రాజన్న బిడ్డగా వచ్చా..!

రాజన్న బిడ్డగా వచ్చా..! - Sakshi


♦ నిజామాబాద్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల

♦ ధైర్యంగా ఉండండి.. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది

♦ కోట్లాది మంది గుండెల్లో వైఎస్ బతికే ఉన్నారు

♦ నిజామాబాద్‌లో ఆరు, ఆదిలాబాద్‌లో మూడు కుటుంబాలకు పరామర్శ

 

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ఆదిలాబాద్: ‘‘రాజన్న బిడ్డగా మీ దగ్గరకు వచ్చా... మిమ్మల్ని కలుసుకొమ్మని జగనన్న పంపాడు.. ధైర్యంగా ఉండండి.. రాజన్న పాలనలో ప్రజలంతా కష్టాల్లేకుండా బతికారు.. మళ్లీ మంచి రోజులొస్తాయి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్సార్ మరణించి ఆరేళ్లు గడుస్తున్నా... కోట్లాది మంది గుండెల్లో బతికే ఉన్నారన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లో జిల్లాలో పరామర్శ యాత్ర ముగిసిన అనంతరం ఆమె నిజామాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టారు.



బాల్కొండ మండలం సోన్ బ్రిడ్జి వద్ద జిల్లాలోకి యాత్ర ప్రవేశించగా.. షర్మిలకు జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఆదిలాబాద్‌లో మూడు, నిజామాబాద్‌లో ఆరు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్‌లో కాసు బక్కయ్య, లోకేశ్వరం మండలం హవర్గాలో పర్స భోజన్న, దిలావర్‌పూర్‌లో కామాటిబొల్ల ముత్యం కుటుంబీకులను పరామర్శించారు. బజార్ హత్నూర్‌లో వైఎస్ అభిమాని ఈర్ల శివుడు ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం దూదిగాంలో మొదలైన పరామర్శ యాత్ర సదాశివనగర్ మండలంలోని రామారెడ్డి వరకు సాగింది.



 రాజన్న పాలనను గుర్తు చేసిన జనం..

 వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇతర నాయకులతో కలిసి షర్మిల నిజామాబాద్‌లో ఆరు కుటుంబాలను పరామర్శించారు. మొదటగా బాల్కొండ మండలం దూద్‌గాంలో వెల్మల కంచెట్టి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం డిచ్‌పల్లి మండలం యానాంపల్లిలో బత్తుల నర్సయ్య, సదాశివనగర్ మండల కేంద్రంలో డీకొండ కిషన్, ముంజాల లింగాగౌడ్ కుటుంబాలను పరామర్శించారు. తర్వాత రామారెడ్డిలోని గంగాధర్, పిప్పరి రాజు కుటుంబాలను కలిశారు. ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకు బాల్కొండ మండలంలోని మెండోరాలో షర్మిల పర్యటించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.



ఈ సందర్భంగా రైతులు ఆమెతో మాట్లాడారు. ‘‘వైఎస్ పాలనలో రైతు రాజయ్యాడమ్మా.. అప్పుడు పసుపు క్వింటాల్ 16 వేలు ధర పలికింది. రాజన్న పాలనలో రైతు ఏనాడు రోడ్డెక్క లేదు. రాజన్న లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది..’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘వైఎస్ బతికుంటే పేదల ముఖాల్లో సంతోషం ఉండేది.. రైతుల కళ్లల్లో ఆనందం ఉట్టి పడేది. రాజన్నను ప్రజలు మరువలేకపోతున్నారు.. ధైర్యం గా ఉండండి.. మంచి రోజులు వస్తాయి.’’ అని ప్రజలకు షర్మిల భరోసా ఇస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్‌సీపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి ఆధ్వర్యంలో సాగిన పరామర్శ యాత్ర లో జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ముజతబూ అహ్మద్, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రపుల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బీష్వ రవీందర్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ టి.ఇన్నారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు మహిపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, ఐల వెంకన్నగౌడ్, మంద వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

 

 సస్పెండ్ చేయడం బాధాకరం

  వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

 అన్నదాతల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించినందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో సహా, ప్రతిపక్ష పార్టీల సభ్యులను సస్పెండ్ చేయడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన సర్కారు ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయడంలో, గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమవుతున్న ప్రభుత్వం ఈ అంశాలపై సమాధానం చెప్పలేకే ఇలాంటి చర్యలకు దిగుతోందని విమర్శించారు. కరువు సాయం, మద్దతు ధరలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. తెలంగాణ వరప్రదాయని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు వైఎస్ శ్రీకారం చుట్టగా.. ప్రాజెక్టును తామే నిర్మించామని చెప్పుకోవడం కోసం ప్రభుత్వం బ్యారేజీ స్థలాన్ని మార్చాలని చూస్తోందని విమర్శించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top