రౌడీ రాజ్యం

రౌడీ రాజ్యం - Sakshi


►  రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకం

వైఎస్సార్‌సీపీలో చేరికలను జీర్ణించుకోలేక భౌతికదాడులు

కనగానపల్లి మండలం కుర్లపల్లి వైఎస్సార్‌సీపీ

నేతలపై దాడి  సర్వజనాస్పత్రిలో బీభత్సం

తన హత్యకు కుట్ర పన్నారన్న ప్రకాష్‌రెడ్డి

జిల్లాలో అదుపుతప్పిన శాంతిభద్రతలు


 

సాక్షిప్రతినిధి, అనంతపురం
: మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో రౌడీరాజ్యం నడుస్తోంది. తమ మాటే వేదమన్న రీతిలో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇటీవల రాప్తాడు నియోజకవర్గ టీడీపీ నేతలు వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీలోకి వలసబాట పట్టారు. పదేళ్లు జెండా మోసినా ప్రతిఫలం దక్కకపోవడం, టీడీపీ మోసపూరిత పాలనతో నష్టపోవడం, పార్టీలోని ముఖ్యనేతలు మరింత చులకనగా చూడటం లాంటి పరిణామాలతో ఆ పార్టీలోని ప్రముఖులు ఒకరి తర్వాత మరొకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఈ చేరికలను జీర్ణించుకోలేని మంత్రి మద్దతుదారులు  వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.



జిల్లాలోనే రాప్తాడు నియోజకవర్గంలో ప్రత్యేక రాజకీయపరిస్థితులు ఉన్నాయి. పరిటాల వర్గీయులను కాదని, వారికి వ్యతిరేకంగా రాజకీయ కార్య కలాపాలు నిర్వహించే వారికి ఇబ్బందులు తప్పవు. వీరిని తమ దారిలోకి లాక్కొనేందుకు  సామ, దాన, భేద దండోపాయాలు ఉపయోగిస్తుంటారు. అప్పటికీ దారికి రాకపోతే తమదైన శైలిలో రాజకీయ క్రీడకు తెరలేపుతారు. మంత్రి పరిటాల సునీత సొంత మండలం రామగిరి 2004 ఎన్నికల వరకు పెనుకొండ నియోజకవర్గంలో ఉండేది. ఆపై పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన రాప్తాడు నియోజకవర్గంలో భాగమైంది.





అడుగడుగునా కుట్రలే...

2009 ఎన్నికల్లో రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారసమయంలో ఆయనపై అక్రమకేసులు మోపి జైలుకు పంపి ఇబ్బంది పెట్టారు. ఆ ఎన్నికల్లో సునీత కేవలం 1,800 ఓట్ల తేడాతో గట్టెక్కారు. 2014 ఎన్నికల్లోనూ సునీత ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఇద్దరు ఎంపీలు, 12మంది ఎమ్మెల్యేలనూ గెలిపించినా జిల్లా అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారు. జిల్లా అభివృద్ధిపై శ్రద్ధలేని చంద్రబాబు... పార్టీ కోసం కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషాను సైకిలెక్కించారు.  టీడీపీ మోసపూరితపాలన, అనైతిక చర్యలతో ఆ పార్టీలోని ప్రముఖులు వేసారిపోతున్నారు. అయితే అధికారం ఉన్నపుడు తొందరపాటు తగదని చాలామంది అనివార్యంగా టీడీపీలో కొనసాగుతున్నారు. అకృత్యాలను తాళలేక ఇంకొందరు వైఎస్సార్‌సీపీ బాటపడుతున్నారు.





 వైఎస్సార్‌సీపీ నేతలపై భౌతిక దాడులు:

మంత్రిగా ఉంటూ రాప్తాడు నియోజకవర్గానికి సునీత లాభం చేయకపోగా ఎలా నష్టం చేస్తున్నారో నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సఫలీకృతులయ్యారు.  పేరూరుడ్యాం, హంద్రీ-నీవా ఆయకట్టు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు హాజరయ్యారనే కారణంతో రామగిరిలో జయచంద్రారెడ్డి అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త పొలంలోని స్ప్రింక్లర్లు, పైపులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ చర్యతో టీడీపీ నేతల నియంతృత్వపాలన ఏమిటో నియోజకవర్గ ప్రజలకు స్పష్టమైంది. ఈ నెల 26న రామగిరి మాజీ సర్పంచ్ మీనుగ నాగరాజు... వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.



