1944లో పుష్కరాల్లో విమానం చూశా

1944లో పుష్కరాల్లో విమానం చూశా

గోదావరి పుష్కరాల్లో స్నానమాచరించిన రాజరాజేశ్వరి

94 ఏళ్ల వయసులో స్వయంగా దైనందిన కార్యకలాపాలు

అంత్య పుష్కర జలాల్లోనూ ఓలలాడతానంటున్న ముదివగ్గు

 

ఎనిమిదో ఏటే పెళ్ళయింది..

పశ్చిమ గోదావరి జిల్లా పరిమెళ్ల గ్రామంలో 1922 ఏప్రిల్‌ 8వ తేదీన జన్మించాను. తండ్రి కొలిచన అగ్నిహోత్రుడు, తలి ్లప్రకాశమ్మ. నాలుగో తరగతి వరకుచదువుకున్నాను. ఎనిమిదవ ఏటే 1930లో పెళ్ళి అయింది. భర్త దుర్భా వెంకటకృష్ణారావు. అప్పుడు ఆయన 9వ తరగతి చదువుతూండేవారు. తరువాత ఆయన సి.పి.డబ్లు్య.లో ఇంజినీరుగా ఉద్యోగపర్వంలోకి అడుగుపెట్టారు. ఆయనతో పాటు దేశమంతా తిరిగాను. తమిళ, కన్నడభాషలు నేర్చుకున్నాను. మాకు ఏడుగురు సంతాన.. అయిదుగురు అబ్బాయిలు,ఇద్దరు అమ్మాయిలు. ఆఖరి అబ్బాయికి తప్ప అందరికి షష్టిపూర్తి వేడుకలు జరిగాయి. అందరూ కేంద్రప్రభుత్వ సంస్థల్లో పని చేశారు. మా వారు 1967లో కాలం చేశారు.

 

రాజమహేంద్రవరం కల్చరల్‌:

‘ఇప్పటికి ఎనిమిది పుష్కరాలు చూశాను. పవిత్ర గోదావరిలో స్నానాలు చేశాను. ఈ అంత్యపుష్కరాలకు కూడా గోదావరీ జలాలలో స్నానమాచరిస్తాను’ ఆత్మ విశ్వాసంతో అన్నారు 94 సంవత్సరాల దుర్భా రాజరాజేశ్వరి. శతాబ్ది ప్రాయానికి దరిదాపుల్లో ఉన్నా.. నేటికీ తన దైనందిన కార్యక్రమాలను స్వయంగా నిర్వహించుకునే ఆ గోదావరి జిల్లాల ఆడపడుచు తన తొమ్మిదిన్నర దశాబ్దాల జీవనయానంలో వచ్చిన పుష్కరాలు, నేటి తరానికి అచ్చెరువు కలిగించే తన జీవనసరళిని, కుటుంబ వివరాలను సోమవారం స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులోని తన గృహంలో ‘సాక్షి’కి ఇలా వివరించారు..

ఒకప్పుడింత హడావిడి లేదు..

నాకు పదేళ్లప్పుడు 1932లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. తర్వాత 1944, 1956, 1967, 1979, 1991, 2003, 2015 సంవత్సరాల్లో గోదావరి పుష్కరాలు చూశాను. ఒకప్పుడు ఇంతమంది జనం, హడావిడి ఉండేవి కావు. 1944 పుష్కరాల్లో విమానాల్లో ప్రజలను గిరికీలు కొట్టించేవారు. పెద్దవాళ్ళకు అయిదు రూపాయలు, పిల్లలకు మూడు రూపాయలు టిక్కెట్టు నిర్ణయించారు. విమానం చూడటం అదే మొదటిసారి. 

నిఘంటువులో డాక్టర్లు లేరు..

డాక్టర్లు, వైద్యాలు నా నిఘంటువులో లేవు. జలుబు చేస్తే మిరియాల రసం, జీర్ణశక్తి బాగా లేకపోతే కాస ్తపంచదార కలుపుకొని వాము తీసుకుంటాను. పైత్యంగా ఉందనిపిస్తే అల్లంముక్క నోట్లో ఉంచుకుని నములుతాను. ఇవి నా దగ్గర ఎప్పుడూ ఉంచుకుంటాను.

సాంప్రదాయాలకు దూరమైతే అనర్థాలు చేరువ

మన సాంప్రదాయాలకుదూరం అయితే, అన్ని అన ర్థాలూ మన వెంటే ఉంటాయని నమ్ముతాను. ప్రతిరోజూ విష్ణుసహస్రనామాలు చదవుతాను. భాగవతం, ఆనందరామాయణం చదువుకున్నాను. గోదావరీ తీరంలో నివసించడం, ఇన్ని పుష్కరాల్లో తీర్థస్నానాలు చేయడం నా సుకృతంగా భావిస్తున్నాను.

అన్నీ తినడమే ఆరోగ్యరహస్యం ..

అన్నీ తినడమే నా ఆరోగ్యరహస్యం. నా విషయంలో– అన్నంలో కూర కలుపుకొంటాను అనడం కన్నా..కూరలో అన్నం కలుపుకొంటాను అనడం కరెక్టు. అన్నం తక్కువ, కూరలు ఎక్కువగా తీసుకుంటాను. చిన్నప్పటి నుంచీ నెయ్యి, పెరుగు బాగా అలవాటు. మామిడిపళ్ళ సీజనులో ప్రతిరోజూ వాటిని తీసుకుంటాను. మిగతా సమయాల్లో ఆయా సీజన్లలో లభ్యమయ్యే పళ్ళు తప్పని సరి. కార్తికమాసంలో ప్రతిరోజు నక్షత్రదర్శనం అయ్యేవరకు ఉపవాసం చేస్తాను. రాత్రి ఒక్కపూటే ఆహారం తీసుకుంటాను. ప్రతి ఏకాదశికి ఉపవాసం తప్పనిసరిగా చేస్తాను.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top