మేధాశక్తి ఎవరబ్బ సొమ్ము కాదు

మేధాశక్తి ఎవరబ్బ సొమ్ము కాదు

 – పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ కమిషనర్‌ రామాంజనేయులు 

కర్నూలు(అర్బన్‌): మేధాశక్తి ఎవరబ్బ సొమ్ము కాదని అగ్రవర్ణాలకు దీటుగా దళితులు సంఘటితంగా అన్ని రంగాల్లో ఎదగాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ బి.రామాంజనేయులు  పిలుపునిచ్చారు. శనివారం రాత్రి స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ భవనంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన 2017 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర​‍్వహించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ వై.ప్రవీణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 

          ఈ సందర్భంగా కమిషనర్‌ రామాంజనేయులు మాట్లాడుతూ దళితులు ఆస్తులు లేనివారే కానీ ఆత్మగౌరవం లేనివారు కాదని చెప్పారు. దళితులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ చూపిన మార్గంలో నడుస్తూ  హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని చెప్పారు.  గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, నిరక్షరాస్యతతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని దళిత వర్గాలను అభివృద్ధి దిశగా పయనిస్తున్న దళిత అధికారులు చేయూతనందించాలని కోరారు. రాజ్యాధికారం ద్వారానే దళితుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

       

          అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో కూడా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నచిన్న ఉద్యోగాలు, పదవుల కోసం ప్రలోభాలకు లోను కాకుండా ఉండాలన్నారు.  దళితుడిగా పుట్టినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ 30 మందితో ఏర్పాటైన అసోసియేషన్‌ నేడు అందరి సహకారం వల్ల 300 మందితో కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడిషనల్‌ ఎస్పీ శివకోటి బాబురావు, సీపీఓ ఆనంద్‌నాయక్, మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరస్వామి, డీఎస్పీలు వినోద్‌కుమార్, మురళీధర్, వెంకటరత్నం, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఈఈ పాండురంగయ్య, పంచాయతీరాజ్‌ ఈఈ సురేంద్రనాథ్, ఇరిగేషన్‌ ఏఈ ప్రసాదరావు, ఆర్‌యూ ప్రొఫెసర్‌ ఎన్‌.టి.కె.నాయక్, డైరీ కమిటీ చైర్మన్‌ శివకుమార్, అసోసియేషన్‌ ప్రతినిధులు రాజశేఖర్, సునీల్‌కుమార్, అర్జున్‌నాయక్, తహసీల్దార్‌ శివరాముడు తదితరులు పాల్గొన్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top