ఆకట్టుకున్న.. ఆ కట్టు బొట్టు

ఆకట్టుకున్న.. ఆ కట్టు బొట్టు - Sakshi


► భారతీయ సంస్కృతికి జపాన్‌ మహిళల ఫిదా

► నగరంలో జపాన్‌ ఇండియా కల్చరల్‌ ఎక్స్ఛేంజ్‌




విశాఖపట్నం : సుదీర్ఘ చరిత్ర, విలక్షణ భౌగోళిక స్వరూపం, విభిన్న జాతులు, సంప్రదాయాలు.. భారతీయ సంస్కృతికి ఇవన్నీ ఒకెల్తైతే.. చీరకట్టులో ఒదిగిపోయే మహిళలు మరో ఎత్తు. అందుకే.. భారతీయ వనితని చూస్తే.. ఎవరికైనా గౌరవించాలనిపిస్తుంది. ఇదే గౌరవం జపాన్‌ మహిళలు ఇస్తున్నారు. ఒద్దికగా ఉంటూ భిన్నత్వంగా కనిపించే ఇక్కడి మహిళల కట్టుబొట్టు నచ్చిన జపనీయులు.. కల్చరల్‌ ఎక్స్ఛేంజ్‌ చేసుకున్నారు. అచ్చతెలుగు మహిళల్లా చీరకట్టులో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.



ఇండస్‌ రే జపాన్, కార్యేషు ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం జరిగిన ఇండో జపాన్‌ కల్చరల్‌ ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. టీడీపీ ఎస్‌సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పుచ్చా విజయ్‌కుమార్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై మక్కువ పెంచుకున్న జపనీయులు.. ఆకట్టుకునే ఆ కట్టు బొట్టు ఆహార్యంపై ఇష్టం కలిగి.. కల్చరల్‌ ఎక్స్ఛేంజ్‌ చేసుకునేందుకు ముందుకు వచ్చారు.



ఈ అరుదైన కార్యక్రమానికి హోటల్‌ మేఘాలయ వేదికగా మారింది. జపాన్‌ మహిళలు చీరకట్టులో, పురుషులు పంచెకట్టులో కనిపిస్తూ.. ప్రత్యేక ఆకర్షణగా మారారు. మట్టిగాజులు వేసుకుంటూ మురిసిపోయారు. జపాన్‌ చెందిన మహిళలు.. అక్కడి ఆహార వ్యవహారాల్ని చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన కుమికో మత్సుమాటో,షిబహారా, అట్సుకో టొమికా, టియాకో యుడా, ఇండస్‌ రే జపాన్‌ ఎన్‌పీఓ సరిత, శ్రీభవ్య, కార్యేషు ఈవెంట్స్‌ ఎండీ జయశ్రీ, ఇందిరా, హేతల్, లక్ష్మి, మను తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం.. జపాన్‌ మహిళలకు ప్రత్యేక జ్ఞాపికలు అందించారు.



చీరకట్టుకోవాలని ఆశ

ఇంటర్నెట్‌లో భారతీయ మహిళల ఆహార్యం గురించి చాలా చూశాను. అప్పటి నుంచి వారిలాగే చీర కట్టుకోవాలని కుతూహలంగా ఉండేది. ఈ రోజుకి ఆ ఆశ తీరింది. భారతీయ సంప్రదాయానికి ఫిదా అయిపోయాం.

– ఫుకుజాకీ ఏకో, తత్సునో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లేడీస్‌ అసోసియేషన్‌ మెంబర్‌



తెలుగుదనం ఉట్టిపడుతుంది

భారతీయ మహిళలు, పురుషులంటే మా దేశ ప్రజలకు ఎంతో గౌరవం. వారి వస్త్రధారణ, ఆచార సంప్రదాయాలంటే అందరికీ ఇష్టం. తెలుగు ప్రజల వస్త్రధారణైన పంచెకట్టులో.. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. చాలా కంఫర్ట్‌గా ఉంది.

– యాసుయ్‌ యసుహిరో, ఇండస్‌ రే జపాన్‌ సమన్వయకర్త



భారతీయతను చాటుదాం రండి

భారతీయ సంస్కృతిని చాటి చెప్పేందుకు ఇండస్‌ రే జపాన్‌తో కలిసి పనిచేస్తున్నాను. భారతీయతపై అందరికీ గౌరవం పెరిగేలా కృషి చేస్తున్నాం. త్వరలో ఇదే తరహా కార్యక్రమం జపాన్‌లోనూ, మలేషియా, సింగపూర్‌లో నిర్వహించాలని భావిస్తున్నాం. మాతో భాగస్వాములు కావాలనుకుంటే మా ఆహ్వానం ఎప్పుడూ ఉంటుంది.

– సరిత, ఇండస్‌ రే జపాన్‌ ఇండియా ప్రెసిడెంట్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top