రుణమాఫీ చేయకుంటే యుద్ధమే

రుణమాఫీ చేయకుంటే యుద్ధమే - Sakshi


సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రైతులను అడుగడుగునా వంచిస్తూ, ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించాలన్న కనీస నైతికత కూడా లేని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసి తీరుతుందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండలం కమాలుద్దీన్‌పూర్ గ్రామంలో రైతు భరోసా యాత్రను కాంగ్రెస్ చేపట్టింది.



ప్రజల బాగోగులను పూర్తిగా విస్మరించి, రైతుల పేరెత్తితేనే శివతాండవమాడుతున్న సీఎం కేసీఆర్ తీరును ఎండగట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజల చెంతకు వచ్చిందని ఈ సందర్భంగా జరిగిన సభలో ఉత్తమ్ అన్నారు. రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం ఎంతమొండిగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రజా ఉద్యమాలతో మెడలు వంచి తీరతామన్నారు. ‘‘అధికారకాంక్షతో ఎన్నికలకు ముందు రుణమాఫీ హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్, ఇప్పుడు అదే హామీని ఒకేసారి నెరవేర్చమని కోరడాన్నే నేరంగా పరిగణిస్తోంది.రైతుల కష్టాలను తీర్చే అవకాశమున్నా కేసీఆర్ అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రజలే ఇందుకు తగిన గుణపాఠం చెప్పాలి.



రుణ మాఫీ హామీనుంచి పక్కకు తప్పుకుని రైతులను కేసీఆర్ మోసగిస్తే చూస్తు ఊరుకోబోం. రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తున్నట్లు ఈ నెల 9వ తేదీలోగా ప్రకటించని పక్షంలో 10న రాష్ట్ర బంద్‌తో ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం’’ అని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన ఒక్క పనీ చేయడం లేదని, ప్రచార పటాటోపం, ఆర్థిక ప్రయోజనాల ప్రాతిపదికనే ఏ పనైనా చేస్తోందని ఆయన ఆరోపించారు. రైతు కష్టాన్ని తీర్చాల్సిన ప్రభుత్వం అస్సలు పట్టించుకోకపోవడం వల్లే ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, పరిస్థితులను ఎదుర్కొనే మనోధైర్యాన్ని కలిగి ఉండాలని రైతులను కోరారు.



 అన్నదాతకు అండగా ఉంటాం: జానా

 రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం లేదని, కేవలం నినాదాలతో వారిని మోసగించే సర్కారు రాజ్యమేలుతోందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి దుయ్యబట్టారు. ఒక్క ఎన్నికల హామీనీ నెరవేర్చకుండా ప్రజల జీవితాలతో కేసీఆర్ సర్కార్ చెలగాటమాడుతుందన్నారు. అన్నదాతలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. సభలోనూ ఇటు ప్రజాక్షేత్రంలోనూ కేసీఆర్ విధానాలను ఎండగడతామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ జరిగేదాకా పోరాటాన్ని ఆపబోమన్నారు. రుణమాఫీపై సానుకూల ప్రకటన రాకుంటే అసెంబ్లీ, సచివాలయాలతో పాటు సీఎం ఇంటినీ ముట్టడిస్తామని హెచ్చరించారు.



కేసీఆర్ సీఎంలా కాకుండా పిట్టలదొరలా వ్యవహరిస్తున్నారని మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. రైతులను రాజకీయంగా వాడుకోవడానికే సర్కారు పరిమితమైందని మాజీమంత్రి డీకే అరుణ ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో రైతులకు ఒకేసారి రూ.13,500 కోట్ల రుణాల నుంచి విముక్తి కల్పించారని, వారికి ఉచిత విద్యుత్ ఇచ్చే ఫైలు మీదే తొలి సంతకం పెట్టిన ఘనత కూడా ఆయనదేనని గుర్తు చేశారు. వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో నేతలు జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, పువ్వాడ అజయ్‌కుమార్, భాస్కర్‌రావు, రాంమోహన్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు మాట్లాడారు.

 

 రైతు నర్సింహ కుటుంబానికి పరామర్శ


 రైతు భరోసా యాత్రలో భాగంగా ఖిల్లాఘనపురం మండలం కమాలొద్దిన్‌పూర్ గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కాటమోని నర్సింహ కుటుంబాన్ని ఉత్తమ్, జానా తదితర కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. కూలిపోతున్న ఇంటిని చూసి చలించిపోయారు. నర్సింహ భార్య, కూతుళ్లు, కొడుకు వారితో తమ గోడు చెప్పుకుని విలపించారు. సమస్యకు ఆత్మహత్యలు పరిష్కారం కాదంటూ నేతలు వారిని అనునయించారు. రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపినా కాంగ్రెస్ ఆదుకుంటుందంటూ ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున వారికి రూ.లక్ష నగదును సాయంగా ఉత్తమ్ అందజేశారు. వారికి ప్రభుత్వపరంగా రావాల్సిన ఆర్థిక సాయమూ అందేలా చూస్తామని, భవిష్యత్తులోనూ వెన్నుదన్నుగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top