దేవుళ్లకు మొక్కాను.. పూజించ వచ్చాను

దేవుళ్లకు మొక్కాను.. పూజించ వచ్చాను

పెదవేగి రూరల్‌/ద్వారకా తిరుమల : రియో ఒలింపిక్స్‌లో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం ద్వారకాతిరుమల చినవెంకన్న, రాట్నాలకుంట రాట్నాలమ్మను దర్శించుకున్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు రాట్నాలమ్మ, చినవెంకన్న, మద్ది ఆంజనేయస్వామికి మొక్కుకున్నానని, ఆ మొక్కులు తీర్చుకునేందుకు వచ్చానని చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి చినవెంకన్నకు పూజలు చేసిన అనంతరం రాట్నాలమ్మ దర్శనానికి వెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా పాల పొంగలి వండి.. ఆ పాత్రను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. లక్ష్యంపై గురి పెడితే గెలుపు తలుపు తెరుచుకుంటుందని ఈ సందర్భంగా యువతకు దిశానిర్దేశం చేశారు. 

ఈ స్వాగతం జీవితంలో మరచిపోలేను

ఒలింపిక్‌ క్రీడల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం జిల్లాలోని ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయాన్ని, పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాట్నాలమ్మ దేవస్థానానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన సింధుకు స్థానిక నాయకులు పుష్పగుచ్ఛం అందించిన అనంతరం గోపన్నపాలెం వ్యాయామ కళాశాల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. సింధు భక్తిశ్రద్ధలతో రాట్నాలమ్మను దర్శించుకుని రియో ఒలింపిక్స్‌కు వెళ్లేముందు మొక్కుకున్న మొక్కుబడులను తీర్చుకున్నారు. ప్రసాదాన్ని తలపై పెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

 స్థానిక నాయకులు, దేవస్థాన సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించి రాట్నాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. అనంతరం సింధు విలేకరులతో మాట్లాడుతూ రాట్నాలమ్మ దయవల్ల తాను ఈ స్థాయికి ఎదిగానని, తన ఆటలో అమ్మవారు వెన్నంటే ఉన్నట్టే భావించి నిరంతరం కష్టపడి భారతదేశానికి పతకం సా«ధించానని చెప్పారు. ఈ విజయం వెనుక అటు చిన తిరుపతి వెంకన్నస్వామి, ఇటు రాట్నాలమ్మ, మద్ది ఆంజనేయస్వామి ఆశీస్సులు అడుగడుగునా తనకు ఉన్నాయని, అందుకే అమ్మవారిని స్వయంగా వచ్చి దర్శించుకున్నానని చెప్పారు. తన జీవితంలో మరుపురాని ఘనస్వాగతం అమ్మవారి సన్నిధిలో లభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ స్వాగతాన్ని జీవితంలో ఎన్నడూ మరచిపోలేనని చెప్పారు. కార్యక్రమంలో రాట్నాలకుంట ఆలయ కమిటీ చైర్మన్‌ రాయల భాస్కరరావు, పెదవేగి ఎంపీపీ దేవర పల్లి బక్కయ్య, ఏలూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top