దడ!

దడ!

  • ఇంటర్‌ విద్యార్థులకు అగ్ని పరీక్షలా ‘నిమిషం’

  • పదో తరగతి విద్యార్థులను భయపెడుతున్న 5 నిమిషాలు..

  • క్షేత్రస్థాయి సమస్యలు పట్టించుకోరా..?

  • కనీస సౌకర్యాలే లేనప్పుడు కఠిన నిబంధనలేల!

  • ఆందోళనలో విద్యార్థులు

  • ఒక్క నిమిషం..60 సెకన్లు.. రెప్పపాటులో కాలగర్భంలో కలిసిపోయే సెకన్‌..గట్టిగా నిట్టూర్చినా నిమిషం హరీమంటుంది. పరీక్షా సమయంలో నిమిషం అగ్ని పరీక్ష పెడుతోంది. విద్యార్థులకు కన్నీళ్లు పెట్టిస్తోంది.. పరుగులు పెట్టిస్తోంది. చదివింది మర్చిపోయేంత దడ పుట్టిస్తోంది. రవాణా సదుపాయాలుండవు.. బస్సులున్న చోటా అవి వేళకు రావు. తండ్రో, సోదరుడో బైక్‌పై డ్రాప్‌ చేయబోతే ఏదో సమస్య. నడక తప్ప గత్యంతరం లేని విద్యార్థులెందరో.. ఎలా రావాలి? నిమిషమే అగ్ని పరీక్ష పెడుతోందంటే విచిత్రంగా పదో తరగతి విద్యార్థులకు ఐదు నిమిషాల నిబంధనపెట్టి వారికీ దడ పుట్టిస్తున్నారు. అసలే పల్లెటూళ్లు.. పక్క గ్రామాల నుంచి రావాలంటే ఎప్పుడో వచ్చే బస్సు.. రోడ్లే లేని ఊళ్లలోని విద్యార్థులకు పొలం గట్లే గతి..ఏమిటీ అర్థం లేని నిబంధనలు.. కనీస ఆలోచన లేని అధికారుల తీరు విద్యార్థుల గుండెల్లో దడ పుట్టిస్తోన్న వైనంపై ప్రత్యేక కథనం..



    పాపన్నపేట: ఒక్కో విద్యార్థిది ఒక్కో పరిస్థితి. కానీ ఇంటర్, ఎస్సెస్సీ బోర్డులు ఒక్క నిమిషం, 5 నిమిషాలు దాటితే పరీక్షకు అనుమతించ బోమనే కఠిన నిబంధనలు విధించి తమ జీవితాలతో ఆటలాడు కుంటున్నట్లుగా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని నర్సాపూర్‌ జూనియర్‌ కళాశాలలో ఒక్క నిమిషం నిబంధన ముగ్గురు విద్యార్థులను పరీక్షలు రాయకుండా చేసింది.



    ఈ నెల 17 నుంచి పదో తరగతి పరీక్షలు

    ఈ నెల 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.15 వరకు కొనసాగుతాయి. జిల్లాలో మొత్తం 67 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 10,924 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 21 కేంద్రాల్లో మాత్రమే డ్యూయల్‌ డెస్క్‌లు ఉండగా, 9 కేంద్రాల్లో ఒక్క డెస్కు కూడా లేనట్లు సమాచారం. మిగతా వాటిలో బెంచీలు, కుర్చీలు సమకూర్చి పరీక్షలు రాయిస్తున్నారు. ఇంకా కొన్ని కేంద్రాల్లో బయట నుంచి బెంచీలు, కుర్చీలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు, వెలుతురు, టాయిలెట్లు సరిగా లేకపోగా, మరికొన్ని కేంద్రాల్లో కూర్చోవడానికి అనుకూలంగా లేని లాంగ్, బెంచీలు, కుర్చీలపైనే నడుముల నొప్పి వస్తున్నా విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.



    రవాణా సౌకర్యాలు లేనప్పుడు సమయానికెలా రావాలి?

