు సగం లక్ష్యం కూడా చేరుకోలేదు. చాలావరకు బ్యాంకులు రుణాలను రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో నగదు నిల్వలు భారీగా పడిపోయాయి. చాలా బ్యాంకుల్లో నో క్యాష్‌ బోర్డులు పెడుతున్నారు. రైతు రుణాలను తప్పనిసరి చెల్లించాల్సి వస్తే సగం డబ్బులు ఇచ్చి, మిగతాది సేవింగ్‌ అకౌంట్‌లో జమ చేస్తున్నారు. విచిత్రంగా సదరు బ్యాంకుకు చెందిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, దాని ద్వారా చెల్లింపులు చేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. బ్యాంకు అధికారులు ఇస్తున్న ఉచిత సలహాలతో రైతులు విస్తుపోతున్నారు.



ప్రైవేటు వ్యాపారుల వద్దకు క్యూ..

బ్యాంకులు చేతులు ఎత్తేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. భూమి హక్కులకు సంబంధించి రెవెన్యూ విభాగం రైతులకు రెండు పాస్‌ పుస్తకాలు అందజేస్తోంది. అందులో ఒకటి టైటిట్‌ పుస్తకం కాగా.. మరోటి పాస్‌ పుస్తకం ఉంటుంది. ఆర్డీఓ సంతకం ఉండే టైటిల్‌ పుస్తకాలు ఇదివరకే బ్యాంకుల్లో ఉండటం... తాజా అప్పుల కోసం రైతులు తమ వద్ద ఉన్న రెండో పాస్‌పుస్తకాన్ని ప్రైవేటు వ్యాపారుల వద్ద కుదవపెడుతున్నారు.



ఇలా పాలమూరు ప్రాంతంలో అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలోని ఒక్క కృష్ణామండలంలో దాదాపు 40శాతం మంది రాయిచూరులోని మార్కెట్‌యార్డుకు చెందిన కమిషన్‌ ఏజెంట్ల వద్ద తాకట్టులో ఉంచారు. వీరు ప్రతి సంవత్సరం వ్యవసాయ పెట్టబడులకు, విత్తనాలు, ఎరువులకు తమ పాసుపుస్తకాలను వారి వద్ద ఉంచి,  కావాల్సిన పెట్టుబడులు తెచ్చుకుంటారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు సమగ్ర సర్వే ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారం రోజులుగా అధికారులు ఆయా గ్రామాల్లో సర్వేకు వెళ్లిన సమయంలో సంబంధిత రైతులు తమ పాసు పుస్తకాలు మార్కెట్‌యార్డులో తాకట్టు పెట్టిన విషయాలు బయటపడ్డాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top