మూన్నాళ్ల ముచ్చటే !


  • వెక్కిరిస్తున్న ఇంకుడు గుంతలు

  • మూడు నెలలకే నిరుపయోగం

  • చాలాచోట్ల పూడుకు పోయిన వైనం

  • వృథా అయిన రూ.10 కోట్లు

  • సాక్షి, రాజమహేంద్రవరం : 

    భూగర్భ జలాలు పెంచే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన తవ్విన ఇంకుడు గుంతలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. గత వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తడంతో గ్రామాలు, పట్టణాల్లో ఇంకుడు గుంతలు తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాడు ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ఈ కార్యక్రమం నేడు నవ్వుల పాలవుతోంది. తవ్విన రెండు మూడు నెలలకే చాలావరకూ 

    ఇంకుడుగుంతలు పూడుకుపోయాయి. మరికొన్ని నిరుపయోగంగా మారాయి.

     

    50 వేల గుంతలు.. రూ.10 కోట్లు

    వర్షపు నీటితోపాటు, ఇంటి అవసరాలకు ఉపయోగించగా వచ్చిన వృథా నీటిని భూమిలోకి పంపి భూగర్భ జలాలు పెంచేందుకు, తద్వారా కరువు పారదోలేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ద్వారా ఈ కార్యక్రమం అమలు చేసింది. జిల్లాలో 50 వేలకు పైగా ఇంకుడు గుంతలను తవ్వారు. ఒక్కో గుంతకు సైజునుబట్టి రూ.1,700 నుంచి రూ.2 వేల వరకూ చెల్లించారు. అయితే అధిక శాతం గుంతలు నిరుపయోగంగా మారడడంతో వీటికోసం ఖర్చు చేసిన రూ.10 కోట్లు వృథా అయ్యాయి.

     

    ఇష్టారీతిన తవ్వకాలు

    ఇంకుడు గుంతలు తవ్వే కాంట్రాక్టులను స్థానికంగా ఉండే టీడీపీ నేతలకు ఇచ్చారు. చాలాచోట్ల వారు ఇష్టారీతిన నిబంధనలకు విరుద్ధంగా తవ్వారనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. కొన్నిచోట్లయితే గుంతలు తవ్వకుండానే బిల్లులు చేయించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

    ఎప్పుడూ వృథా నీరు వచ్చే ప్రాంతంలో ఇంకుడు గుంతలను తవ్వాలి. కానీ, దీనికి విరుద్ధంగా ఖాళీ ప్రదేశాలు, వృథా, మురుగునీరు రాని ప్రదేశాల్లో ఎక్కువగా నిర్మించారు. పలుచోట్ల ఆయా గుంతల్లోకి వృథా నీరు వచ్చేలా ఏర్పాట్లు చేయకపోవడంతో లక్ష్యం నీరుగారిపోయింది.

    ఇంకుడు గుంతను నాలుగడుగుల లోతు, మీటరు వెడల్పున తవ్వాలి. ఇందులో 150 ఎంఎం రాళ్లు 2.5 అడుగుల మేర, 40 ఎంఎం కంకర అడుగు మేర, 20 ఎంఎం కంకర అరడుగు మేర వేయాలి. చుట్టూ సిమెంట్‌తో తయారు చేసిన ఒర ఏర్పాటు చేయాలి. సన్నని కంకర చిప్స్‌ అరడుగు మేర వేయాలి. అనంతరం గుంతపై ఇనుప మెష్‌ అమర్చాలి. కానీ ఈ నిబంధనలు పాటించకుండా రాళ్లు, మట్టితో గుంతలను నింపి అధికార పార్టీ నేతలు బిల్లులు చేయించుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధిక శాతం గుంతలపై నిబంధనల ప్రకారం ఇనుప మెష్‌ను అమర్చనేలేదు.

     

    అవగాహన కల్పిస్తాం

    పూడుకుపోయిన ఇంకుడు గుంతలను తిరిగి బాగు చేయిస్తాం. వీటి ఉపయోగం, వినియోగంపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉంది. ఇంకుడు గుంతలు నిరుపయోగంగా ఉన్నచోట్ల సిబ్బందిని పంపి అక్కడ వారికి అవగాహన కల్పిస్తాం.

    – ఎ.నాగేశ్వరరావు, పథక సంచాలకులు,జిల్లా నీటియాజమాన్య సంస్థ

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top