    జిల్లాలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేవు. చాలా మంది విద్యార్థులు ఆటోలు.. అవి లేకుంటే నడుచుకుంటూ పాఠశాలకు వస్తుంటారు. పల్లెటూళ్ల నుంచి వచ్చే ఆటోల డ్రైవర్లు సామర్థ్యాని కనుగుణంగా ప్రయాణికులు నిండితేగాని ఆటోను నడపరు. కొంత మంది విద్యార్థులు పొలాల గట్లపై.. వాగులు వంకలు దాటుతూ బడికి రావాల్సి ఉంటుంది. ఎండాకాలం కావడంతో భానుడి భగభగలు అప్పుడే ప్రారంభమయ్యాయి. జంబ్లింగ్‌ విధానం ప్రవేశపెట్టాక పరీక్ష కేంద్రాలను చదివే బడిలో కాకుండా పొరుగు బడుల్లో నిర్వహిస్తున్నారు. అక్కడకు బస్సు సౌకర్యాలు కూడా లేవు. ఇవన్నీ సమస్యలు పట్టించుకోకుండా 5 నిమిషాల నిబంధన విధించడం సరికాదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు.



    కాపీయింగ్‌కు నిమిషం నిబంధనలకు సంబంధమేమిటి?

    మాస్‌ కాపీయింగ్‌కు, నిమిషం నిబంధనకు సంబంధం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. మాస్‌ కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు నిమిషం నిబంధన విధించినట్లు ఇంటర్‌ బోర్టు ప్రకటించడం హాస్యాస్పదం, అమానవీయం అంటున్నారు. కాపీయింగ్‌కి నిమిషం నిమింధనకు పొంతనలేనిదని పేర్కొంటున్నారు. రెండు నిమిషాలు ఆలస్యమైతే రెండు మార్కులు పోతాయనే నెపంతో పూర్తి పరీక్ష రాయకుండా చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.



    ఇంటి వద్ద మగవాళ్లే లేరు.. ఎలా రావాలి

    మాది పాపన్నపేటకు 5 కి.మీ. దూరంలోని రామతీర్థం. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలో.. ఒక్కోసారి నడిచి వస్తుంటాను. ఇప్పుడు పరీక్ష కోసం పాపన్నపేట వరకు నడిచి వచ్చి అక్కడి నుంచి 5 కి.మీ. దూరం బస్సులో ప్రయాణించి, మరో 2 కి.మీ. నడిస్తే గాని కుర్తివాడలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని చేరుకోలేం. మా నాన్న జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇద్దరు అక్కలు.. కనీసం బైక్‌పై వెళదామంటే మగవారే లేరు.                         

    – ఎస్‌. వనజ, రామతీర్థం




    పొలం గట్లపై 5 కి.మీ. నడవాలి

    మాది పాపన్నపేటకు 5 కి.మీ దూరంలోని ముద్దాపూర్‌. మా గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. రోజు 5 కి.మీ. ఓ వాగు దాటి పొలం గట్లపై నుంచి పాపన్నపేటకు వచ్చి చదువుకుంటాం. ఇప్పుడు కాలినడకన పాపన్నపేటకు వచ్చి, అక్కడి నుంచి 5 కి.మీ బస్సులో ప్రయాణించి, మరో 2 కి.మీ నడిచి 9.30కల్లా కుర్తివాడ పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యం కాకుండా వెళ్లాలంటే సాధ్యమేనా? ఎంత ప్రయత్నించినా ఒక్క రోజైనా ఆలస్యం కాదా? 5 నిమిషాల కోసం మా జీవితాన్నే నాశనం చేస్తారా.

    – పి.శ్వేత. ముద్దాపూర్‌



    సుప్రియది మరో వ్యథ

    ‘పాపన్నపేట మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఘనపురం సుప్రియది మరో వ్యథ. ఈ అమ్మాయిని అన్నారం గ్రామానికి చెందిన వాళ్ల చిన్నాన్న దత్తత తెచ్చుకున్నాడు. ప్రతి రోజు 5 కి.మీ దూరం ప్రయాణించి పాఠశాలకు వచ్చేది. కానీ ఇటీవల దత్తత తెచ్చుకున్న వాళ్ల చిన్నాన్న చనిపోవడంతో ఇంట్లో గొడవలు ఆరంభమై సుప్రియ కామారెడ్డి జిల్లాలోని తన స్వగ్రామమైన కన్నారెడ్డి నుంచి పాఠశాలకు వస్తోంది.అయితే ఆమె పదో తరగతి పరీక్షలు రాయాలంటే కన్నారెడ్డి నుంచి 3 కి.మీ. దూరం కాలినడకన వచచి 50 కి.మీ దూరం బస్సులో ప్రయాణిస్తే గాని పరీక్ష రాయాల్సిన యూసుఫ్‌పేటకు చేరుకోలేని పరిస్థితి’. ఈ అమ్మాయి భవిష్యత్తుకు అగ్ని పరీక్ష పెట్టింది ఎస్సెస్సీ బోర్డు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top