దాహం.. దాహం

దాహం.. దాహం - Sakshi


సాక్షి ప్రతినిధి – నెల్లూరు :   మూడేళ్లుగా జిల్లాలో తిష్ట వేసిన కరువు దెబ్బకు గంగమ్మ అధఃపాతాళానికి చేరింది. పట్టణాల్లో రోజూ నీటిని సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు నగర శివారు ప్రాంతాలకు సైతం ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాల్సి దుస్థితి ఏర్పడింది. జిల్లాలో 348 గ్రామాలు తాగునీటి కోసం గొంతెండుతున్నాయి. కరువు దెబ్బకు పంటలు కోల్పోయిన రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. రబీలో సాగు చేసిన పంటల దిగుబడి తగ్గింది. రుణాల రీ షెడ్యూల్‌  పూర్తిగా జరగలేదు. రైతులకు రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటాయి. వెరసి ఈ వేసవి జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగించబోతోంది. శనివారం నిర్వహిస్తున్న జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమస్యలపై చర్చించి జనాన్ని ఆదుకునే దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.



కరువు మండలాల్లో నీటి కరువు

గత ఏడాదితో పోల్చితే ఈ సారి భూగర్భ జలాలు మరింత అడుగంటాయి. మెట్ట ప్రాంతాల్లో 700 అడుగుల లోతు వేసిన బోర్లలో కూడా నీరు పైకి అందడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌లో ఏర్పడిన దుర్భిక్షం వల్ల రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 27 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లో రైతులను ఆదుకునే పనులు ఎలా ముందుకు సాగుతున్నాయనే విషయం పక్కన పెట్టినా కనీసం తాగునీటి ఇక్కట్లు తీర్చే విధంగా చర్యలు లేవు. జిల్లాలో 17, 343 చేతి పంపులు ఉన్నాయి. వేసవి దెబ్బకు వీటిలో 50 శాతం కూడా సక్రమంగా పని చేయడం లేదు. వీటి మరమత్తుల మీద అధికారులు తగిన శ్రద్ధ చూపడం లేదు. జిల్లాలో 2,697 రక్షిత మంచినీటి సరఫరా పథకాలు ఉంటే ఇందులో 1,702 పాడైపోయాయి.



వీటి మరమ్మతులకు రూ.7 కోట్ల నిధులు అవసరమైతే ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. దీంతో అధికారులు వీటి గురించి పట్టించుకోవడానికి ముందుకు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 36 సమగ్ర మంచి నీటి పథకాలున్నా వాటి పని తీరు కూడా అంతంత మాత్రంగానే వుంది. ఈ కారణాలన్నింటి వల్ల జిల్లాలో 1220 ఆవాసాలు తాగునీటి కోసం అల్లాడుతున్నాయి. 348 గ్రామాల గొంతెండి పోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఈ గ్రామాల ప్రజలు తాగునీటిని  చాలా పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు కార్పొరేషన్‌లోని శివారు ప్రాంతాలకు సైతం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి వుంది. నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, కావలి, గూడూరు మున్సిపాలిటీల్లో కూడా ప్రజల అవసరాలకు తగినంత నీరు సరఫరా చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.



కుదేలైన వ్యవసాయం

ఖరీఫ్‌ సీజన్‌లో 80,120 హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉండగా.. 71,948 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. సీజన్‌ ప్రారంభంలో కురిసిన చిరుజల్లులను నమ్ముకుని రైతులు పంటలు సాగు చేశారు. ఆ తర్వాత వర్షాలు రాలేదు. నారుమళ్లతో పాటు వరి. సజ్జ, పొద్దు తిరుగుడు పంటలు నిలువునా ఎండిపోయాయి. ఖరీఫ్‌ సీజన్‌లో 661.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 197.6 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. 70.1 శాతం వర్షపాత లోటు నమోదైంది. తీవ్ర వర్షాభావం దెబ్బకు జిల్లాలో 5వేల హెక్టార్లలో సాగు చేసిన నిమ్మ, చీని, దానిమ్మ లాంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.



రాష్ట్ర  ప్రభుత్వం 27 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లో  రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, రుణాల రీ షెడ్యూల్, విత్తన రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రుణాల రీ షెడ్యూల్‌కు పాత బకాయిల వడ్డీకి బ్యాంకర్లు ముడిపెట్టడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. కరువు కారణంగా జిల్లా వ్యాప్తంగా రూ.1,173 కోట్ల నష్టం జరిగిందని జిల్లా యంత్రాంగం కేంద్ర కరువు బందానికి నివేదిక ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కరువు రైతుకు నేరుగా అందిన సహాయం ఏదీ లేదు.



40 శాతం తగ్గిన దిగుబడి

రబీలో జిల్లాలో 2,82,121 హెక్టార్ల సాగుకు గాను 1,82,974 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. ఈ పంటలను రక్షించుకోవడానికి సాగునీటి కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. డెల్టా ప్రాంతంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంతచేసినా కొంత మేరకు పంటలు ఎండిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో 40 శాతం మేరకు దిగుబడి తగ్గింది. అంతో ఇంతోచేతికందిన ధాన్యం కొనుగోలులోనూ మిల్లర్లు, దళారులు రైతులను  ముంచేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలకు దిగాల్సి వంది.



నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షతన స్థానిక దర్గామిట్ట జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు పలు సమస్యలపై చర్చించనున్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి, నివారణ చర్యలపై ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top