తండా.. సమస్యలే నిండా!

తండా.. సమస్యలే నిండా! - Sakshi


మంచాల: మంచాల మండలం ఆరుట్ల అనుబంధ గ్రామంలో ముచ్చర్లకుంట తండా ఉంది. ఈ తండాలో 235 మంది జనాభా. ఇక్కడ 150 ఓట్లు ఉన్నాయి. పూర్తిగా పూరి గుడిసెలు ఉండే ఈ తండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి  పుణ్యమా అన్ని ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 22 ఇళ్లు మంజూరు అయ్యాయి. పూరి గుడిసెలు పోయి స్లాబ్‌ ఇళ్లు వచ్చాయి. మిగతా సదుపాయాలేమీ తండావాసులకు లేవు.  ఇక్కడ ప్రజలు బడి , గుడి ఎరుగరు. కనీసం అంగన్‌వాడీ సెంటర్‌ కూడా లేదు. రోడ్డు, రావాణ వ్యవస్థ లేదు. రోగం వచ్చినా.. నొప్పి వచ్చినా 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆరుట్లకు కాలినడకన వెళ్లాల్సిందే. ఈ తండా రాష్ట్ర రాజధానికి  సమీపంలో ఉన్నా కనీసం మౌలిక వసతులు లేకపోవడం దారుణం.



స్థానిక పంచాయతీ వారు నీటి సరఫరా కోసం బోరు వేశారు. అది పాడై రెండు నెలలు దాటింది. కనీసం దానిని బాగుచేసే నాథుడు లేడు. దీంతో ఆ గిరిజనులు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు.  గుక్కెడు తాగునీరు ఇవ్వాలని  వేడుకుంటున్నారు. గత్యంతరం లేక నిత్యం పొలం గట్ల వెంట వెళ్లి వ్యవసాయ బోరు బావుల వద్ద నీటిని తెచ్చుకుంటున్నారు. కరువు కారణంగా ఉన్న బోర్లు కూడా కొద్దిపాటి నీళ్లను అందిస్తున్నాయి.  ఆ నీటి కోసం త్రీఫేజ్‌ కరెంట్‌ ఎప్పుడు వస్తుందా అన్ని పడిగాపులు కాస్తూ కూర్చుంటున్నారు.



ఫైపులు తీసుకొని వచ్చి నీళ్లు అందిస్తాం..

ముచ్చర్ల కుంట తండాలో బోరుల్లో నీళ్లు తగ్గిపోయాయి. కొత్తగా పైపులు తీసుకొని వచ్చి బోరులో పైపులు వేసి, తండా  ప్రజలకు నీళ్లు అందిస్తాం.

– జయసుధ(పంచాయతీ కార్యదర్శి) ఆరుట్ల



తాగునీరివ్వాలి...

నీళ్ల కోసం నానా అవస్థలు పడుతున్నాం. ఉన్న పంచాయతీ బోరు రెండు నెలల క్రితం పాడైపోయింది. కనీసం బాగుచేసే నాథుడు లేడు. మాకు చాలా ఇబ్బందిగా మారింది. తాగునీళ్లు  ఇచ్చి ఆదుకోవాలి. పొలం గట్ల పొంట పోయి వ్యవసాయ బావుల వద్ద నీళ్లు తెచ్చకోవడం ఇబ్బందిగా మారింది.

– జాటోత్‌ కోటి



త్రీఫేజ్‌ కోసం పడి గాపులు...

అన్ని ఊర్లలో తాగునీటి కోసం డబుల్‌ పైపులు వేస్తున్నారు. మా తండాలో తాగునీళ్లు లేవు. ఖాళీబిందెలతో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి త్రీపేజ్‌ కరెంట్‌ కోసం పడిగాపులు కాస్తున్నాం. ఎప్పుడు కరెంటు వస్తే అప్పుడు నీళ్లు తెంచుకుంటున్నా. తండాలోని జనం మొత్తం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడంతో రైతులు కూడా నీళ్లు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు.

– ఊదావత్‌  రాజీ



ఓట్లప్పుడే అన్ని హామీలు..

ఓట్లప్పుడే అన్ని హామీలు ఇస్తారు. ఓట్లు వేశాక ఒక్కటి కూడా అమలు చేయరు. మా తండాలో తాగునీరు లేదు. రోడ్డు, రవాణా సౌకర్యాలు అసలే లువు. ఏ ఆపద వచ్చినా కిలోమీటర్ల దూరంలో ఉన్న  ఆరుట్లకు నడిచిపోవాలి. అనేక సార్లు నాయకులకు, అధికారులకు చెప్పినం. చేస్తామని చెప్పడం తప్ప చేయడం లేదు.

                  –  ఉదావత్‌  బుజ్జి



ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు...

ఎన్నికల ముందు అన్నీ చేస్తామని నాయకులు నమ్మించడం తప్ప ఏమీ చేయడం లేదు. ఓట్లు వేయించుకొని గద్దెనెక్కుతున్నారు. అనేకసార్లు అధికారులకు, వివిధ పార్టీల నాయకులను వేడుకున్నాం. ప్రజాప్రతినిధులు.. అధికారులు కూడా మా తండా గురించి పట్టించుకోవడం లేదు.

                  – ఉదావత్‌ మత్రు నాయక్‌



కరువుతో త్రీవ ఇబ్బంది...

తండాలో నీటికొరత తీవ్రంగా మారింది. ఉన్న రెండు వ్యవసాయ బోర్లు సక్రమంగా నీళ్లు్ల పోయడం లేదు. పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. కరువుతో గొంతు ఎండి చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది.

– వాక్రోత్‌ లక్ష్మి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top