ఈయనతో పాటు వాల్మీకి నేత, రాప్తాడు మాజీ మండలాధ్యక్షుడు బలరాముడు కూడా జగన్‌ను కలిశారు. దీంతో టీడీపీ నేతల్లో కాస్త కదలిక వచ్చింది. ఈ నెల 29న రాప్తాడు పండ మేటి వేంకటరమణస్వామి ఆలయకమిటీ సభ్యులు కురుబ ఎరగుంటప్ప, తలారి తిప్పన్న, శ్రీరాములు, మాజీ డీలర్ దుర్గాప్రసాద్‌లు  ప్రకాష్‌రెడ్డిసమక్షంలో వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాలనుంచి మరికొంతమంది పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ పరిణామాలను నియంత్రంచలేక వైఎస్‌ఆర్ సీపీ నేతలపై భౌతిక దాడులకు దిగారు. సోమవారం కనగాపల్లి మండలం కుర్లపల్లి, కొండ్రెడ్డిబావిలో వైఎస్సార్‌సీపీ నేతలు సుబ్బారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, మల్లికార్జునరెడ్డి, భాస్కర్‌రెడ్డి, విజయ్‌నాయక్, ఈశ్వరరెడ్డి, నరసింహారెడ్డి, జగన్నాథరెడ్డి, హనుమంతరెడ్డి, వెంకట్రామిరెడ్డిలపై టీడీపీ నేతల రాజన్న, ఆయన కుటుంబసభ్యులు దాడి చేశారు. అంతటితో ఆగలేదు. ‘అనంత’ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిపై మళ్లీ దాడికి యత్నించారు. వీరిని పరామర్శించేందుకు వచ్చిన ప్రకాష్‌రెడ్డిపై కూడా దాడికి ప్రయత్నించారు.





 హత్యకు కుట్ర?

 ఆస్పత్రిలోని పరిస్థితులు చూస్తే ప్రకాష్‌రెడ్డి ఆరోపించినట్లు ఆయన హత్యకు కుట్ర పన్నినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆస్పత్రిలో జైబాలాజీ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తోంది. మంత్రి సునీత సోదరుడు బాలాజీనే సెక్యూరిటీ గార్డులను నియమించారు. ఆస్పత్రిలో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించిన 20 నిమిషాల పాటు సెక్యూరిటీ గార్డులు పత్తా లేరు. పోలీసులు వచ్చిన తర్వాత వారు కనిపించసాగారు. ఆస్పత్రికి వచ్చిన టీడీపీ కార్యకర్తల చేతుల్లో రాడ్లు, కత్తులు ఉన్నాయి. చికిత్స కోసం వచ్చే వారు కత్తులు, రాడ్లు ఎందుకు తెచ్చారనేది తెలియాలి. అలాగే ఔట్‌పోస్టు ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉంది.



ఘటన జరిగిన 20 నిమిషాల వరకూ ఔట్‌పోస్టు పోలీసులు సైతం ఎందుకు అక్కడికి చేరుకోలేదన్నది తెలియాలి. ఈ సమయంలో డీజీపీ రాముడు పోలీసు కళ్యాణమంటపం ప్రారంభోత్సవంలో సిటీలోనే ఉన్నారు. ఇంత పెద్ద గొడవ జరుగుతుందని తెలిసినా, ప్రకాష్‌రెడ్డిని గదిలో నిర్బంధించి గది తలుపులు, కిటికీలు పగలగొట్టేందుకు యత్నిస్తున్నారని తెలిసినా అరగంటపాటు పోలీసులు అక్కడికి రాలేదు. తర్వాత కూడా సీఐలు మాత్రమే వచ్చారు. డీఎస్పీ, ఎస్పీ ఆవైపు చూడలేదు. తన సోదరుడు చందు ఆస్పత్రికి వచ్చేదాకా ప్రకాష్‌రెడ్డి ఆస్పత్రిలోనే నిర్బంధంలో ఉండిపోయారు. తనను హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం సునీత, శ్రీరాం కుట్ర పన్నారని, అందులో భాగంగానే ఆస్పత్రిలో గొడవ జరిగిందని ఈ సందర్భంగా ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. ఆస్పత్రిలో పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూరుస్తుండడం గమనార్హం.





 ప్రకాష్‌రెడ్డి, చందుపై కేసు

ఆస్పత్రిలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, చందును మూడవ పట్టణ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దాడులకు వారిని బాధ్యులుగా చేస్తూ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.

 

మా వాళ్లు రాకుంటే బతికుండేవాణ్ణి కాదు

తోటలోకి వెళ్తుంటే ఉన్నట్టుండి దాడి చేశారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఎందుకొడ్తున్నార్రా.. అని అడిగితే ‘ఏం రా ఆ పార్టీలో తిరుగుతారా.. ఒక్కొక్కరిని చంపితే ఏం చేస్తారు’.. అంటూ ఇష్టమొచ్చినట్టు దాడి చేశారు. మా వాళ్లు రాకపోయింటే బతికుండేవాణ్ణికాదు.

 - సూర్యనారాయణరెడ్డి, బాధితుడు, కుర్లపల్లి



30 మంది వరకు వచ్చారు

వాళ్లు పక్కా ప్లాన్‌తోనే వచ్చారు. నేను అక్కడికి పోయేటప్పటికే రాళ్లు తీసుకుని ఉన్నారు. కనపడగానే కొట్టారు. కట్టెలు తీసుకుని కాళ్లు విరగ్గొట్టారు. 30 మంది వరకు ఉంటారు. వాళ్లలో రాజప్ప, ఆదెప్ప, వెంకట్రాముడు, ఇంకొందరు ఉన్నారు.       - జగన్నాథరెడ్డి, కుర్లపల్లి.

 


 



 



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top