కుట్టుకోవాల్సిందే..!


పాఠశాలలకు చేరిన గుడ్డ

దుస్తులకు బదులు వస్త్రాల పంపిణీ

ఏడునెలల తర్వాత సరఫరా

జతకు కుట్టుకూలీగా రూ.40 నిర్ణయించిన ప్రభుత్వం

ముందుకురాని దర్జీలు




కథలాపూర్‌ (వేములవాడ) : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు,  నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. పాఠశాలలు తెరిచేలోగా విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు రెడీ  అంటూ ప్రగల్భాలు పలికారు. తీరా బడులు ప్రారంభమై ఏడు నెలలు గడిచాక కుట్టు వస్త్రాలు కాకుండా కేవలం గుడ్డ సరఫరా చేయడంతో విద్యార్థులు, పాఠశాలల బాధ్యులు అయోమయానికి గురవుతున్నారు. ఒక్కో డ్రెస్సుకు రూ.40 కుట్టుకూలీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులపైన ఆర్థికభారం పడుతుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు పునరాలోచించి కుట్టుకూలీ పెంచాలని, విద్యార్థులకు త్వరగా డ్రెస్సులు అందించాలని పలువురు కోరుతున్నారు.



ఆప్కో నుంచి చేనేతకు మార్పు..

జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 506, ప్రాథమికోన్నత 87, హైస్కూళ్లు 187 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 73 వేల మంది చదువుకుంటున్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం డ్రెస్సులు అందిస్తోంది. వీరు సుమారు 55 వేల మంది వరకు ఉంటారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల డ్రెస్సులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. వీరికి గత విద్యాసంవత్సరం వరకు డ్రెస్సులు పంపిణీ చేయగా.. అవి సరిపోకపోవడం, చిరగడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈసారి బట్టను సరఫరా చేసినట్లు సమాచారం. గతంలో బట్టలు ఆప్కో ద్వారా పాఠశాలకు సరఫరా చేసేవారు. ఈసారి చేనేత సహకార సంఘం ద్వారా సరఫరా చేసింది. విద్యార్థులకు బట్టలు పంపిణీ చేసి ఒక్కో డ్రెస్సుకు కుట్టుకూలీగా రూ.40 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. ఇది గిట్టుబాటు కాదని దర్జీలు అంటున్నారు. ప్రభుత్వ ధరకు అదనంగా విద్యార్థులు కొంత మొత్తం చెల్లిస్తేనే డ్రెస్సులు కుట్టేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు.



కుట్టుకూలీ ఏ నిధుల నుంచో..?

విద్యార్థుల డ్రెస్సుకు రూ.40 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించనప్పటికీ నిధులు ఎక్కడినుంచి చెల్లిస్తారనేది ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. పాఠశాలల ఎస్‌ఎస్‌ఎ నిధుల్లోంచి గతంలో చెల్లించేవారు. ఈ ఏడాది పాఠశాల ఖాతాలో ఉన్న ఆ నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిధులను ఇతర శాఖలకు మళ్లించారనే ఆరోపణలున్నాయి. విద్యార్థుల డ్రెస్సుల కుట్టుకూలీకి నిధులు వస్తాయో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు చొరవ చూపి త్వరగా డ్రెస్సులు అందేలా చూడాలని విద్యార్థిసంఘాల నేతలు కోరుతున్నారు.



జాప్యం దారుణం

డ్రెస్సులు అందించే విషయంలో ప్రభుత్వ నిబంధనలు చూస్తే విద్యాసంవత్సరం ముగిసేవరకు అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి కుట్టుకూలీని పెంచి ప్రభుత్వం  మంజూరు చేయాలి. ఎనిమిదేళ్ల నాటి నిబంధనలు అమలు చేసి నెలల తరబడి జాప్యం చేయడం దారుణం. – ఆరెల్లి సాగర్, ఏబీవీపీ మండల కోకన్వీనర్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top