అడుగుపెడితే చచ్చిపోతాం...!

అడుగుపెడితే చచ్చిపోతాం...!

కొల్లేటికోట (కైకలూరు) :

కొల్లేరు అభయారణ్యంలో మంచినీటి చెరువుల పేరుతో సాగుతున్న అక్రమ తవ్వకాలకు అంతు ఉండటం లేదు. నిన్నటి వరకు మండవల్లి మండలానికి పరిమితమైన తవ్వకాలు ఇప్పుడు కైకలూరు మండలానికి పాకింది. కొల్లేటికోటలో అభయరణ్యపరిధిలో సుమారు 60 ఎకరాలు చెరువు పనులను శుక్రవారం పొక్లయిన్‌తో ప్రారంభించారు. ఇప్పుడు అటవీ సిబ్బందిని అడ్డుకోవడానికి అక్రమార్కులు కొత్త రూట్‌ కనిపెట్టారు. అధికారులు ఆ పనుల వద్దకు వెళ్లకుండా టెంట్‌లు వేసి మహిళలను ముందు వరసలో పెట్టారు. అటవీశాఖ డీఆర్వో జి.ఈశ్వరరావు, సిబ్బందితో లోపలకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఎవరినీ వెళ్లనివ్వలేదు. రెండు నెలల వ్యవధిలో కొల్లేరు ప్రాంతంలో గుమ్మళ్ళపాడు, చింతపాడు, పులపర్రు గ్రామాల్లో తాగునీటి చెరువుల పేరుతో చెరువులను తవ్వేశారు. అన్నింటా ఒకటే సూత్రం మహిళలను అడ్డుపెట్టడం. కొల్లేటికోట విషయానికి వస్తే మరీ అడ్డగోలు వ్యవహారంగా కనిపిస్తుంది. ఇప్పటికే మంచినీటి అవసరాల నిమిత్తం 30 ఎకరాల తాగునీటి చెరువు ఉంది. దీనికి అధనంగా మరో 60 ఎకరాలు తవ్వుతున్నారు. విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

పురుగుమందు డబ్బాలతో బెదిరింపు..

కొల్లేటికోటలో మహిళలు మరో అడుగు ముందుకేశారు. అధికారులు, మీడియా లోపలకి వెళితే పురుగుమందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించారు. పలువురు మహిళల చేతుల్లో పురగుమందు డబ్బాలు ఉన్నాయి. పులపర్రు, చింతపాడు గ్రామాల మాదిరిగా మహిళలను ముందు వరసలో ఉంచి, సూత్రధారులు వారి వెనుక ఉండి కథ నడిపిస్తున్నారు. కనీసం లోపల జరిగే తంతును ఫొటోలు తీయడానికి వెళ్ళిన మీడియాను అనుమతించలేదు. షరామమూలుగానే కైకలూరు రూరల్‌ స్టేషన్‌లో ఓ ఆరుగురు పెద్దలపై అటవీశాకాధికారులు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. 

 

కొల్లేరులో చట్టాలు వర్తించవా..?

కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వ అనుమతులు తీసుకునే చెరువులు తవ్వాలని ఆయన పదేపదే చెబుతున్నా,అక్రమ చేపల చెరువుల తవ్వకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. అధికారపక్షం అండతో నియోజకవర్గ స్థాయి నాయకుడు తెరవెనుక మొత్తం కథ నడుపుతున్నాడు. రెండు నెలలుగా సుప్రీం కోర్టు తీర్పుకు కొల్లేరులో తూట్లు పడుతున్న జిల్లా స్థాయి అధికారులు కొ ల్లేరుపై కనీసం కన్నెత్తి చూడటం లేదు. చట్టాలను లెక్కచేయకుండా తవ్విస్తున్న సదరు పచ్చనేతకు ఓ ఏడాది పాటు చేపల చెరువు లీజు ఫ్రీగా ఇవ్వలనే కండీషన్‌ పెట్టినట్లు తెలుస్తుంది. కొల్లేరులో అక్రమ పరంపర కొనసాగుతుందా. అడ్డుకట్ట పడుతుందా అనేది అంతుచిక్కని ప్రశ్నంగా మారింది.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top