ఇద్దరు అంతర్‌జిల్లా నేరస్తుల అరెస్ట్

ఇద్దరు అంతర్‌జిల్లా నేరస్తుల అరెస్ట్


భీమవరం టౌన్ : భీమవరం వన్‌టౌన్‌లో వరుస దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అంతర్ జిల్లా నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో వన్‌టౌన్ పోలీసు సిబ్బందితో కలిసి నర్సాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు  విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..  

 

  విశాఖపట్నం గాజువాక సింహపురి కాలనీకి చెందిన వారే బూలా నాగసాయి, కొత్తగాజువాక కణతిరోడ్డుకు చెందిన మహమద్ సోను అలియస్ రఫి పాతనేరస్తులు. వీరిద్దరికీ జైలులో పరిచయమైంది. నాగసాయి 16 ఏళ్ల వయస్సు నుంచి నేరాలు చేస్తున్నాడు. గతంలో అరెస్టయిన అతను ఈ ఏడాది మార్చి 22న విశాఖ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు.  మహమద్ సోను 2014 నుంచి నేరాల బాటపట్టాడు. వృత్తిరీత్యా పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. మహమద్ సోను 20 నేరాల్లో జైలు శిక్ష అనుభవించి ఈ ఏడాది మేనెల మొదటి వారంలో బెయిల్‌పై విడుదలయ్యాడు.

 

 ఆ తర్వాత నాగసాయి, మహమద్‌సోను కలిసి విశాఖ, యలమంచిలి, కాకినాడ, రాజమండ్రి, భీమవరం, తణుకు, అత్తిలి పాలకోడేరు ప్రాంతాల్లో 23 నేరాలు చేశారు. ఈ ఇద్దరినీ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద సోమవారం వన్‌టౌన్ సీఐ డి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ కె.సుధాకరరెడ్డి అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.7 లక్షల విలువైన పన్నెండున్నర కేజీల వెండి, ఆరున్నరకాసుల బంగారు వస్తువులు, రెండు ఎల్‌ఈడీటీవీలు, ఒక డీవీడీ ప్లేయర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top