చీమకుర్తి టు చైనా

చీమకుర్తి టు చైనా


 సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  గ్రానైట్ అక్రమ విదేశీ ఎగుమతి యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించకుండానే జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ ప్రాంతానికి చెందిన కొందరు గ్రానైట్ వ్యాపారులు గ్రానైట్‌ను చైనాకు తరలిస్తున్నారు. చీమకుర్తి నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు రాయిని తరలించి అక్కడ నుంచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. ఏడాదికి ఒక్క ఎగుమతుల ద్వారానే వ్యాపారులు రూ.100 కోట్లకుపైగానే పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు సమాచారం.

 

  గ్రానైట్ అక్రమ ఎగుమతులను అడ్డుకోవాల్సిన అధికారులు దానికి స్వస్తి పలికి అక్రమ ఎగుమతులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రవాణాశాఖ, మైనింగ్, విజిలెన్స్ విభాగాల పరిధిలోని కొందరు అధికారులు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వారికి వ్యాపారులు పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ అధికారులే అక్రమ ఎగుమతులు ప్రోత్సహిస్తుండటంతో వ్యాపారుల అక్రమాలకు అడ్డేలేకుండా పోతోంది. కృష్ణపట్నం పోర్టు ద్వారా అక్రమ ఎగుమతులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

 

 డిమాండ్ తగ్గిందంటున్న వ్యాపారులు..

 అసలు గ్రానైట్ ఎగుమతులే తగ్గిపోయాయని ముఖ్యంగా చైనాకు ఎగుమతులు తగ్గాయని గ్రానైట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. చైనాలో గ్రానైట్‌కు డిమాండ్ తగ్గిందని, ఇటు కొందరు మైనింగ్ అధికారులు సైతం పేర్కొంటున్నారు. వాస్తవంగా చైనాకు గ్రానైట్ ఎగుమతులు ఏ మాత్రం తగ్గలేదు. ప్రభుత్వ గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఎగుమతులు తగ్గకపోగా కొంత మేర పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

 

 ఎగుమతుల తీరు ఇదీ..

 2014-15లో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ 3,33,737 క్యూబిక్ మీటర్లు ఎగుమతి కాగా, 2015-16లో 3,53,142 క్యూబిక్ మీటర్లు ఎగుమతి అయింది. 2016-17 ఏడాదికిగాను ఏప్రిల్, మే, జూన్, జూలై నాలుగు నెలల్లోనే 1,25,138 క్యూబిక్ మీటర్లు ఎగుమతి అయింది. ఇక బ్లాక్ గ్రానైట్ 2014-15లో 35,965 క్యూబిక్ మీటర్లు ఎగుమతి కాగా, 2015-16లో 56,781 క్యూబిక్ మీటర్లు ఎగుమతి అయింది. 2016-17లో ఏప్రిల్ నుంచి జూలై వరకు 20,931 క్యూబిక్ మీటర్లు ఎగుమతి అయింది. కలర్ గ్రానైట్ 2014-15లో 50,568 క్యూబిక్ మీటర్లు, 2015-16లో 85,509 క్యూబిక్ మీటర్లు, 2016-17లో ఏప్రిల్ నుంచి జూలై వరకు 31,398 క్యూబిక్ మీటర్లు ఎగుమతి అయింది. ఈ గణాంకాలు చూస్తే గతంతో పోలిస్తే గ్రానైట్ ఎగుమతులు ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top