అంతర్‌ కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభం

రసవత్తరంగా సాగుతున్న వాలీబాల్, కబడ్డీ, టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు

పలమనేరు: పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎస్వీ యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కబడ్డీ, వాలీబాల్, చెస్, టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు సంబంధించి 37 కళాశాలలకు చెందిన జట్లు హాజరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల పరిచయ కార్యక్రమం తర్వాత ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు మానసిక వికాసం కలిగిస్తాయన్నారు. ఆటలు చదువులో ఓ భాగమేనని తెలిపారు. ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మాట్లాడుతూ క్రీడల పట్ల ప్రభుత్వం చొరవచూపితే మరింతమంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. స్థానికంగా నిర్మించిన మినీ స్టేడియంను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ డైరెక్టర్లు మాట్లాడారు.

తొలిరోజు రసవత్తర పోటీ

తొలిరోజు 26 జట్లు వాలీబాల్, 24 జట్లు కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాయి. టేబుల్‌ టెన్నిస్‌లో ఎస్వీ ఆర్ట్స్, ఎస్‌జీఆర్ట్స్, ఎస్‌వీయూ, సీకాం, రామరాజ్‌ కళాశాలల జట్లు తలపడ్డాయి. ఇక చెస్‌ పోటీల్లో 50 మంది క్రీడాకారులు పాల్గొనగా విశాఖపట్నానికి చెందిన బంగారురాజు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top