వడ్డీ.. ఏటా రూ.కోటి

వడ్డీ.. ఏటా రూ.కోటి - Sakshi


⇒ మాఫీ వర్తింపజేయని కాపులకనిపర్తి సొసైటీ

⇒ అన్ని సొసైటీలు, బ్యాంకుల్లో అమలవుతున్నా ఇక్కడ మొండిచేయి

⇒ ఇకనైనా వడ్డీ తిరిగి ఇవ్వాలని రైతుల వేడుకోలు




సంగెం(పరకాల):  

దేవుడు వరమిచ్చినా... పూజారి అడ్డు పడిన చందంగా తయారైంది వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం కాపులకనిపర్తి సొసైటీ పరిధిలోని రైతుల పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరికీ అన్నం పెట్టే రైతులకు లబ్ధి చేయాలనే తలంపుతో సొసైటీలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణంలో రూ.లక్ష వరకు రుణ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది.


రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు, సొసైటీల్లో రుణం తీసుకున్న వారందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే, తొలి విడతలో రుణ మాఫీ నిధులు జమ కాగానే.. రైతులు రుణాన్ని ఏడాదిలోగా రెన్యువల్‌ చేసుకుంటే తిరిగి బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చి వడ్డీ మాఫీ వర్తింపజేశాయి. కానీ సంగెం మండలంలోని సొసైటీ మాత్రం ఇందుకు భిన్నంగా రైతుల నుంచి మూడేళ్లుగా వడ్డీ వసూలు చేస్తుండడం గమనార్హం.


ఏడాది లోపు రెన్యూవల్‌ చేసుకున్నా...

సొసైటీలు, బ్యాంకుల నుంచి రైతులు తీకున్న రుణానికి సంబంధించి వడ్డీ నగదును కూడా ప్రభుత్వం తిరిగి ఇస్తోంది. ఏడాది లోపు రెన్యూవల్‌ చేసుకున్న రైతులందరికీ వడ్డీ మాఫీని వర్తింపజేస్తున్నది. కానీ మండలంలోని కాపులకనిపర్తి సొసైటీలో మాత్రం ఇందుకు భిన్నంగా రైతుల వద్ద వడ్డీ వసూలు చేస్తున్నారు.


కాపులకనిపర్తి సొసైటీ పరిధిలో సంగెం మండలంలోని కాపులకనిపర్తి, వెంకటాపూర్, కాట్రపల్లి, గవిచర్ల, ఆశాలపల్లి, రాంచంద్రాపురం, లోహిత, షాపూర్, తీగరాజుపల్లి, గుంటూరుపల్లి, ఖిలా వరంగల్‌ మండలంలోని బొల్లికుంట, గాడెపల్లి, వర్థన్నపేట మండలం చెన్నారం గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని 2,475 మంది రైతులకు రూ.10,48,08,358 రుణం అందించింది.


దీనికి గాను ఏడాదికి రూ.1,25, 35,177 వడ్డీ అవువోతంది. రైతులు సకాలంలో రుణాలను రెన్యూవల్‌ చేయించుకున్నా వడ్డీ మాఫీని వర్తింపచేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ విధంగా గత మూడేళ్లలో ఏటా రూ.1.25 కోట్లకు పైగా వడ్డీ కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సొసైటీ అధికారులను అడిగితే మా బ్యాంకు హన్మకొండలోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ వారు ఇవ్వడం లేదని చెబుతున్నారని పేర్కొంటున్నారు.


ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వడ్డీమాఫీని వర్తింపజేసి తమకు రావాల్సిన మూడేళ్ల వడ్డీని తిరిగి ఇవ్వడంతో పాటు ఈ ఏడాది వడ్డీ వసూలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ సొసైటీ పరిధిలో ఉండడం మా పాపమా ?

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సొసైటీలు, బ్యాంకుల పరిధిలో ఉన్న రైతులందరికీ వడ్డీ మాఫీ వర్తిస్తుంటే ఒక కాపులకనిపర్తి సొసైటీ పరిధిలోని రైతులకు ఎందుకు వర్తించదు? ఊకల్‌ సోసైటీ ఆం«ధ్రాబ్యాంకు వారు రైతులకు వడ్డీ తిరిగి చెల్లించారు. మేం రైతులం కాదా, మా సొసైటీకి ప్రత్యేకత ఏమిటి? ఐఓబీ వారే ఇవ్వడం లేదు. జిల్లా కలెక్టర్‌ స్పందించి మాకు వడ్డీ ఇప్పించాలి. లేకుంటే ఆందోళనలు చేస్తాం.



ఈ విషయం ఉన్నతాధికారులకు నివేదించాం...

వడ్డీ తీసుకుంటున్నది వాస్తవమే. రైతులకు వడ్డీ తిరిగి ఇవ్వమంటే ఐఓబీ హన్మకొండ శాఖ అధికారులు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని నాబార్డు, ఆర్‌బీఐ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌ కూడా నివేదించాం. ఐఓబీ పరిధిలో ఉన్న వంగపహాడ్, పెగడపల్లి, హన్మకొండ, కాపులకనిపర్తి సొసైటీలకు మాత్రమే వడ్డీ మాపీ వర్తింపజేయడం లేదు. బ్యాంకు వారు ఇస్తే మేం రైతులకు చెల్లిస్తాం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top