ఉంటుందా.. ఊడుతుందా..!

ఉంటుందా.. ఊడుతుందా..! - Sakshi


త్రిశంకుస్వర్గంలో మైనార్టీ గురుకుల సిబ్బంది

విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు

ఇంకా అందని నియామక ఉత్తర్వులు

ఆందోళనలో అభ్యర్థులు




జగిత్యాల: ‘నేను విద్యాసంవత్సరం ప్రారంభానికి ఐదారురోజుల ముందే మైనార్టీ గురుకులంలో నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన. ఇప్పటికీ రెండు నెలలు గడిచిపోయాయి. ఇంతవరకు నాకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందలేదు. గురుకులాల్లో ఇంకా మార్పులు చేర్పులు ఉన్నాయని తెలిసింది. ఉద్యోగం ఉంటుందో..? ఊడుతుందోనని నాకూ భయమేస్తోంది. నియామక ఉత్తర్వులు ఇస్తే టెన్షన్‌ ఉండదు.’ – జిల్లాలో ఓ మైనార్టీ గురుకుల సిబ్బంది ఆవేదన .



కేవలం ఇతడిదొక్కడిదే కాదూ.. జిల్లా పరిధిలోని మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది అందరిదీ ఇదే ఆందోళన. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండునెలలు కావస్తున్నా ఇంతవరకు ఉద్యోగ నియామక పత్రాలు అందకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క ఇప్పటికీ జరుగుతున్న మార్పులు, చేర్పులు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.నియామకపత్రాలు చేతికందే వరకు ఉద్యోగాలు ఉంటాయో..? ఊడుతాయో..? అనే ఉత్కంఠ నెలకొంది. నియామక ఉత్తర్వులకోసం ఎదురుచూస్తున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఉద్యోగం పోతుందనే భయంతో ఈ సాహసం చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. ఇటు రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం వీరికి నియామక ఉత్తర్వుల బాధ్యత తమది కాదని, ఆయా జిల్లాల కలెక్టర్లు.. ఏజెన్సీలదేనని స్పష్టం చేయడంతో నిస్సహాయస్థితిలో ఉండిపోయారు.



 నిరుపేద మైనార్టీ విద్యార్థుల చదువుపై దృష్టిసారించిన రాష్ట్రప్రభుత్వం వారికి ఆంగ్లమాధ్యమంతోపాటు ఉర్దూ, దీనియాత్, నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యాసంవత్సరం జగిత్యాల, మెట్‌పల్లి పట్టణాల్లో బాలురు, ధర్మపురి మండలం దొంతాపూర్‌లో బాలికలు మైనార్టీ గురుకులాలు ప్రారంభించింది. గత విద్యాసంవత్సరం జగిత్యాలలో బాలికలు, కోరుట్లలో బాలుర గురుకులాలు ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లాలకే అప్పగించింది. బోధన సిబ్బందిలో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్, పీఈటీ, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్, స్టాఫ్‌నర్సు మొత్తం పదిమందిని తీసుకోవాలని సూచించింది. బోధనేతర సిబ్బంది కింద వార్డెన్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్‌ సబార్డినేట్, హౌజ్‌ కీపింగ్‌ (3), సెక్యూరిటీ గార్డు (2), ఫ్లంబర్, ఎలక్ట్రిషీయన్‌ మొత్తం తొమ్మిది మందిని పొరుగు సేవల పద్ధతిలో తీసుకోవాలని సూచించింది.



దీంతో కలెక్టర్‌ శరత్‌ ఆదేశాల మేరకు మెట్‌పల్లి సబ్‌ కలెక్టర్‌ ముషర్రఫ్‌ అలీ, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి  అధికారి గంటా నరేందర్‌ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. వారి విద్యార్హత, ఇంటర్వ్యూల ఆధారంగా  ఒక్కో గురుకులంలో పది మంది చొప్పున 30 మంది బోధన సిబ్బందిని ఎంపిక చేశారు. 27 మంది బోధనేతర సిబ్బంది నియామకాల బాద్యతను జిల్లాయేతర ఏజెన్సీకి అప్పగించారు. ఆ జాబితాను ప్రభుత్వానికి పంపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇంతవరకు ఎంపిక చేసిన టీచింగ్, నాన్‌టీచింగ్‌ సిబ్బందికి నియామకఉత్తర్వులు అందలేదు. దీంతో గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఇటు అధికారులపై, అటు ఏజెన్సీలపై ఫిర్యాదు చేయలేక ఆందోళనతో విధులు నిర్వరిస్తున్నారు.        

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top