విమానమెక్కిన కరివేపాకు

విమానమెక్కిన కరివేపాకు - Sakshi


విదేశాల్లో మంచి గిరాకీ

జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం

ముంబయ్‌, పూణేలకు గుంతకల్లు నుంచి రైళ్లలో తరలింపు

అక్కడి నుంచి విమానాల ద్వారా విదేశాలకు

జిల్లా నుంచి రోజుకు 8 నుంచి 10 టన్నుల వరకు రవాణా




గుంతకల్లు: పప్పు, రసం, సాంబారు, తాలింపు, ఉప్మా, పులిహోరా... ఏదైనా సరే కరివేపాకు వేసి వండాల్సిందే. దక్షిణ భారతదేశ వంటకాలతో అంతగా పెనవెసుకుపోయిన కరివేపాకును ఇప్పుడు గల్ఫ్, యూరప్‌ దేశాల వారు మన నుంచి దిగుమతి చేసుకుని మరీ తమ రోజువారీ వంటల్లో వాడుతున్నారు. కరివేపాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆసియా ఖండంలోనే మొదటిస్థానంలో ఉంది. ముఖ్యంగా అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా పండిస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌ జిల్లాల్లోనూ ఈ పంట ఎక్కువగా ఉంది. ఈ మూడు జిల్లాల్లో పండే మొత్తం పంటలో 40 శాతం మన జిల్లాలోనే పండుతోంది. గల్ఫ్‌ దేశాలకు మానవ వనరులు అధికంగా అందిస్తున్న అనంతపురం జిల్లా అపార ఔషధ విలువలున్న కరివేపాకును వారికి అందించడంలోనూ ప్రథమ స్థానంలో నిలుస్తోంది.





రోజూ 8 నుంచి 10 టన్నులు

దేశ, విదేశాల్లోని పట్టణాలు, నగరాల్లో సూపర్, హైటెక్‌ మార్కెట్ల సంఖ్య పెరుగుతూ వస్తుండటం వల్ల కరివేపాకు వినియోగం పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో దేశ, విదేశాలకు అనంతపురం జిల్లా నుంచి రోజూ దాదాపు ఎనిమిది నుంచి 10 టన్నుల కరివేపాకు రవాణా అవుతోంది. జిల్లాలో మొత్తం 3 వేల ఎకరాల్లో కరివేపాకు సాగవుతుండగా అందులో ఎక్కువ భాగం గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాల్లోనే ఉంది. ఇన్నాళ్లు స్థానిక మార్కెట్లకే పరిమితమైన కరివేపాకు నేడు దేశీయ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, ముంబై తదితర నగరాలతోపాటు గల్ఫ్‌ దేశాలైన సౌదీ అరేబియా, షార్జా, దుబాయ్, కతార్, ఒమన్‌ వంటి దేశాలతోపాటు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌ తదితర యూరప్‌ దేశాలకు ఎగుమతి అవుతోంది. హైదరాబాద్, ముంబై, పూనే వ్యాపారులు మన జిల్లాలో టన్నుల లెక్కన కొనుగోలు చేసి రైళ్ల ద్వారా తమ నగరాలకు చేరవేసుకుంటున్నారు. అక్కడి నుంచి కిలోల లెక్కన అట్టపెట్టెల్లో పెట్టి విమానాల్లో విదేశాల్లోని నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. సాధారణంగా కరివేపాకు కోసిన తర్వాత మూడు రోజులు వాడిపోదు. ఆలోగా విదేశాలకు తరలించి అక్కడ శీతల గిడ్డంగుల్లో ఉంచి విక్రయిస్తున్నారు.





ఎకరాకు రూ.80 వేల దాకా ఆదాయం

కరివేపాకు లాభదాయకమైన వాణిజ్య పంట కావడంతో ఇటీవల ఎక్కువమంది రైతులు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. కరివేపాకు పంటను ఏటా మూడు కోతలు కోసుకోవచ్చు. ఒకసారి విత్తు వేస్తే 30 ఏళ్ల వరకు పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. ప్రకృతి తెచ్చే విపత్తుల వల్ల ఈ పంటకు పెద్దగా నష్టం కూడా ఉండదు. పెట్టుబడి, కూలీలు, ఇతర ఖర్చులు పోను ఎకరాకు నికరంగా రూ.60 నుంచి 80వేలు దాకా లాభం వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.



ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం

వంటల్లో రుచి, వాసన రావడంతోపాటు ఔషధ గుణాలు కూడా ఉండటం వల్ల భారతీయులు కరివేపాకును వంటల్లో విస్తృతంగా వాడుతున్నారు. ఆయుర్వేదంలో అయితే దీనికి ఒక ప్రత్యేకస్థానం ఉంది. ఏదోక రూపంలో కరివేపాకును రోజూ తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఆకును ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకుని ఎక్కువ కాలం వాడుకున్నా సహజ విలువలు కోల్పోదని చెబుతున్నారు.



మంచి మార్కెట్‌ ఉంటుంది

కరివేపాకు పంటకు స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ మంచి మార్కెట్‌ ఉంది. గుంతకల్లు నుంచి సుదూర ప్రాంతాలకు రోజూ రైలు సౌకర్యం ఉండటం వల్ల ఇతర రాష్ట్రాలకు పంపుతున్నాం. రైతులకు మంచి ఆదాయం రావడంతోపాటు మాకూ గిట్టుబాటు అవుతోంది. చాలామంది కూలీలు ఉపాధి పొందుతున్నారు.

- బాషా, వ్యాపారి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top