నిర్లక్ష్యం!

నిర్లక్ష్యం!


పాఠశాలలు, కళాశాలలపునఃప్రారంభానికి సమయం ఆసన్నమైంది. అయితే వీటికి సంబంధించిన బస్సులు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంది. కానీ సగానికి పైగా బస్సులకు ఈ సర్టిఫికెట్లు యాజమాన్యాలు నేటికీ తీసుకోలేదు. అధికారులు ఓ వైపు హెచ్చరిస్తున్నా...యాజమాన్యాలు పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో అధికారులు ఏం చేస్తారో...వేచి చూడాల్సిందే.



విజయనగరం ఫోర్ట్‌: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమానులు ధనార్జనే తప్ప విద్యార్థుల భవిష్యత్‌ గురించి అలోచించడం లేదు. విద్యార్థులపై వ్యాపారం చేస్తున్న పాఠశాల నిర్వాహకులు వారికి కల్పించాల్సిన సౌకర్యాలు గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. అంతగా కండిషన్‌ లేని బస్సులతో  నడిపి కాసుల కూడగట్టుకోవాలని చూస్తున్నారే తప్ప విద్యార్థులు గురించి అలోచించడం లేదు. మరో నాలుగు  రోజుల్లో పాఠశాలలను, కళాశాలలను తెరవనున్నారు. 



ఈలోగా  బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌(ఎఫ్‌సీ) రవాణ శాఖ కార్యాలయంలో చేయించుకోవాలి. కాని అధికశాతం బస్సుల నిర్వాహకులు ఇంతవరకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోలేదు. జిల్లాలో 681  స్కూలు బస్సులు ఉన్నాయి. ఇంత వరకు కేవలం 341బస్సులు  మాత్రమే ఎఫ్‌సీ తీసుకున్నారు. పాఠశాలలు తెరవడానికి కేవలం నాలుగు  రోజులు వ్యవధి మాత్రమే ఉంది. ఐదు రోజుల్లో బస్సులు అన్నింటికి ఎఫ్‌సీ ఇవ్వడం సాధ్యం కాదు.



ప్రమాద బస్సులు...

జిల్లాలో చాలా బస్సులు అధ్వానంగా ఉన్నాయి. కొన్ని బస్సులు ప్రమాదాలకు ద్వారాలు తెరిచే విధంగా ఉన్నాయి. చాలా వరకు బస్సులకు గ్రిల్స్, కిటికీలు లేవు. అదే విధంగా పిల్లలు ఎక్కడానికి మెట్లు అనువుగా లేవు. ప్రథమ చికిత్స పెట్టేలు లేకపోవడం, అనుభవం లేని డ్రైవర్లు, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం పాఠశాల బస్సుల నిర్వాహకులు చేస్తున్నారు. వీటితో ప్రమాదం అని తెలిసినా పట్టించుకునే వారే కరువయ్యారు.



ఇవీ నిబంధనలు..

బస్సు ప్రధాన ద్వారం వద్ద పిల్లలు ఎక్కడానికి 325 మిల్లీమీటర్లు ఎత్తు ఉండాలి. స్టీరింగ్, బ్రేకు, ఇంజిన్‌ కండిషన్‌గా ఉండాలి. సీట్లు కొత్తగా ఉండాలి. టైర్లు కండిషన్‌గా ఉండాలి. పాఠశాల బస్సులపై విద్యార్థులను ఆకర్షించే విధంగా బొమ్మలు వేయాలి. ప్రథమ చికిత్స బాక్సు ఉండాలి. డ్రైవర్‌ వయసు 50 సంవత్సరాల్లోపు ఉండాలి. డ్రైవర్, క్లీనర్‌ యూనిఫామ్‌ ధరించాలి. డ్రైవర్‌గాని, క్లీనిర్‌గాని మద్యం సేవించరాదు. అద్దాలు, గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలి. లైట్లు అన్ని  కొత్తవి ఏర్పాటు చేయాలి. ఇవి  అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎఫ్‌సీ ఏర్పాటు చేసిన తర్వాత రవాణ శాఖ కార్యాలయానికి తీసుకురావాలి. అక్కడ బస్సులను క్షుణ్ణుంగా పరిశీలించిన మీదట బస్సు కండిషన్‌ బాగున్నట్టయితే ఎఫ్‌సీ ఇవ్వాలి.



చర్యలు తప్పవు...

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు లేకుండా పాఠశాలల, కళాశాలల బస్సులు తిరిగితే సీజ్‌ చేస్తాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. ప్రతీ పాఠశాల నిర్వాహకుడు బస్సులకు ఎఫ్‌సీలు తీసుకోవాల్సిందే.

–ఎం.కనకరాజు, ఇన్‌చార్జి ఆర్టీవో

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top