సన్నబియ్యంకుతకుత !

సన్నబియ్యంకుతకుత !


► పెరుగుతున్న సన్నబియ్యం ధరలు

► పది రోజుల్లోనే క్వింటాలుపై రూ.800 పెరుగుదల

► మార్కెట్‌లో క్వింటాలు రూ.4800 నుంచి రూ.5600

► మిల్లర్ల వద్ద అక్రమ నిల్వలు

► పట్టించుకోని విజిలెన్స్‌శాఖ




కడప అగ్రికల్చర్‌ : ఒక వైపు వర్షాభావంతో కేసీ కెనాల్‌కు సాగు నీరు విడుదల కాక వరిసాగుకు నోచుకోలేదు. మరోవైపు నిరుడి ధాన్యపు నిల్వలను బియ్యంగా మలచి కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇక ధాన్యం పండే సూచనలు కనిపించలేదని ప్రచారం చేస్తూ వ్యాపారులు బియ్యం ధరలు అమాం తంగా  పెంచేశారు. సన్నబియ్యానికి కొరత బూచి చూపి ఇష్టారాజ్యంగా ధరను పెంచి సామాన్యులతోపాటు మధ్య తరగతి వారికి దడ పుట్టిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువుల్లోను, ప్రాజెక్టుల్లోను నీరు లేక బోసి ఉన్నాయి. దీంతో బోరుబావుల్లో నీరు అడుగంటింది. ఏటా బోరుబావుల కింద ఎంతోకొంత వరిసాగు చేసే రైతులు ఈ ఏడాది వరిసాగు చేయలేకపోయారు. అలాగే కేసీ కెనాల్‌కు అధికారికంగా నీరు విడుదల కాకపోవడంతో పెద్దగా పంటసాగుకు నోచుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు, మిల్లర్లు ధరలను అమాంతం పెంచేశారని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



సన్నబియ్యం ధరలు (జిలకర్ర, సోనామసూర) ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకు వాటి ధరలను వ్యాపారులు, మిల్లర్లు పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది నుంచి బియ్యం ధరలు నెలకునెలకూ పెరగడమే గాని తగ్గడం లేదు. వారం క్రితం క్వింటాలు రూ. 4800 ఉండగా సన్నబియ్యం ధర ఇప్పుడు మార్కెట్‌లో రూ. 5600 ధర పలుకుతున్నాయి. ఇవి కూడా కొత్త బియ్యం 25 కి లోల బస్తా వారం క్రితం రూ.850లు ఉం డగా అదే బియ్యం ఇప్పుడు రూ.1000 పలుకుతున్నాయి. అలాగే  పాత బియ్యం ధర 25కిలోల బస్తా రూ.1200 ఉండగా నేడు అదే బస్తా రూ.1400లు పలుకుతున్నాయి. పాత బి య్యమైతే ఒకరేటు, కొత్త బియ్యమైతే మరో రేటు పలుకుతుండడం విశేషం. మిల్లర్లు గోడౌన్లలో అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. విజిలెన్స్‌ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, వారు గోడౌన్లపై దాడులు చేస్తే మిల్లర్ల, వ్యాపారుల బాగోతం బయటపడుతుందని వినియోగదారులు అంటున్నారు.



తగ్గిన పంట సాగు.. : జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో 91,970 ఎకరాలలో వరిసాగయ్యేది. ఈ ఏడాది వర్షాభావం వల్ల ఖరీఫ్‌ సీజన్‌ అంతా కలిపి బోరుబావుల కింద కేవలం 52,537 ఎకరాలలోనే సాగు చేశారు. ఈ సాగు కూడా సన్నబియ్యం ధరల పెరుగుదలపై ప్రభా వం చూపుతోంది. ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో 1,36,155 ఎకరాల మొత్తంలో వరి పంటసాగైతే 32.67 లక్షల క్వింటాళ్ల ధా న్యం దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది 52,537 ఎకరాలకుగాను 12.60 లక్షల క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది.



సన్నబియ్యం కిలో రూ. 30లకే ఒట్టిమాట.. : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం పర్యటనలో ఓ కూలీ బియ్యం ధరలపై ప్రస్తావించినప్పుడు బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో కిలో 30 రూపాయలకే సన్న రకాల బియ్యం అందిస్తామని ముఖ్యమంత్రి మాట చెప్పారు. జిల్లాలోని అన్ని రైతు బజార్లలో తప్పని సరిగా విక్రయించేలా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి నెల రోజులు దాటినా ఇంత వరకు అతీగతీ లేదని నిరుపేదలు, సామాన్యులు విమర్శిస్తున్నారు.



బయో మెట్రిక్‌ పద్ధతి వచ్చినా రేషన్‌ బియ్యం పక్కదారి..: జిల్లాలోని రేషన్‌ షాపుల్లో బియ్యానికి బయోమెట్రిక్‌ పద్ధతిని ప్రభుత్వం అమలు చేస్తున్నా కొందరు డీలర్లు పాత కార్డులను తమ వద్ద ఉంచుకుని కార్డు రేషన్‌తో అవసరంలేని ఆయా కార్డుదారులను రప్పించుకుని వేలి గుర్తులను బయోమెట్రిక్‌లో వేయించి వారికి అంతోఇంతో ఇచ్చి వారి కోటా బియ్యాన్ని తీసుకుని ఆ బియ్యాన్ని వ్యాపారులకు, మిల్లర్లకు అందజేస్తున్నట్లు సమాచారం. అలాగే మరి కొందరు కార్డులు రద్దు కాకుండా ఆయా కార్డుల బియ్యం, ఇతర సరుకులు డీలరే అమ్ముకునేలా వేలి గుర్తులు వేసి పోతున్నారని తెలిసింది. ఈ బియ్యాన్ని రైస్‌మిల్లుల్లో పాలిష్‌ చేసి సన్నబియ్యంలో కల్తీ చేసి బయటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండడం వల్లే  అధిక ధరల పెరుగుదలకు కారణంగా అవుతోందని వినియోగదారులు వాపోతున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top