'ఇంజెక్షన్లతో మోకాళ్ల నొప్పులు తగ్గవు'

'ఇంజెక్షన్లతో మోకాళ్ల నొప్పులు తగ్గవు'


ఖమ్మం: 'మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?  అయితే మేమిచ్చే ఇంజక్షన్లను వాడండి. కొద్ది గంటల్లోనే నొప్పులు మాయమవుతాయి' బాపతు ప్రకటనలను ప్రజలు నమ్మవద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) విజ్ఞప్తి చేసింది. మోకాళ్ల నొప్పులకు చికిత్స పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ.. అనుమతిలేని ఉత్ప్రేరకాలను పేషెంట్లకు ఇంజెక్ట్ చేస్తున్నవైనాన్ని ఐఎంఏ ఖమ్మం జిల్లా శాఖ వెలుగులోకి తెచ్చింది.



ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పెద్దకూరపల్లిలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోన్న ఆసుపత్రిలో ఈ నకిలీ ఇంజెక్షన్ల వ్యవహారం కొనసాగుతోంది. అత్యవసర సమయాల్లో.. అదికూడా ఆర్థోపెడిక్ పర్యవేక్షణలో ఇచ్చే 'హైడ్రో కార్టిజం' ఇంజెక్షన్ ను యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. సదరు సంస్థ ప్రచారాన్ని నమ్మి ఆదిలాబాద్, కరీంగనగర్, వరంగల్, నల్లగొండ, పశ్చిమగోదావరి తదితర జిల్లాలకు చెందిన వందలాదిమంది పేషెంట్లు ఇప్పటికే ఈ ఇంజెక్షన్లను తీసుకున్నట్లు తెలిసింది.


 


బుధవారం సదరు ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఐఎంఏ ప్రతినిధులు.. పేషెంట్లకు వాస్తవాలను వివరించేప్రయత్నం చేశారు. ఉత్ప్రేరకాల ఇంజెక్షన్‌తో తాత్కాలికంగా మోకాళ్లనొప్పులు తగ్గినట్లు అనిపించినా దీర్ఘకాలికంగా దుష్ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షుడు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top