మేమున్నామని..

మేమున్నామని.. - Sakshi


జమ్మికుంట: అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసి జమ్మికుంట ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కారుపాకల రమకు సాయమందించేందుకు చల్లని చేతులు ముందుకు వస్తున్నాయి. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామంటూ పలువురు దాతలు స్పందిస్తున్నారు. కుటుంబ పోషణ భారమై... సాగులో అప్పులపాలైన వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన రమ అనే నిరుపేద మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే.



భర్త రవి అంధుడు కాగా, పిల్లలు అంజి, అమూల్య చిన్నవారు. చేతిలో చిల్లిగవ్వ లేక చావుబతుకుల మధ్య జమ్మికుంటలోని శ్రీవిజయశ్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈమెకు వైద్యుడు సురంజన్ ఇప్పటివరకు ఖర్చులు భరిస్తూ వచ్చారు. మెరుగైన వైద్యం అందిస్తే బతికే అవకాశం ఉండగా.. దాతలు ఆపన్నహస్తం అందించి తమ తల్లిని కాపాడాలని రమ పిల్లలిద్దరూ వేడుకుంటున్న తీరుపై ‘మా అమ్మను బతికించండి’ శీర్షికన ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించింది. దీనికి పాఠకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మేమున్నామంటూ పలువురు చేయూతనందిస్తున్నారు.


  * స్థానిక నగర పంచాయతీ వైస్ చైర్మన్ బచ్చు శివశంకర్ రూ.5వేలు ఆర్థిక సహాయం అందించారు.


  * పట్టణంలోని విద్యోదయ పాఠశాల  ప్రిన్సిపాల్ మొగిళి రమ వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించారు.


  * ఎంప్లాయీస్ కాలనీకి చెందిన మాడిశెట్టి ఈశ్వరయ్య అనే వికలాంగుడు ఆస్పత్రికి వచ్చి తన నెల పింఛన్ రూ.1,500 అందించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.


 ముందుకొస్తున్న దాతలు


    * రమకు మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. జిల్లాకు చెందిన వి.జగన్మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా... ‘సాక్షి’ కథనాన్ని ఆన్‌లైన్‌లో చూసి గురువారం రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.


    * మానకొండూర్ మండలం కొండపల్కలకు చెందిన టీఆర్‌ఎస్ యూత్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తం రూ.5వేలు ఆర్థిక సహాయం అందిస్తానని తెలిపారు.


      * రామడుగు మండలం వెలిచాలకు చెందిన రైతు గాదె నర్సయ్య రూ.5వేలు ఆర్థికసాయం ప్రకటించారు.


 మెరుగవుతున్న ఆరోగ్యం


 సాక్షిలో రమ కథనాన్ని చదివిన పలువురు దాతలు తాము సాయమందిస్తామంటూ ఫోన్ ద్వారా మాట్లాడుతున్నారు. ఇప్పటికే దాతల చేయూతతో మెరుగైన వైద్యం ప్రారంభించాం. రమను ఆమెను బతికించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. మరింత మెరుగైన చికిత్స అందించేందుకు మరో ఇద్దరు వైద్యులను ఇక్కడికి పిలిపిస్తున్నాను.                

                                                                                                                      -డాక్టర్ సురంజన్


స్పందించిన ఎన్నారైలు


‘మా అమ్మను బతికించండి’ కథనాన్ని ‘సాక్షి’ ఆన్‌లైన్‌లో చూసిన అమెరికాలోని ఎన్నారైలు రమ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారి బంధువులను ఆస్పత్రికి పంపించి రమ పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తాము ఆర్థికసాయం చేస్తామని, మెరుగైన వైద్యం అందించి ఆమెను కాపాడాలని వైద్యులను కోరారు.


ఆరా తీసిన కలెక్టర్


రమ ఆరోగ్యంపై కలెక్టర్ నీతూప్రసాద్ ఆరా తీశారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్ రమ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలంటూ ఆరోగ్యశ్రీ మేనేజర్ విక్రమ్‌ను అదేశించారు. ఆయన ఆస్పత్రికి చేరుకుని రమ పరిస్థితిని పరిశీలించారు. వెంటిలేటర్‌పై ప్రాణాపాయస్థితిలో ఉన్న విషయాన్ని కలెక్టర్‌కు నివేదించారు. రమ కు మెరుగైన వైద్యం చేసి కాపాడాలని కలెక్టర్ సూచించినట్లు ఆరోగ్యశ్రీ అధికారులు సాక్షికి తెలిపారు. ఈ మేరకు తాము చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top