‘అనుమతుల్లో’ అక్రమాలు!

‘అనుమతుల్లో’ అక్రమాలు!


⇒ ప్రీ ప్రైమరీ స్కూళ్ల రికగ్నైజేషన్‌లో ఇష్టారాజ్యం

⇒ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి

⇒ సర్కారు ఆదేశాలు బేఖాతరు

⇒ సౌకర్యాలు, కనీస వసతులు లేకున్నా..

⇒ ఎంఈవోల పరిశీలన లేకుండానే పర్మిషన్‌

⇒ ఒక్కో పాఠశాల నుంచి రూ.20 వేలు వసూలు!




నిజామాబాద్‌:

ప్రీ ప్రైమరీ పాఠశాలల అనుమతుల మంజూరులో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఆయా పాఠశాలలకు ప్రభుత్వం నిర్దేశించిన సౌకర్యాలు లేకపోయినప్పటికీ జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు ముడుపులు పుచ్చుకొని కొన్ని పాఠశాలలకు అనుమతులు కట్టబెట్టారు. ఒక్కో పాఠశాలకు రూ.20 వేల వరకు వసూలు చేసి, వందల్లో పాఠశాలలకు అనుమతులు కట్టబెట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.


చిన్నారుల భద్రతను దృష్టి ఉంచుకుని ప్రభుత్వం ప్రీ ప్రైమరీ పాఠశాలలకు కూడా అనుమతులు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏడాదిన్నర క్రితం హైదరాబాద్‌లో అనుమతి లేని ఓ ప్రీ ప్రైమరీ పాఠశాలలో లిఫ్టులో ఇరుక్కుని ఓ చిన్నారి మృత్యువాత పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రైమరీ, హైస్కూల్స్‌ మాదిరిగానే ప్రీ ప్రైమరీ పాఠశాలలకు అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. అనుమతులు లేకుండా ఈ పాఠశాలలు నిర్వహిస్తే వాటిని సీజ్‌ చేయడమే కాకుండా, నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.


జీవో నెం.1 ప్రకారం సౌకర్యాలు..

ప్రీ ప్రైమరీ పాఠశాలల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సర్కారు ఆదేశించింది. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 10 వరకు గడువు పొడగిస్తూ వచ్చింది. గతంలో జారీ చేసిన జీవో నెం.1 ప్రకారం నిర్దేశించిన సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్న వాటికే అనుమతులు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


ఆయా పాఠశాలలు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉండాలని, నిర్ణీత వైశాల్యంలో తరగతి గదులు, ఉపాధ్యాయులు, ఆయాలు, బస్సు, రోడ్డు దాటించడానికి ప్రత్యేక సిబ్బంది, చిన్నారులకు హాని చేయని విధంగా ఉన్న ఆట వస్తువులు, టాయిలెట్లు, తాగునీరు, ఆటస్థలం వంటి నిర్దేశిత సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్న వాటికే అనుమతులు ఇవ్వాలని జీవోలో పేర్కొంది.


అస్తవ్యస్తంగా అనుమతుల ప్రక్రియ

అనుమతుల మంజూరు ప్రక్రియ జిల్లాలో అస్తవ్యస్తంగా జరిగింది. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 116 పాఠశాలకు అనుమతులిస్తే.. ఇందులో చాలా పాఠశాలలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చేశారనే విమర్శలున్నాయి. నిర్దేశిత సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్న పాఠశాలల నిర్వాహకులు రూ.10 వేలు చలానా చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ కార్యాలయం సంబంధిత మండల ఎంఈవోలకు పంపుతారు.


ఎంఈవోలు ఆయా దరఖాస్తులను పరిశీలించి, ఆయా పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపాలి. నిర్దేశించిన మేరకు సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్నాయని నిర్ధారించుకున్నాక, అనుమతుల మంజూరు కోసం డీఈవో కార్యాలయానికి సిఫార్సులు చేయాలి. కానీ జిల్లాలో ఈ ప్రక్రియ అంతా అస్తవ్యస్తంగా సాగింది. చాలా పాఠశాలలకు సంబంధిత ఎంఈవోల క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలు లేకుండానే అనుమతులు కట్టబెట్టారు.


మరికొన్నింటికి వచ్చిన దరఖాస్తులను కనీసం ఎంఈవోలకు కూడా పంపకుండానే డీఈవో కార్యాలయం నుంచే నేరుగా అనుమతులు ఇచ్చేయడం విశేషం. ఇలా అక్రమంగా అనుమతులిచ్చిన ఒక్కో పాఠశాలకు రూ.20 వేల వరకు ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో రూ.లక్షలు చేతులు మారినట్లు తెలిసింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top